జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం
ఒకరు మృతి, మరొకరి పరిస్థితి విషమం
ఎచ్చెర్ల క్యాంపస్
కేశవరావుపేట పంచాయతీ పరిధి కింతలిమిల్లు సమీపంలో జాతీయ రహదారిపై ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో బస్వా హరిప్రసాద్ (23) అనే యువకుడు మృతి చెందారు. వెనుక కూ ర్చున్న జలుమూరు వేణు తీవ్రంగా గాయపడ్డాడు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..
శ్రీకాకుళం నుంచి వీరిద్దరూ డ్యూక్ బైక్‌పై ఎచ్చెర్ల వైపు వస్తున్నారు. కింతలిమిల్లు నుంచి వీరు కొన్ని సెకన్ల వ్యవధిలో సర్వీస్ రోడ్డుకు వెళ్లనున్నారు. ఈ క్రమంలో ముందు వెళుతున్న వ్యాను ను బైక్‌తో ఢీకొట్టారు. దీంతో బండి అదుపు తప్పి ఓ లారీని తాకింది. దీంతో ఇద్దరూ బైక్‌పై నుంచి తుళ్లి పడిపోయారు. అదే సమయానికి అటుగా ఆర్టీసీ బస్సు వస్తుండడంతో సరిగ్గా బస్సు వెనుక చక్రం కింద పడిపోయారు. టైరు శరీరం మీద నుంచి వెళ్లిపోవడంతో హరిప్రసాద్ అక్కడికక్కడే మృతి చెందాడు.
వేణు కళ్లు, ఇతర శరీర భాగాలపై నుంచి బస్సు టైరు వెళ్లిపోవడంతో తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు వెంటనే స్పందించి 108 సాయంతో అతడిని శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించారు. అక్కడి నుంచి మరో ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు. హరిప్రసాద్ మృతదేహాన్ని రిమ్స్‌కు తరలించారు. ఆర్టీసీ బస్సును స్టేషన్‌కు తరలించారు. బస్సులో ప్రయాణికులను వేరే బస్సులో పంపించారు. ఎచ్చెర్ల ఎస్‌ఐ వి.సందీప్ కుమార్‌తో కూడిన పోలీస్ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని ట్రాఫిక్ సమస్య పరిష్కరించి, సహాయ చర్యలు చేపట్టారు.
వీరే ఆధారం..
మృతి చెందిన బస్వా హరిప్రసాద్ శ్రీకాకుళం పట్టణంలో బంగారు దుకాణంలో పని చేస్తున్నాడు. తల్లి రమణమ్మ వస్త్ర దుకాణంలో చేస్తుంది. కష్టాన్ని నమ్ముకుని వీరు బతుకుతున్నారు. తండ్రి కుంటుంబానికి దూరంగా ఉన్నా తల్లి పిల్లలను పెంచి పెద్దచేసింది. మృతునికి దిలీప్ అనే అన్నయ్య ఉన్నారు. హరి మృతితో జరజాం గ్రామంలో విషాదం అలముకుంది.
అలాగే గాయపడిన వేణుది ఎచ్చెర్ల గ్రామం. పాలిటెక్నిక్ డిప్లమా పూర్తి చేసి ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నాడు. హరి, వేణులు ప్రాణ స్నేహితులు. వేణు తండ్రి గోపి ఆర్టీసీ డ్రైవర్‌గా పనిచేస్తుండేవారు. 2020లో కోవిడ్‌తో మృతి చెందాడు. ప్రమాద సంఘటన తెలిసిన వెంటనే కుటుంబ సభ్యులు ఆస్పత్రికి వెళ్లారు. అతివేగం, ప్రమాద సమయంలో బండిపై నియంత్రణ కోల్పోవడం ప్రమాదానికి కారణమని పోలీసులు భావిస్తున్నారు. రోడ్డు ప్రమాదంపై ఎచ్చెర్ల పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

వెంటాడిన మృత్యువు

వెంటాడిన మృత్యువు