అధికారులదే బాధ్యత | - | Sakshi
Sakshi News home page

అధికారులదే బాధ్యత

Apr 9 2025 1:04 AM | Updated on Apr 9 2025 1:04 AM

అధికా

అధికారులదే బాధ్యత

జనం రోడ్డెక్కితే..
● రైతులు రెండో పంట వేయవద్దన్నా వినడం లేదు ● జెడ్పీ సర్వసభ్య సమావేశంలో మంత్రి అచ్చెన్నాయుడు ● నరసన్నపేటలో రూ.80 లక్షల స్కామ్‌: ఎమ్మెల్యే బగ్గు ● ప్రొటోకాల్‌ ఉల్లంఘనపై ప్రివిలైజ్‌ కమిటీకి ఫిర్యాదు: ఎమ్మెల్సీ విక్రాంత్‌

అరసవల్లి:

జిల్లాలో స్థానిక సంస్థల పరిధిలో ప్రొటోకాల్‌ ఉల్లంఘనలు, పాలక పార్టీకి అధికారులు కొమ్ముకాయడం, అభివృద్ధి పనుల్లో నాణ్యత లోపించడం, తాగునీటికి వేసవి ప్రణాళిక తదితర అంశాలపై జిల్లా పరిషత్‌ సర్వసభ్య సమావేశంలో వాడీవేడిగా చర్చ జరిగింది. మంగళవారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు జెడ్పీ చైర్‌పర్సన్‌ పిరియా విజయ అధ్యక్షతన నిర్వహించిన ఈ సమావేశంలో ఆర్‌డబ్ల్యూఎస్‌, డీఆర్‌డీఏ, డ్వామా, విద్యుత్‌, పంచాయతీరాజ్‌ ఇంజినీరింగ్‌, జిల్లా పంచాయతీ, వైద్యారోగ్యశాఖ తదితర శాఖల ప్రగతి నివేదికలపై చర్చించారు. ముందుగా దివంగత జెడ్పీ చైర్మన్‌, మాజీ ఎంపీ పాలవలస రాజశేఖరం మృతి పట్ల నివాళులు అర్పించారు. కార్యక్రమంలో కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌, జేసీ ఫర్మాన్‌ అహ్మద్‌ ఖాన్‌, ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్‌, ఎమ్మెల్యేలు గొండు శంకర్‌, బగ్గు రమణమూర్తి, మామిడి గోవిందరావు, తూర్పు కాపు సంక్షేమ కార్పొరేషన్‌ చైర్‌పర్సన్‌ పాలవలస యశస్వి, జెడ్పీ సీఈవో శ్రీధర్‌ రాజా తదితరులు పాల్గొన్నారు.

తాగునీటి సమస్య రాకూడదు..

జిల్లాలో చాలా చోట్ల తాగునీటికి ఇబ్బందులు వస్తున్నట్లు తన దృష్టికి వచ్చిందని, ఆర్‌డబ్ల్యూఎస్‌ అధికారులు ఇప్పటికై నా ప్రణాళికపరంగా పనిచేయాలని, ఇక ఎక్కడైనా నీటి కోసం రోడ్డెక్కితే అధికారులే బాధ్యత వహించాల్సి ఉంటుందని మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు.జల్‌జీవన్‌ మిషన్‌(జేజేఎం) పథకానికి సంబంధించి పైపులు తవ్వి పనులు వదిలేసిన కాంట్రాక్టర్లను మళ్లీ పిలిపించి వెంటనే పని పూర్తి చేయించాలని, లేకుంటే కాంట్రాక్ట్‌ రద్దు చేయాలని ఆదేశించారు. ఇచ్ఛాపురం, పలాస నియోజకవర్గాలు మినహా మిగిలిన ఆరు నియోజవర్గాల్లో జేజేఎం పనులకు ఈ ప్రభుత్వం రూ.2 వేల కోట్లను కేటాయించిందని, వాస్తవానికి ఈ ఏడాది జూన్‌తోనే పథకం ముగియాల్సి ఉన్నా సీఎం చంద్రబాబు చొరవతో మరో మూడేళ్లు పొడిగించారని వివరించారు. జిల్లాలో వేసవి తీవ్రత అధికంగా ఉంటుందని, ఇప్పటికే వంశధారలో నీరు లేదని, చెరువులు, వాగులన్నీ ఇంకిపోయాయని, అయినా రైతులకు రెండో పంట వెయ్యొద్దని చెప్పినా వినలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. వరి పంటకు ప్రత్యామ్నయంగా ఉద్యానవన పంటలను ప్రోత్సహించాలని నిర్ణయించామన్నారు. సీసీ రోడ్డు పనుల్లో నాణ్యత లేకపోతే కలెక్టర్‌ దృష్టికి తీసుకురావాలని జెడ్పీటీసీ సభ్యులను కోరారు. జిల్లా వైద్యారోగ్యశాఖ పనితీరు దారుణంగా ఉందని, ఎన్నడూ లేనంతగా అక్రమాలు పెరిగిపోయాయని, ఏళ్లతరబడి కొందరు ఉద్యోగులు తిష్టవేయడంతో ఈ పరిస్థితి వచ్చిందని ఆందోళన వ్యక్తం చేశారు. త్వరలో కలెక్టర్‌తో కలిసి సమీక్ష చేస్తామన్నారు. ఆక్వా రైతులు వెంటనే రిజిస్ట్రేషన్‌ చేయించుకుంటే యూనిట్‌ విద్యుత్‌ రూ.1.50 చొప్పున ఇస్తామని ప్రకటించారు.

●నరసన్నపేట ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి మాట్లాడుతూ తన నియోజకవర్గంలో వెలుగు పథకంలో రూ.80 లక్షల స్కామ్‌ జరిగిందని, సీఎఫ్‌ సీసీలు ఏకంగా బ్యాంకు ఖాతాల నుంచి వ్యక్తిగత ఖాతాలకు డబ్బులు జమ చేసుకున్నట్లు ఆధారాలతో దొరికిపోయారని, వీరిపై కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ను కోరారు. పోలా కి మండలంలో జేజేఎం కుళాయి పనులు ఆపేశారని, కాంట్రాక్ట్‌ను రద్దు చేయకుండా అధికారులు జాప్యం చేస్తున్నారో అర్ధం కావడం లేదన్నారు.

●శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్‌ మాట్లాడుతూ శ్రీకాకుళం డివిజన్‌ పీఆర్‌ ఈఈ పోస్టు పుట్టపర్తి సత్యసాయి జిల్లాకు తరలిపోయిందని, జిల్లా అవసరాల దృష్ట్యా మళ్లీ ఇక్కడికి తీసుకురావాల్సి ఉందన్నారు. ప్రభుత్వ నర్సింగ్‌ కళాశాల నిర్మాణ పనులు పూర్తి చేసి ప్రారంభానికి సిద్ధం చేయాలని కోరారు.

● పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు మాట్లాడుతూ పాతపట్నం, హిరమండలంలో దాహం కేకలు వినిపిస్తున్నాయని. ఇప్పటికే హిరమండలంలో జనం రోడ్డెక్కారని, తక్షణమే వేసవి ప్రణాళిక పనులు ప్రారంభించాలని కోరారు.

అధికారులదే బాధ్యత 1
1/1

అధికారులదే బాధ్యత

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement