
అగరబత్తీలు తయారుచేస్తున్న ప్రత్యేక అవసరాల పిల్లలు
దివ్యాంగుల మనోవికాసానికి కృషి చేస్తున్న నిర్వాహకులు
శ్రీకాకుళం కల్చరల్: వారంతా మానసిక దివ్యాంగులు. సొంతంగా ఆలోచించే శక్తి తక్కువ. అయితేనేం.. తమను ప్రోత్సహిస్తే సకలాంగులకు ఏమాత్రం తీసిపోమని నిరూపిస్తున్నారు. సహజ సిద్ధ వనరులను ఉపయోగిస్తూ అగరబత్తీలు, ధూప్ స్టిక్స్, రంగులు, దీపావళి ప్రమిదలు తయారు చేస్తూ స్ఫూర్తిగా నిలుస్తున్నారు. జిల్లా కేంద్రంలోని హౌసింగ్ బోర్డు కాలనీలోని బెహరా మనోవికాస కేంద్రంలో 74 మంది బుద్ధిమాంద్యం గల వారు ఉన్నారు. వీరికి కేంద్రం నిర్వాహకులు ప్రత్యేక శిక్షణలు ఇచ్చి వారిలో మానసిక స్థైర్యం పెంపొందిస్తున్నారు.
ప్రత్యేక శిక్షణ..
బెహరా మనోవికాస కేంద్రంలో క్రాఫ్టిజెన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో చిన్నారులకు పర్యావరణ హాని లేని వస్తువుల తయారీపై శిక్షణ ఇప్పించారు. స్కిల్లింగ్ అనే కార్యక్రమం ద్వారా అగరబత్తీల తయారీ, హోలి రంగులు, కొవ్వొత్తులు, పేపర్ బ్యాగులు వంటి ఉత్పత్తులను ఏ విధంగా తయారు చేయాలో నేర్పించారు. ప్రధానంగా అగరబత్తీలను తయారు చేయడంలో ఇక్కడి చిన్నారులు ప్రావీణ్యం సంపాదించారు.
అగరబత్తీ తయారీ ఇలా..
అగరబత్తీని తయారు చేసేందుకు పెద్ద మొత్తంలో వివిధ రకాల పూలు సేకరిస్తారు. గాలిలో బాగా ఆరబెట్టి పూర్తిగా ఎండాక మిషన్‌లో వేసి పౌడర్‌గా తయారు చేస్తారు. అందులో మిక్సింగ్ పౌడర్, ఎసెన్స్ కలిపి ముద్దగా చేస్తారు. దానిని పుల్లలకు చుట్టి నీడలో ఆరబెడతారు. పూర్తిగా ఎండిపోయాక 50 పుల్లలను ఒక ప్యాకెట్‌గా సిద్ధం చేస్తారు. వీటితో పాటు ధూప్ స్టిక్స్ కూడా తయారు చేస్తున్నారు. ఒక
ప్యాకెట్ ధర రూ.30, ధూప్ స్టిక్స్ ప్యాకెట్ రూ.15గా అమ్మకం చేస్తున్నారు. వీరు తయారు చేసిన ఉత్పత్తులకు మార్కెటింగ్ చేయడానికి కూడా సంస్థ ప్రతినిధులు సహకరిస్తున్నారు. దీంతో పిల్లలకు శారీరక, మానసిక ఉల్లాసం కలిగి వారి ఆరోగ్యం కొంత మెరుగుపడటంతో పాటు కొంత ఆర్థిక స్వావలంబన చేకూరుతోంది.
ఉత్సాహంగా ఉంది..
అగరబత్తీలు చేయడం ఉత్సాహాన్నిస్తోంది. పూల పౌడర్‌ను ఎసెన్స్‌తో కలిపి ముద్దను తయారు చేసి తర్వాత పుల్లలతో అగరబత్తీను తయారు చేస్తాం.
– గోపి, బెహరా మనోవికాస కేంద్రం
శిక్షణ ఇచ్చారు
అగరబత్తీల తయారీకి ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. అందరం కలసి నేర్చుకున్నాం. హోలీ రంగులు కూడా తయారు చేస్తాం. వీటిని చేసేటప్పుడు ఆసక్తికరంగా ఉంటుంది.
– సాయితేజ, బెహరా మనోవికాస కేంద్రం
మానసిక ఎదుగుదలకు కృషి
ప్రత్యేక అవసరాల పిల్లల మెదడుకు పదును పెట్టి సృజనాత్మకత పెంచేందుకు వివిధ వస్తువుల తయారీలో శిక్షణ ఇస్తున్నాం. ఇక్కడి వచ్చే సందర్శకులు వీటిని కొనుగోలు చేస్తుంటారు. ఇలా చేయడం ద్వారా మానసిక దివ్యాంగులకు ప్రోత్సాహం అందించిన వారవుతారు.
– శ్యామల, మనోవికాస కేంద్రం నిర్వాహకురాలు
ఎండిన పూలతో..
ఎండిన పూలను మిషన్‌లో వేసి పౌడర్ చేస్తాను. ఒకే రంగులొ ఉన్నవి ఒకేసారి మిషన్‌లో వేస్తాం. అలా రకరకాల పౌడర్లు సిద్ధం చేసి అగరబత్తీలు చేయడం బాగుంది.
– శివ, బెహరా మనోవికాస కేంద్రం

అగరబత్తీలు తయారుచేస్తున్న ప్రత్యేక అవసరాల పిల్లలు

అగరబత్తీలు తయారుచేస్తున్న ప్రత్యేక అవసరాల పిల్లలు