
టీడీపీ నేతలపై చర్యలు తీసుకోండి
శ్రీకాకుళం పాతబస్టాండ్: అధికార బలంతో గ్రామాల్లో టీడీపీ నేతలు అడ్డగోలుగా చేపడుతున్న పనులపై చర్యలు తీసుకోవాలని వైఎస్సార్‌సీపీ ఆమదాలవలస నియోజకవర్గ సమన్వయకర్త చింతాడ రవికుమార్ కోరారు. ఈ మేరకు పీజీఆర్‌ఎస్‌లో కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్‌కు సోమవారం వినతిపత్రం అందజేశారు. పొందూరు మండలంలోని తానేం గ్రామంలో ఎన్‌ఆర్‌ఈజీఎస్ నిధులతో ప్రైవేటు లే అవుట్‌కి రోడ్డు వేశారని తెలిపారు. నిజానికి ఆ రోడ్డుకి ఆనుకొని ఎటువంటి నివాసాలు లేవని పేర్కొన్నారు. దీనికోసం సుమారుగా రూ.28 లక్షల నిధులు దుర్వినియోగం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే ఆమదాలవలసలో రెచ్చిపోతున్న ఇసుక మాఫియాపై చర్యలు తీసుకోవాలని విన్నవించారు. నకిలీ బిల్లులతో శ్రీకాకుళం నుంచి విశాఖపట్నంకు విచ్చలవిడిగా ఇసుక రవాణా చేస్తున్నారన్నారు. అదేవిధంగా సరుబుజ్జిలి మండలంలోని గోనెపాడు పంచాయతీలో రైతుల రెవెన్యూ రికా ర్డులు సరిచేయాలని కోరారు. చిగురువలస పంచాయతీ ప్రభుత్వ పాఠశాల ఆవరణలో కోర్టులో పెండింగ్ ఉన్న స్థలంలో అక్రమంగా రాత్రికి రాత్రి సీసీ రోడ్డు నిర్మాణం చేశారని, దీనిపై చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. బూర్జ మండలం నీలాదేవిపురంలో ఉపాధి పనుల మేట్ల నియామకాల్లో మండల అధికారులు అత్యుత్సాహం చూపుతున్నారని వివరించారు. పొందూరు మండలంలోని గోకర్ణపల్లి గ్రామంలో అక్రమంగా తొలగించిన వీవోఏని తిరిగి విధుల్లోకి తీసుకోవాలని కోరారు.