
ప్రజలకు రక్షణ కల్పించండి
టెక్కలి: టెక్కలి నియోజకవర్గంలో మంత్రి అచ్చెన్నాయుడి అండతో టీడీపీ కార్యకర్తలు చేస్తున్న దౌర్జన్యాల నుంచి సామాన్య ప్రజలు, వైఎస్సార్‌సీపీ కార్యకర్తలతో పాటు అధికారులకు రక్షణ కల్పించాలని వైఎస్సార్‌సీపీ టెక్కలి నియోజకవర్గ ఇన్‌చార్జి పేరాడ తిలక్ కోరారు. ఈ మేరకు జిల్లా కేంద్రంలో కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్‌తో పాటు ఎస్పీ కె.వి.మహేశ్వర్‌రెడ్డిని సోమవారం కలిసి వినతిపత్రాలు అందజేశారు. ఇటీవల సంతబొమ్మాళి మండల టీడీపీ అధ్యక్షుడు జీరు భీమారావు కలెక్టర్, ఆర్డీవోపై చేసిన దూషణతో పాటు మూలపేట సర్పంచ్ జీరు బాబురావును చంపేస్తానంటూ బెదిరించిన ఘటనలపై చర్యలు తీసుకోవాలని విన్నవించారు. కోటబొమ్మాళి మండలం సింహాద్రిపురం గ్రామంలో సామాన్య రైతులకు చెందిన భూముల్లో దౌర్జన్యంగా రోడ్లు వేయడమే కాకుండా, అడ్డువచ్చిన వారిపై దాడులు చేసిన ఘటనలను వివరించారు. అలాగే సంతబొమ్మాళి మండలం జగన్నాథపురం సర్పంచ్ రాములమ్మకు చెందిన స్థలంలోని కొబ్బరి చెట్లును రాజకీయ కక్షతో అన్యాయంగా తొలగించడమే కాకుండా, ఆమైపె కేసులు నమోదు చేశారని తెలిపారు. కమలనాభపురం గ్రామంలో అన్యాయంగా వృద్ధాప్య పింఛన్ల నిలిపివేతపై ఆవేదన వ్యక్తం చేశారు. వీటితో పాటు మరికొన్ని దౌర్జన్యాలు, కక్ష సాధింపు చర్యలపై జిల్లా అధికారులకు విన్నవించారు. ఆయనతో పాటు కోటబొమ్మాళి జెడ్పీటీసీ దుబ్బ వెంకట్రావు, నాయకులు ఎస్.హేమసుందర్‌రాజు, బి.మోహన్‌రెడ్డి, పి.వెంకట్రావు, రాములమ్మ, బాబురావు, శివారెడ్డి తదితరులు ఉన్నారు.