మేమెలా బతకాలి? | - | Sakshi
Sakshi News home page

మేమెలా బతకాలి?

Apr 6 2025 1:16 AM | Updated on Apr 6 2025 1:16 AM

మేమెల

మేమెలా బతకాలి?

జీతాలివ్వకపోతే..

అరసవల్లి ఆదిత్యాలయంలో దినసరి వేతనదారుల ఆవేదన

విధులు బహిష్కరించిన 48 మంది సిబ్బంది

ప్రసాదాల తయారీ, విక్రయాలు, అన్నదానం నిలిపివేత

నెలాఖరు వరకు గడువు కోరిన ఈవో భద్రాజీ

అరసవల్లి సూర్యనారాయణ స్వామి దర్శనానికి వచ్చిన భక్తులకు ఎంతో ఇష్టమైనవి పులిహోర, లడ్డూ ప్రసాదాలే. మధ్యాహ్నం భక్తదాతలిచ్చిన విరాళాలతో నిర్వహించే అన్నదాన ప్రసాదానికి సైతం తాకిడి అధికంగానే ఉంటుంది. వీటిని తయారుచేస్తున్న వారిలో 99 శాతం మంది దినసరి వేతనదారులే. వీరంతా శనివారం నిరసనకు దిగడంతో ఉదయం నుంచి వంట మొదలు పెట్టలేదు. పులిహోర సిద్ధం చేయలేదు. ఉదయం 6 గంటల నుంచే అమ్మకాలు ప్రారంభం కావాల్సిన ప్రసాదాల కౌంటర్‌కు తాళాలు పడ్డాయి. నిత్యం పంపిణీ చేసే ఉచిత ప్రసాదాలు నిలిపివేశారు. అన్నదాన ప్రసాదం తయారిపై కూడా మధ్యాహ్నం 11 గంటల వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.ఆ తర్వాత ఈవో భద్రాజీ, విభాగ బాధ్యుడు కె.వి.రమణమూర్తిల విజ్ఞప్తి మేరకు దూర ప్రాంతాల నుంచి వచ్చిన 100 మంది భక్తులకు అన్నదాన ప్రసాదాలు అందేలా దినసరి వేతనదారులే వంటను పూర్తి చేసి భోగం పెట్టించిన అనంతరం భక్తులకు వడ్డించారు. అరసవల్లి ఆలయ చరిత్రలో ఇంతవరకు ఇలాంటి పరిస్థితి రాలేదు. ప్రసాదాలు లేని రోజులు రావడం.. ఇదే తొలిసారి అని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రత్యక్ష దైవం అరసవల్లి సూర్యనారాయణ స్వామి ఆలయం వద్ద శనివారం ఉదయం 6 గంటలకే సర్వదర్శనాల కోసం గుడి తలుపులు తెరుచుకున్నాయి.. వందలాదిగా భక్తులు దర్శనాలకు వచ్చేశారు. కానీ ఆలయం ముందు చెత్తాచెదారాలు అలాగే ఉన్నాయి.. ప్రసాదాల కౌంటర్లు తెరవలేదు..ఉచిత ప్రసాదంతో పాటు లడ్డూ, పులిహోర ప్రసాదాల తయారీ జరగలేదు..అసలేం జరుగుతుందో తెలియక అధికారులు అయోమయానికి గురయ్యారు. ఆలయంలో ఎన్నాళ్ల నుంచో పనిచేస్తున్న 48 మంది దినసరి వేతనదారులంతా తమకు రావా ల్సిన పెండింగ్‌ జీతాలు ఇవ్వాలంటూ డిమాండ్‌ చేస్తూనే.. ఆలయ విధులకు హజరుకాకుండా నిరసనకు దిగడంతో ఈ పరిస్థితి ఏర్పడిందని గుర్తించారు. దర్శనాలు చేసుకుని తిరిగి వస్తున్న భక్తులకు ప్రసాదాలు లేవనే సమాధానం చెబుతుంటే.. ఆదిత్యాలయానికి ఏమయ్యిందనే ప్రశ్నలు భక్తుల నుంచి వ్యక్తమయ్యాయి. ఇలా ఎన్నడూ జరగలేదని పలువురు ఆవేదన వ్యక్తం చేశారు.

అరసవల్లి:

రసవల్లి సూర్యనారాయణ స్వామి వార్షిక కల్యాణ బ్రహ్మోత్సవాలు జరుగుతున్న తరుణంలో శనివారం దినసరి వేతనదారులు విధులు బహిష్కరించారు. నెలల తరబడి పెండింగ్‌లో ఉన్న తమ జీతాలు తక్షణమే చెల్లించాలని డిమాండ్‌ చేస్తూ ఈవో వై.భద్రాజీ కార్యాలయం ఎదుట భైఠాయించారు. ఇంతవరకు జీతాలు ఇస్తామంటూ కాలయాపన చేశారని.. వారం రోజులుగా విజయవాడ వెళ్లి కూడా తమ సమస్యకు పరిష్కారం చూపకపోవడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో కూడా చాలాసార్లు ఈవో చెప్పారని, ఎమ్మెల్యే చెప్పారని ఊరుకున్నామని.. ఆఖరికి మంత్రి కూడా భరోసా ఇచ్చినా తమ సమస్య పరిష్కారం కాలేదని వాపోయారు. ఇప్పటికే ఆర్థికంగా ఎంతో నష్టపోయామని, కుటుంబాలతో నెట్టుకురావడం కష్టమైపోయిందని..ఇకనైనా తమకు న్యాయం చేయాలని అధికారులకు విజ్ఞప్తి చేశారు. ఆలయ పారిశుద్ధ్యం, అన్నదాన వంట, ప్రసాదాల తయారి తదితర కీలక విభాగాలతో పాటు టికెట్ల విరాళాలు, ఆర్జిత సేవల టికెట్‌ కౌంటర్ల విధులకు దినసరి వేతనదారులెవ్వరూ వెళ్లకుండా నిరసనను కొనసాగించారు.

కూటమి ప్రభుత్వం వచ్చాకే..

గత ప్రభుత్వం ఉన్నంతవరకు అరసవల్లి ఆలయంలో దినసరి వేతనదారులు ఎప్పటికప్పుడు జీతాలను అందుకునే వారు. రెగ్యులర్‌ నియామకాలు లేకపోవడంతో దినసరి వేతనదారులే అన్ని పనులకు కీలకంగా మారారు. కూటమి ప్రభుత్వం వచ్చాక ఇక్కడ పనిచేస్తున్న 48 మందిపై వేటు వేస్తూ నిర్ణయాన్ని ప్రకటించారు. మంత్రి అచ్చెన్నాయుడు అయితే జిల్లా కలెక్టర్‌, కీలక అధికారుల సమక్షంలో వీరిని తొలిగించాలంటూ ఆదేశాలు జారీ చేశారు. అలా వీరంతా రోడ్డున పడ్డారు. అప్పటి వరకు వస్తాయనుకున్న పెండింగ్‌ జీతాలు నిలుపుదల చేశారు. తర్వాత రథసప్తమి ఉత్సవాల సందర్భంగా బాధితులంతా మంత్రి అచ్చెన్నాయుడు, ఎమ్మెల్యే శంకర్‌లను వేడుకున్నప్పటికీ తమకు న్యాయం జరగలేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సమస్య పరిష్కారమయ్యే వరకు ఏదో ఒక రూపంలో తమ నిరసనను కొనసాగిస్తామంటూ కీలకంగా వ్యవహరిస్తున్న కొందరు వేతనదారులు ‘సాక్షి’ వద్ద స్పష్టం చేశారు.

ఈవో చర్చలు..

ప్రసాదాల్లేవ్‌..

అన్నదానం లేదు..

రెగ్యులర్‌ సిబ్బంది మినహా మిగిలిన దినసరి వేతనదారులంతా నిరసనకు దిగడం సంచలనంగా మారింది. దీంతో హుటాహుటిన ఆలయానికి వచ్చిన ఈఓ భద్రాజీ.. దినసరి వేతనదారులను పిలిపించి చర్చించారు. వార్షిక కల్యాణ మహోత్సవాలు జరుగుతున్న వేళ ప్రసాదాలు తయారీ, అన్నదానాన్ని ఆపేసి నిరసనలకు దిగడమేంటని ప్రశ్నించారు. పెండింగ్‌ జీతాల అంశం రాష్ట్ర దేవదాయ శాఖ కమిషనర్‌ రామచంద్రమోహన్‌ వద్ద ప్రస్తావించామని, ఈ నెలాఖరు వరకు నిరసనలు చెయ్యొద్దని..తర్వాత మీ ఇష్టమని స్పష్టం చేశారు. ఆలయ ప్రధానార్చకులు ఇప్పిలి శంకరశర్మ మాట్లాడుతూ కల్యాణ మహోత్సవాలు జరుగుతున్న తరుణంలో ఇలా భక్తులకు ఇబ్బందులు పెట్టొద్దని, ఉన్నతాధికారులు ఈనెలాఖరులోగా నిర్ణయాన్ని ప్రకటించే అవకాశముందని..అంతవరకు సహకరించాలని కోరారు. అయినప్పటికీ దినసరి వేతనదారులు ఎలాంటి స్పందనను తెలియజేయకుండానే వెనుదిరిగారు. తమ సమస్యలపై ఎప్పుడు అడిగినా ఇలాగే చెబుతున్నారని, తమను పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

మేమెలా బతకాలి? 1
1/2

మేమెలా బతకాలి?

మేమెలా బతకాలి? 2
2/2

మేమెలా బతకాలి?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement