
అదుపు తప్పిన బైక్..ముగ్గురికి గాయాలు
నరసన్నపేట: కోమర్తి వద్ద జాతీయ రహదారిపై వంతెనపై మంగళవారం వేకువజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు యువకులకు గాయాలయ్యాయి. పాతపట్నం మండలం కొరసవాడకు చెందిన యువకులు శ్రీను, వాసు, మనోజ్‌లు ద్విచక్ర వాహనంపై వెళ్తూ అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. క్షతగాత్రులను అంబులెన్స్‌ల్లో శ్రీకాకుళం రిమ్స్ ఆసుపత్రికి తరలించారు.
ఢిల్లీ చేరిన గార ఎస్‌బీఐ బాధితుల ఆందోళన
శ్రీకాకుళం క్రైమ్ : గార ఎస్‌బీఐలో తనఖా బంగారం మాయం కేసు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. పోలీసులు, వ్యవస్థలను తప్పుదోవపట్టించి బ్యాంకు ఉన్నతాధికారులు ఎన్నో అవకతవకలకు పాల్పడ్డారని, ఓ మహిళా ఉద్యోగిని నిండుప్రాణాన్ని బలిగొన్నారని ఢిల్లీ జంతర్‌మంతర్ వద్ద జిల్లావాసులు సోమవారం ఆందోళనకు దిగారు. వీరిలో చనిపోయిన బ్యాంకు ఉద్యోగిని ఉరిటి స్వప్నప్రియ కుటుంబీకులున్నారు. ఆర్‌ఎం టీఆర్‌ఎం రాజును బర్తరఫ్ చేయాలని, శ్రీకాకుళం రీజియన్‌లో ఎస్‌బీఐలో జరిగిన కుంభకోణాలన్నింటిపై విచారణ చేపట్టాలని, స్వప్నప్రియ మరణానికి కారకులను శిక్షించాలంటూ ప్లకార్డులు పట్టుకుని ధర్నా చేపట్టారు. ఎస్‌బీఐ ఛైర్మన్ కార్యాలయానికి తప్పుడు నివేదికలు అందించడంతో ఫిర్యాదు చేసి ఆరునెలలు గడుస్తున్నా టీఆర్‌ఎం రాజుపై ఎటువంటి చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. తన కుటుంబానికి అన్యాయం చేసిన రాజుతో పాటు డీజీఎంపై కూడా చర్యలు తీసుకోవాలని స్వప్నప్రియ తల్లి సరళ కోరారు.
‘పేపర్లు తెచ్చి బళ్లు పట్టుకెళ్లండి’
శ్రీకాకుళం క్రైమ్ : ఎప్పటి నుంచో జిల్లాకేంద్రంలోని ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌లో పోలీసు తనిఖీల్లో దొరికిన 48 ద్విచక్ర వాహనాలు ఉండిపోయాయి. ఇప్పటికై నా వాహన యజమానులు సంబంధిత పత్రాలను ఈనెల 12 లోగా తెచ్చి తమ తమ వాహనాలను పట్టుకెళ్లిపోవచ్చని ట్రాఫిక్ సీఐ నాగరాజు మంగళవారం స్పష్టం చేశారు. లేదంటే ద్విచక్రవాహనాలు ఆక్షన్(వేలం)లో వేరేవారి సొంతమవుతాయని పేర్కొన్నారు. వాహన యజమానులు పత్రాలతో పాటు ఆధార్‌కార్డు తీసుకురావాలన్నారు.