అరసవల్లి: ప్రత్యక్ష దైవం అరసవల్లి సూర్యనారాయణ స్వామిని వైఎస్సార్ సీపీ నేత, మాజీ ఉపముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ కుటుంబసమేతంగా ఆదివారం దర్శించుకున్నారు. ఆలయ ఈవో వై.భద్రాజీ, ప్రధానార్చకులు ఇప్పిలి శంకరశర్మలు గౌరవ స్వాగతం పలికి అంతరాలయ దర్శనం చేయించారు. గోత్రనామాలతో ప్రత్యేక పూజలు చేయించిన అనంతరం ఆలయ విశిష్టత, పర్వదినాలపై వివరించారు. కార్యక్రమంలో ఆలయ పాలకమండలి సభ్యుడు మండవిల్లి రవి తదితరులు పాల్గొన్నారు.
నిత్యాన్నదానానికి రూ.లక్ష విరాళం
అరసవల్లి: అరసవల్లి సూర్యనారాయణ స్వామి ఆలయంలో నిత్యాన్నదాన పథకానికి జిల్లాకు చెందిన రిటైర్డ్ ఆడిట్ అధికారి వలివేటి శ్రీదేవి తన అన్నయ్య దివంగత జయరామారావు పేరిట రూ.1,00,001 విరాళాన్ని ఈవో వై.భద్రాజీకి ఆదివారం అందజేశారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ రూ.లక్ష అంతకు మించి విరాళాలు ఇచ్చిన దాతలకు పర్వదినాల్లో విశిష్ట దర్శనం కోసం పాస్ అందజేస్తామన్నారు. కార్యక్రమంలో ఆలయ అర్చకులు ఇప్పిలి రంజిత్‌శర్మ తదితరులు పాల్గొన్నారు.
ఉత్సాహంగా వాలీబాల్ పోటీలు
గార: అంపోలు జెడ్పీ హైస్కూల్ మైదానంలో మండల స్థాయి వాలీబాల్ పోటీలు ఆదివారం సందడిగా ప్రారంభమయ్యాయి. ఈ నెల 8న జరగనున్న గ్రామదేవత ఉత్సవాలు (శివయ్య పండగ) సందర్భంగా స్థానిక యువత ఏర్పాటు చేసిన ఈ పోటీలను ఉదయం పోటీలను డీసీఎంఎస్ మాజీ చైర్మన్ గొండు కృష్ణమూర్తి, ఎంపీపీ గొండు రఘురామ్, సర్పంచ్ గొండు జయరాం, గొండు అచ్యుతరావు, వెలమల శ్రీనువాసరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యువత ఇటువంటి క్రీడా పోటీలను నిర్వహించడం సంతోషకరమన్నారు.
విద్యార్థి నిజాయితీ
ఇచ్ఛాపురం టౌన్ : పట్టణంలోని గిలాయి వీధికి చెందిన తొమ్మిదో తరగతి విద్యార్థి బి.చంటి తనకు దొరికిన సెల్‌ఫోన్‌కు పోలీసులకు అప్పగించి నిజాయితీ చాటుకున్నాడు. ఆదివారం స్వేచ్ఛావతి అమ్మవారి ఆలయానికి వెళ్లి తిరిగి వస్తుండగా చంటికి సెల్‌ఫోన్ దొరికింది. అక్కడ వాకబు చేసినా ఫలితం లేకపోవడంతో ఇంటికి వెళ్లి తన తండ్రి శ్రీనివాస్‌కు విషయం చెప్పాడు. అనంతరం పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి సీఐ ఎం.చిన్నమనాయుడుకు ఫోన్‌ను అప్పగించాడు. పట్టణంలోని డబ్బూరివీధికి చెందిన పి.ఆకాష్ ఫోన్‌గా గుర్తించి విద్యార్థి చేతుల మీదుగా ఫోన్‌ను అందజేశారు. ఈ సందర్భంగా చంటిని సీఐ, పట్టణ ఎస్‌ఐ ఎం.ముకుందరావు అభినందించారు.
ఆకట్టుకున్న సంగీత విభావరి
శ్రీకాకుళం కల్చరల్: నగరంలోని పాలకొండ రోడ్డులో కోదండ రామాలయంలో జరుగుతున్న శ్రీరామనవమి ఉత్సవాల్లో భాగంగా ఆదివారం సాయంత్రం సంగీత విభావరి నిర్వహించారు. డి.రామారావు ఆధ్వర్యంలో మహిళలు శ్రీరాముడి కీర్తనలు, గీతాలను చక్కగా ఆలపించారు. కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

ఆదిత్యుని సన్నిధిలో మాజీ మంత్రి కొట్టు

ఆదిత్యుని సన్నిధిలో మాజీ మంత్రి కొట్టు