
ఆదిత్యపురిలో పెళ్లి సందడి
అరసవల్లి: సూర్యనారాయణ స్వామి వార్షిక కల్యాణ మహోత్సవానికి ఆదిత్యపురి సిద్ధమైంది. వివాహ క్రతువులో భాగంగా సోమవారం ఉషా పద్మిని ఛాయా దేవేరులతో శ్రీ వారి కల్యాణ మూర్తులను అనివెట్టి మండపంలో వేంచేసింప జేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ ప్రధానార్చకులు ఇప్పిలి శంకరశర్మ ఆధ్వర్యంలో అర్చక బృందం వేదమంత్రోచ్ఛరణలు, మంగళధ్వనుల మధ్య సుగంధ ద్రవ్యాల మర్ధన (కొట్నం దంపు) కార్యక్రమాన్ని నిర్వహించారు. దుంప పసుకుకొమ్ములు, జాజికాయ, జాపత్రి, వట్టివేళ్లు, పచ్చ కర్పూరం, కుంకుమపువ్వు తదితర సుగంధద్రవ్యాలను దంచుతూ... ‘సువ్వి’ అంటూ ఉత్సవ సంప్రదాయ కీర్తనలను శంకరశర్మ బృందం ఆలపించారు. స్వామివారి వార్షిక కల్యాణోత్సవం మంగళవారం రాత్రి 8.30 గంటల నుంచి జరగనుంది.
జాబ్‌మేళా పోస్టర్ విడుదల
శ్రీకాకుళం పాతబస్టాండ్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జాబ్ మేళాపై రూపొందించిన పోస్టర్‌ను కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్‌తో కలిసి సోమవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఆవిష్కరించారు. కలెక్టర్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ జాబ్ మేళాకి ఎస్‌ఎస్‌సీ, ఇంటర్మీడియెట్, డిగ్రీ, ఐటీఐ, బి ఫార్మసీ, చదువుకుని 18–30 ఏళ్ల మధ్య వయసు గల నిరుద్యోగ యువత అర్హులని తెలిపారు. ఈ నెల పదో తేదీన గురువారం ఉదయం 9 గంటల నుంచి ప్రభుత్వ డిగ్రీ కళాశాల, పాతపట్నంలో జాబ్‌మేళా నిర్వహిస్తారని, 15 కంపెనీల ప్రతినిధులు హాజరవుతారని పేర్కొన్నారు.