
హోం మంత్రి వ్యాఖ్యలు అర్థరహితం
నరసన్నపేట: నడిరోడ్డుపై లింగమయ్యను హత్య చేస్తే దాన్ని కుటుంబ వివాదంగా హోం మంత్రి అనిత మాట్లాడటం శోచనీయమని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ అన్నారు. లింగమయ్య హత్య తదనంతర పరిస్థితులు, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పరామర్శకు వెళ్లడంపై హోం మంత్రి మాటలు బాధ్యతా రాహిత్యానికి నిదర్శనమన్నారు. ఈ మేరకు బుధవారం సాయంత్రం ఓ ప్రకటన విడుదల చేశారు. కేసు దర్యాప్తును నీరు గార్చేలా హోం మంత్రి మాటలు ఉన్నాయని ఆందోళన చేశారు. ఆమె ఒక టీడీపీ నాయకురాలిగా మాట్లాడుతున్నారే తప్ప ఒక రాష్ట్రానికి హోం మంత్రిలా మాట్లాడటం లేదని ఎద్దేవా చేశారు. లింగమయ్యది ముమ్మాటికీ రాజకీయ హత్యేనని అన్నారు. ఆయన కుటుంబాన్ని వైఎస్ జగన్ పరామర్శించడాన్ని హోం మంత్రి తప్పుపట్టడం దారుణమన్నారు. ఒక హత్య కేసు దర్యాప్తులో ఉన్నప్పుడు అధికార ప్రతినిధులు ఎలాంటి వ్యాఖ్యలు చేయకూడదని ఉన్నా దాన్ని పక్కన పెట్టి బాధ్యత గల ఒక హోం మంత్రి ఇలా మాట్లాడడం సరికాదని పేర్కొన్నారు. వైఎస్ జగన్‌కు ప్రజల మద్దతు ఉన్నందు వలనే టీడీపీ భయపడుతోందని తెలిపారు. వైఎస్ జగన్‌లో ఉన్న నిజాయితీని ప్రజలు గుర్తిస్తారని అన్నారు.
వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్