
ప్రైవేటు బస్సు–లారీ ఢీ
ఇచ్ఛాపురం: మండలంలోని బెల్లుపడ జంక్షన్‌లో జాతీయ రహదారిపై శనివారం ప్రైవేటు బస్సు, లారీ ఢీకొట్టుకున్నాయి. అదృష్టవశాత్తు ఆ సమయంలో బస్సులో ముగ్గురు ప్రయాణికులు మాత్రమే ఉండటంతో పెను ప్రమాదం తప్పింది. ఇద్దరికి గాయాలు కావడంతో ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఒడిశాకు చెందిన సంకటతరణి ప్రైవేటు ట్రావెల్స్ బస్సు బరంపురం నుంచి జరడా వైపు బయలుదేరింది. ఒడిశాలోని గొలంత్ర వద్ద చైతన్య పాఠశాల విద్యార్థులు తరుష్(8వ తరగతి), లోహిత్(9వ తరగతి) స్వగ్రామమైన లొద్దపుట్టి వచ్చేందుకు బస్సులో ఎక్కారు. అనంతరం ఇచ్ఛాపురం బస్టాండ్‌లో లొద్దపుట్టి గ్రామానికి చెందిన కృష్ణారావు అనే ప్రయాణికుడు ఎక్కాడు. మరోవైపు భీమవరం నుంచి పశ్చిమబెంగాల్‌కు చేపల లోడుతో లారీ వెళ్తోంది. ప్రైవేటు బస్సు లారీనీ గమనించక బెల్లుపడ జంక్షన్ నుంచి జాతీయ రహదారి–16పైకి ఒక్కసారిగా వచ్చింది. లారీ డ్రైవర్ హఠాత్పరిణామంతో లారీనీ అదుపు చేయలేక బస్సును ఢీకొట్టడంతో బస్సు అద్దాలు పూర్తిగా విరిగిపోయాయి. ఈ ఘటనలో బస్ డ్రైవర్ పక్కసీటులో కూర్చున్న ప్రయాణికుడు ఎగిరిపడి బయటకు జారిపడ్డాడు. ఈ ఘటనలో చాతీ, కాళ్లకు గాయాలయ్యాయి. ఇదే బస్సులో ఉన్న విద్యార్థి తరుష్‌కి స్వల్ప గాయాలయ్యాయి. స్థానికులు ఇచ్చిన సమాచారంతో 108 వాహనంలో క్షతగాత్రులను స్థానిక సీహెచ్‌సీకి తరలించి చికిత్స అందించారు. ప్రయాణికుడిని మెరుగైన చికిత్స నిమిత్తం బరంపురం మెడికల్ ఆస్పత్రికి తరలించారు. ఇచ్ఛాపురం పట్టణ ఎస్సై ముకుందరావు కేసు నమోదు చేసి దర్యాప్తుచేస్తున్నారు.
ఇద్దరికి గాయాలు
ముగ్గురే ప్రయాణికులు ఉండటంతో తప్పిన పెను ప్రమాదం

ప్రైవేటు బస్సు–లారీ ఢీ