
ఎస్సీ వర్గీకరణను ఐక్యతతో అడ్డుకుందాం
శ్రీకాకుళం (పిఎన్ కాలనీ): కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రాజ్యాంగానికి వ్యతిరేకంగా స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం దళితుల మధ్య వర్గీకరణ పేరుతో చిచ్చుపెట్టి వివాదాలు సృష్టిస్తున్నాయని ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక ఉద్యమం కమిటీ రాష్ట్ర గౌరవాధ్యక్షుడు పి.బెంజమన్ మండిపడ్డారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని ఆదివారంపేటలో అంబేడ్కర్ విగ్రహం నుంచి ఆర్ట్స్ కళాశాల రోడ్డులోని అంబేడ్కర్ ఆడిటోరియం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కులాల మధ్య వర్గీకరణ పేరుతో కుంపట్లు పెట్టి అశాంతి సృష్టించడం తగదన్నారు. వర్గీకరణ సాధ్యం కాదని ప్రభుత్వాలకు తెలిసినా అధికారం కోసం కొందరిని అడ్డం పెట్టుకొని చిచ్చురేపుతున్నారని ధ్వజమెత్తారు. విభజనను అడ్డుకుని తీరుతామని, అవసరమైతే ఢిల్లీలో నిరసన కార్యక్రమాలు చేపడతామని స్పష్టం చేశారు. ఇందుకు సంబంధించి భవిష్యత్ కార్యాచరణ త్వరలోనే ప్రకటిస్తామన్నారు. కార్యక్రమంలో డాక్టర్ ఎం.అంబేడ్కర్, విశ్రాంత తహశీల్దార్ రామప్పడు, సంజీవరావు ఆర్.సూర్యనారాయణ, డి.గోవిందరావు, కె.తవితయ్య, కె.రాజులు, గెడ్డపు రమణ, పి.అప్పన్న, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, జర్నలిస్ట్ సంఘం జిల్లా అధ్యక్షుడు డాక్టర్ గంజి ఆర్ ఎజ్రా, దళిత సంఘాల నాయకులు పాల్గొన్నారు.