
మహిళలపై అఘాయిత్యాలు అరికట్టాలి
● పోలీసులతో సమీక్షలో హోంమంత్రి అనిత
శ్రీకాకుళం క్రైమ్ : మహిళలు, బాలికల భద్రతలో భాగంగా వారిపై జరిగే అఘాయిత్యాలు అరికట్టాలని రాష్ట్ర హోంమంత్రి అనిత పోలీసు అధికారులకు స్పష్టం చేశారు. జిల్లాకు బుధవారం విచ్చేసిన హోంమంత్రి ముందుగా పోలీసు కార్యాలయానికి వచ్చి పోలీసుల గౌరవవందనం స్వీకరించారు. అనంతరం డీఐజీ గోపినాథ్ జెట్టి, శ్రీకాకుళం, విజయనగరం ఎస్పీలు కేవీ మహేశ్వరరెడ్డి, వకుల్ జిందాల్, మన్యం–పార్వతీపురం ఏఎస్పీ అంకిత సూరానలు మంత్రికి పుష్పగుచ్ఛం అందించి దుశ్శాలువాలతో సత్కరించి జ్ఞాపికలు అందించారు. అనంతరం మూడు జిల్లాల అధికారులతో మంత్రి సమీక్షించారు. ముందుగా ఎస్పీ మహేశ్వరరెడ్డి జిల్లాలో మహిళలు, బాలికలకు సంబంధించిన నేరాలు, పోక్సో, గంజాయి ఇతర మాదక ద్రవ్యాల కేసులు, గ్రేవ్ ప్రాపర్టీ కేసుల నమోదు, నేర నియంత్రణ చర్యలు, దర్యాప్తులో సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి ఛేదించిన తీరును వివరించారు. హోం మంత్రి అనిత మాట్లాడుతూ ఫింగర్ ప్రింట్ పరికరాలు, డ్రోన్, సీసీ కెమెరాలు అందిస్తామన్నారు. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో విద్యార్థులకు శక్తి బృందాల ద్వారా సెల్ఫ్ డిఫెన్సు శిక్షణ తరగతులు నిర్వహించాలని, డ్రాప్ బాక్స్‌లను ఏర్పాటుచేయాలన్నారు. సైబర్ పోలీస్‌స్టేషన్‌ను అందుబాటులోకి తెస్తామని, సాంకేతిక పరిజ్ఞానంపై నైపుణ్యం ఉన్న సిబ్బందిని నియమించి కేసులు త్వరితగతిన ఛేదించాలన్నారు. హోంమంత్రి రాకతో ఎచ్చెర్ల మండలం ఎస్‌ఎంపురానికి చెందిన తప్పిట గుళ్లు కళాకారుల నృత్యాలు ఆకట్టుకున్నాయి. సమీక్ష సమావేశంలో అదనపు ఎస్పీలు పి.శ్రీనివాసరావు, పి.సౌమ్యలత, డీఎస్పీలు వివేకానంద, అప్పారావు, శేషాద్రి, రాంబాబు, భవ్యారెడ్డి, , రాఘవులు, శ్రీనివాసరావు, ఇతర పోలీసు అధికారులు పాల్గొన్నారు.
శ్రీకాకుళానికి చెందిన క్యాన్సర్ బాధితురాలు లతశ్రీ హోం మినిస్టర్ కలవాలనే కోరిక వ్యక్తం చేయడంతో ఆమెను అనిత కలిసి యోగక్షేమాలు అడిగారు. ధైర్యంగా ఉండాలని చెప్పారు.