
సందడిగా సాగర తీరం
వజ్రపుకొత్తూరు రూరల్: జిల్లాలో అతి పెద్ద మత్స్యకార గ్రామమైన నువ్వలరేవులో సీతారాముల కల్యాణం వైభవంగా జరిగింది. ఉద యం పెద్ద సంఖ్యలో మహిళలు, యువతీ యువకులు గ్రామ పెద్దలు, బెహరాలు, పూజారులతో కలిసి రామాలయం వద్ద శ్రీరాముడి జెండాను ఆవిష్కరించారు. కల్యాణ వేడుకలలో భాగంగా అలయం వద్ద పందిరి రాట వేసి ముత్తైదువులు అంతా కలిసి గుమ్మాలు అర్చించారు. అనంతరం అధిక సంఖ్యలో భ క్తులు ఆలయం వద్ద బారులు తీరారు. అలాగే గ్రామ దేవత బృందావతి అమ్మవారికి సైతం ప్రత్యేక పూజలు చేశారు. శ్రీరామ నవమి వేడుకల్లో ప్రధాన ఘట్టమైన సీతారాములు కల్యాణం కన్నుల పండుగగా నిర్వహించారు.
10న పాతపట్నంలో జాబ్‌మేళా
పాతపట్నం: పాతపట్నం ప్రభుత్వ మోడల్ డిగ్రీ కళాశాలలో స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 10వ తేదీన జాబ్‌మేళా నిర్వహించనున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ కె.శ్రీరాములు ఓ ప్రకటనలో తెలిపారు. ఈ జాబ్‌మేళాలో పలు కంపెనీలు పాల్గొంటాయని, పదో తరగతి, ఇంటర్, డిప్లమా, డిగ్రీ చదివిన నిరుద్యోగులు మేళాను సద్వినియోగం చేసుకోవాలని ప్రిన్సిపాల్ కోరారు.
‘రఘువంశం’ పుస్తకావిష్కరణ
శ్రీకాకుళం కల్చరల్: స్థానిక ఉపనిషన్మందిరంలో జరుగుతున్న శ్రీరామ వసంత నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా కర్రి భాస్కరరావు అందించిన ‘రఘువంశం’ పుస్తకావిష్కరణ మందిరం ఉపాధ్యక్షులు పప్పు పతంజలి శాస్త్రి చేతులమీదుగా జరిగింది. పుస్తక పరిచయాన్ని డాక్టర్ సనపల నారాయణమూర్తి చేస్తూ మహా కవి వాల్మీకి మహర్షి తర్వాత అంతటి గొప్ప కవి కాళిదాసని, ఉపమానం చెబితే కాళిదాసే చెప్పాలని అన్నారు. ఈ పుస్తకంలో 20 అంశాలు అన్ని విషయాలను స్పృశిస్తూ రచయిత అందించారని అన్నారు. కార్యక్రమంలో చాగంటి బాపయ్యపంతులు, పట్నాయిక్, మందుల మోహనరావు, కోమలరావు, నిష్టల నరసింహమూర్తి, వెంకటరమణ, ఈశ్వరరావు, మల్లేశ్వరరావు, కామేశ్వరరావు, విశ్వేశ్వరరావు, సీత, పద్మావతి, ఉమ తదితరులు పాల్గొన్నారు.
‘ఎస్సీ వర్గీకరణలో లోపాలున్నాయి’
శ్రీకాకుళం (పీఎన్ కాలనీ): ఎస్సీ వర్గీకరణ చేయటంలో అనేక లోపాలున్నాయని, సమగ్ర సమాచారం లేకుండా అసంపూర్తిగా ఉందని ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి సభ్యులు అన్నారు. ఈ మేరకు ఆదివారం అంబేడ్కర్ విజ్ఞాన మందిర్‌లో ఆదివారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎస్సీ కులంలో కొందరిపై కక్ష కట్టి వర్గీకరణ చేయడం వెనుక ప్రభుత్వ దురుద్దేశం ఉందన్నారు. సరైన డేటా లేకుండా, కనీసం అసెంబ్లీలోనూ, శాసనమండలిలోనూ, చర్చించకుండా నిరంకుశంగా తప్పుడు సమాచారం ఆధారంగా వర్గీకరణ చేయడం సరికాదన్నారు. జిల్లాల యూనిట్‌గా వర్గీకరణ చేయాలని, పెరిగిన జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్ల పెంచాలని, జోనల్ స్థాయిలో ఏ విధంగా రిజర్వేషన్లు అమలు చేస్తారో తెలియజేయాలని డిమాండ్ చేశారు. వర్గీకరణ జరిగే విధానంలో లోపాలపై ఇంప్లీడ్ పిటిషన్లు వేసి వర్గీకరణ రద్దయ్యే వరకు కోర్టు ద్వారా పోరాటం చేస్తామన్నారు. లేదంటే భవిష్యత్‌లో ఎస్సీల ఆగ్రహానికి గురికావాల్సి ఉంటుందని హెచ్చరించారు. కార్యక్రమంలో పోత ల దుర్గారావు, లింగాల అప్పన్న, అంపోలు ప్రతాప్, నూతలపాటి భరత్ భూషణ్‌రాజ్, దండాసి రాంబాబు (జాన్), డి.రామప్పడు, ధర్మాన గణేష్, సీర రమేష్ బాబు, పడాల ప్రతాప్ కుమార్, కరగాన దామోదర్ రావు, కన్నేపల్లి అప్పలరాజు తదితరులు పాల్గొన్నారు.

సందడిగా సాగర తీరం

సందడిగా సాగర తీరం