శ్రీకాకుళం క్రైమ్ : జిల్లాకేంద్రంలోని రెండో పట్టణ పోలీస్ స్టేషన్‌లో బుధవారం ఉదయం హైడ్రామా నడిచింది. ఫిర్యాదు ఇచ్చేందుకు వెళ్లిన ఓ వ్యాపారిపై పోలీసులు చెంపదెబ్బ కొట్టారని అతని భార్య ఆడియో వైరల్ కాగా.. అదే సమయంలో అతను ధ్యానముద్రలోకి వెళ్లిపోయినట్లు పోలీసులు చెప్పడం గమనార్హం. ఓ వైపు హోంమంత్రి అనిత అదే సమయంలో జిల్లాకు రానుండటం, ఈ విష యం ఎక్కడ సంచలనంగా మారుతుందోనని పోలీసులు కలవరపాటుకు గురయ్యారు. సీఐ ఈశ్వరరావు, ఫిర్యాదుదారులు చెప్పిన వివరాలిలా ఉన్నాయి.. సకలాభక్తుల హరిహరకుమార్, మల్లా సంతో ష్‌కుమార్‌లు టీటీడీ కల్యాణ మండపం సమీపంలో వలలు తయారు చేసే దుకాణాలు నడుపుతున్నా రు. ఇద్దరూ బంధువులు కావడం, లావాదేవీల్లో తేడాలు రావడం, హరిహరకుమార్ కుమారుడు సచిన్.. సంతోష్‌కుమార్‌తో గొడవపడటంతో టూ టౌన్ పోలీస్‌స్టేషన్‌కు బుధవారం ఉదయం 9:45 గంటలకు వెళ్లి ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకున్నారు.
స్టేషన్‌లో ఏమైందంటే..
సంతోష్‌కుమార్ భార్య సంధ్య మీడియాకు వాట్సాప్ ద్వారా ఆడియో రికార్డు రిలీజ్ చేశారు. తన భర్త ఫిర్యాదివ్వడానికి వెళ్తే పోలీసులు చెంపదెబ్బ కొట్టారని, కాసేపయ్యాక స్పృహ కోల్పోయారని పేర్కొన్నారు. ఈ విషయమై స్టేషన్ ఎస్‌ఐ–2 రామారావు వద్ద ప్రస్తావించగా.. తాను సంతోష్‌కుమార్‌ను చెంపదెబ్బ కొట్టలేదని కొద్దిగా దూరం వెళ్లి కూర్చోమని తోయగా అక్కడే ధ్యానం చేస్తూ కూర్చుండిపోయాడని చెప్పారు. స్పృహ కోల్పోలేదని స్పష్టం చేశారు. స్టేషన్‌కు వచ్చిన సమయంలో సంతోష్‌కుమార్ అడ్డంగా పడుకుని ఉన్నాడని, అతని భార్యకు చెబితే ఆమైపెనే చేయి చేసుకున్నాడని పేర్కొన్నారు. ఇదే విషయమై స్టేషన్ ఎస్‌హెచ్‌వో, సీఐ ఈశ్వరరావు వద్ద ప్రస్తావించగా సంతోష్‌కుమార్ అనే వ్యక్తి హరిహరరావు వద్ద రూ. 30 లక్షలు ఛీటింగ్ చేశాడని, ఇందుకు సంబంధించిన పత్రాలు వారి వద్ద ఉన్నాయని, స్టేషన్‌లో ఎవరూ అతన్ని కొట్టలేదని, థర్డ్‌పార్టీ స్టేట్‌మెంట్ కూడా తీసుకున్నామని, అతను హరహరరావుపై పెట్టిన కేసు గుర్తింపదగనిదిగా గుర్తించి కేసు నమోదు చేయలేదన్నారు. సంతోష్‌కుమార్‌పై మాత్రం ఛీటింగ్ కేసు నమోదైందన్నారు. ఆసుపత్రిలో సైతం సంతోష్‌కుమార్ విచిత్రంగా ప్రవర్తిస్తూ వైద్యులకు విసుగు తెప్పించాడన్నారు. అంబులెన్సు కూడా తమ స్టేషన్ వద్దకు రాలేదని చెప్పారు.