
ముమ్మాటికీ కూటమి ప్రభుత్వ కుట్రే
● ఎమ్మెల్సీ నర్తు రామారావు
కవిటి/ఇచ్ఛాపురం రూరల్ : దేశంలోనే అత్యంత ప్రజాదరణ కలిగిన నేతల్లో ఒకరైన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిపై కూటమి ప్రభుత్వం అడుగడుగునా కుట్రకు పాల్పడుతోందని ఎమ్మెల్సీ నర్తు రామారావు ఆరోపించారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ప్రతిపక్ష నేత భద్రత విషయంలో కూటమి సర్కారు అనుసరిస్తున్న వైఖరిపట్ల తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. అనంతపురం జిల్లా పాపిరెడ్డి పల్లెలో మంగళవారం జరిగిన పర్యటనలో కనీస భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం దారుణమన్నారు. జగన్‌ను చూసేందుకు ఎగబడిన జనాలను అదుపు చేయడంలో పోలీసులు పూర్తిగా విఫలమయ్యారని చెప్పారు. హెలిప్యాడ్ వద్ద అరకొర సిబ్బంది ఉండటం పలు అనుమానాలకు తావిస్తోందన్నారు. ఒక మాజీ ముఖ్యమంత్రికి ఇవ్వాల్సిన సెక్యూరిటీ ఇవ్వలేదని ఆరోపించారు. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందని ధ్వజమెత్తారు.