
‘ఆధార్ సేవలు వినియోగించుకోండి’
శ్రీకాకుళం పాతబస్టాండ్: ఆధార్ సేవలు ప్రజలకు సులభంగా అందించేందుకు ప్రభుత్వం ప్రణాళిక అమలు చేస్తోందని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ తెలిపారు. ఈ మేరకు సోమ వారం ఓ ప్రకటన విడుదల చేశారు. జిల్లాలోని 732 గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రతి ఐదు సచివాలయాలకు ఒక ఆధార్ సెంటర్ ఏర్పా టు చేశామని, ఇప్పటివరకు 146 ఆధార్ కిట్లు అందుబాటులోకి తీసుకువచ్చామని వివరించా రు. ఇంకా 37 కేంద్రాలు ఈ నెలాఖరుకు అందుబాటులోకి రానున్నాయని, ఆధార్‌కు సంబంధించిన కొత్త కార్డు నమోదు, డాక్యుమెంట్ అప్‌డేట్, 5 నుంచి ఏడేళ్లు, 15 నుంచి 17 సంవత్సరాల వయసుగలవారి మాండేటరీ బయోమెట్రిక్ అప్‌డేట్, మొబైల్ నెంబర్ అనుసంధా నం వంటి సేవలు ఈ ఆధార్ కేంద్రాల్లో లభ్యమవుతున్నాయని కలెక్టర్ వెల్లడించారు. ప్రజల సౌకర్యార్థం ప్రతి నెలలో 8 రోజుల పాటు గ్రామ వార్డు సచివాలయ శాఖ ఆధ్వర్యంలో క్యాంప్ మోడ్‌లో ఆధార్ సేవలు అందిస్తున్నారని వివరించారు. ముఖ్యంగా ఆరేళ్లలోపు పిల్లలు తమ జనన తేదీ వివరాలతో సమీప ఆధార్ కేంద్రాన్ని సంప్రదించి ఆధార్ నమోదు చేయించుకోవాలని సూచించారు.
ఐటీడీఏ ఏర్పాటు చేయాలని ధర్నా
మందస: జిల్లాలో ఐటీడీఏ లేక గిరిజన ప్రజల సమస్యలు పరిష్కారం కావడం లేదని ఆదివా సీ సంఘ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లాలో ఐటీడీఏ ఏర్పాటు చేయాలని కోరుతూ మందసలో సోమవారం ధర్నా నిర్వహించారు. గిరిజనుల హక్కులు రక్షించాలని, అటవీ భూముల ఆక్రమణలు ఆపాలని ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు సవర గురునాఽథ్, జిల్లా కమిటీ సభ్యుడు సవర ఫాల్గుణరావు డిమాండ్ చేశారు. గిరిజన గ్రామలను షెడ్యూలు జాబితాల్లో చేర్చాలని, 50 శాతానికి పైగా గిరిజనులు ఉన్న పంచాయతీలను విడదీసి గిరిజన పంచాయతీలుగా ఏర్పాటు చేయాలని కోరారు. అనంతరం విన తి పత్రాన్ని డిప్యూటీ తహసీల్దార్ రామకృష్ణకు అందజేశారు. కార్యక్రమానికి రైతుల సంఘం జిల్లా కార్యదర్శి కె.మోహనరావు, సీఐటీయూ జిల్లా కార్యదర్శి గణపతి సంఘీభావం తెలిపారు.
తాగి వాహనం నడిపితే లైసెన్స్ రద్దు : ఎస్పీ
శ్రీకాకుళం క్రైమ్ : మద్యం సేవించి వాహనాలు నడిపితే సంబంధిత వాహనదారుల లైసెన్సులను రద్దు చేస్తామని ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి హెచ్చరించారు. ఇప్పటికే 70 మందివి లైసెన్సులు రద్దు చేశామని, మరో 60 మంది లైసెన్సుల రద్దునకు జిల్లా రవాణా కమిషనర్‌కు ప్రతిపాదనలు పంపించామన్నారు. శ్రీకాకుళంలో ట్రాఫిక్ క్రమబద్ధీకరణలో భాగంగా ద్విచక్రవాహనదారులు, ఆటోలు పార్కింగ్‌కు కేటాయించిన ప్రదేశాల్లో వాహనాలు పార్కింగ్ చేయాలన్నారు. ఆర్టీసీ కాంప్లెక్సు, రైతు బజారు, ఏడురోడ్ల కూడలి వద్ద ట్రాఫిక్ రద్దీ దృష్ట్యా ఆటోలు అధిక సంఖ్యలో రహదారి మార్గంలో నిలిపితే త్రోయింగ్ వాహనంలో స్టేషన్‌కు తరలిస్తామన్నారు. మైనర్లు డ్రైవింగ్ చేస్తే బాధ్యులుగా వారి తల్లిదండ్రులు లేదా సంబంధిత వాహన యజమానులపై కేసులు నమోదు చేస్తామని, త్రిబుల్ డ్రైవింగ్ చేస్తే జరిమానాలతో పాటు కేసులుంటాయని, సిగ్నల్స్ జంపింగ్ చేయొద్దని, డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు కడతామని హెచ్చరించారు.

‘ఆధార్ సేవలు వినియోగించుకోండి’