
‘డైట్’లో అధ్యాపక ఖాళీల భర్తీ
శ్రీకాకుళం న్యూకాలనీ: జిల్లాలోని వమ్మరవల్లి డైట్ కళాశాలలో ఖాళీగా ఉన్న బోధన సిబ్బందిని ఫారిన్ సర్వీస్ నియామక నిబంధనల మేరకు డిప్యుటేషన్ పద్ధతిలో నియామకం చేయనున్నట్టు జిల్లా విద్యాశాఖ ప్రకటించింది. ఈ మేరకు డీఈఓ డాక్టర్ ఎస్.తిరుమల చైతన్య తాజాగా విడుదల చేసిన షెడ్యూల్‌లో పేర్కొన్నారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ/జిల్లా పరిషత్/మున్సిపల్ యాజమాన్య పాఠశాలల్లో పని చేస్తూ.. ఆసక్తి కలిగిన స్కూల్ అసిస్టెంట్, ప్రధానోపాధ్యాయులు, మండల విద్యాశాఖ అధికారులు ఈ నెల 10వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. వమ్మరవల్లి డైట్‌లో వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 5 సీనియర్ సీనియర్ లెక్చరర్ల పోస్టులు, మరో 17 లెక్చరర్ పోస్టులను భర్తీ చేయనున్నట్టు చెప్పారు. డీడీఓల ద్వారా సంబంధిత హెచ్‌ఎంలు, ఎంఈఓలు, డీఈఓ ల ద్వారా డైట్ ప్రిన్సిపాల్‌కు దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుందన్నారు. అభ్యర్థులు 2025 మార్చి 31వ తేదీ నాటికి 58 ఏళ్లలోపు ఉండాలన్నారు. సంబంధిత సబ్జెక్టులో 50 శాతం, ఎంఈడీలో 55 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించాలని, కనీ సం ఐదేళ్ల సర్వీసు పూర్తిచేసి ఉండాలన్నారు. షెడ్యూల్ ప్రకారం ఈనెల 10వ తేదీతో దరఖాస్తుల స్వీకరణకు గడువు ముగుస్తుందని, ఈనెల 11 నుంచి 13వ తేదీల మధ్యలో దరఖాస్తుల పరిశీలన జరుగుతుందని, అర్హత పొందిన దరఖాస్తుదారులకు ఈ నెల 16, 17వ తేదీల్లో రాత పరీక్ష జరుగుతుందని, 19వ తేదీన ఇంటర్వ్యూలను నిర్వహించడం జరుగుతుందన్నారు. అర్హులైన వారికి డిప్యుటేషన్ ఉత్తర్వు లు ఈ నెల 21వ తేదీన అందజేయనుండగా, 22న విధుల్లో చేరాల్సి ఉంటుందని షెడ్యూల్‌లో పేర్కొన్నారు. పూర్తి వివరాలకు, దరఖాస్తు ఫారం కోసం ‘డీఈఓ శ్రీకాకుళం ఓఆర్జీ’ వెబ్‌సైట్‌ను సంప్రదించాలని డీఈఓ సూచించారు.
ఈ నెల 10వ తేదీ వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం
16, 17వ తేదీల్లో రాత పరీక్ష,
19న ఇంటర్వ్యూల నిర్వహణ
డిప్యుటేషన్ విధానంలో 5 సీనియర్ లెక్చరర్స్, 17 లెక్చరర్స్ పోస్టుల భర్తీ

‘డైట్’లో అధ్యాపక ఖాళీల భర్తీ