
నేటి నుంచి కొల్లవానిపేట రైల్వే గేట్ మూత
నరసన్నపేట: మండలంలోని కొల్లవానిపేట రైల్వే గేట్‌ను గురువారం నుంచి మూడు రోజుల పాటు మూసివేస్తున్నట్లు శ్రీకాకుళ రోడ్ సీనియర్ సెక్షన్ ఇంజనీర్ ఎం.వెంకటేశ్వర్లు ఒక ప్రకటనలో తెలిపారు. కొల్లవానిపేట గేట్ పరిసరాల్లో ట్రాక్ నిర్వహణ పనులు నిర్వహిస్తున్నందున గేట్ మూసి వేస్తున్నట్లు పేర్కొన్నారు. 10వ తేదీ ఉదయం నుంచి 12వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు గేట్ మూత వేస్తున్నామని, వాహనదారులు, సమీప గ్రామాల ప్రజలు సహకరించాలని కోరారు.
మహిళా ప్రాంగణంలో కలకలం
● ఇద్దరు యువతులు అదృశ్యం
● బ్యూటీషియన్ కోర్సులో శిక్షణకు వచ్చి మాయం
ఎచ్చెర్ల క్యాంపస్: ఎచ్చెర్ల మండల కాంప్లెక్స్ ఆవరణలో ఉన్న ఆంధ్రప్రదేశ్ మహిళా ఆర్థిక సహకార సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఎన్.టి.ఆర్ నైపుణ్య అభివృద్ధి శిక్షణ కేంద్రం (సీ్త్ర సదన్ మహిళా ప్రాంగణం)లో ఇద్దరు యువతులు అదృశ్యం కావడం కలకలంగా మారింది. బ్యూటీషియన్ శిక్షణ పొందుతున్న 21 ఏళ్ల యువతి, 18 ఏళ్ల యువతి మంగళవారం మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో లంచ్ బ్రేక్‌కు బయటకు వెళ్లి రాత్రి అయినా తిరిగి రాలేదు. దీంతో సీ్త్రసదన్ ఇన్‌చార్జ్ సనపల సత్యవతి ఇన్‌చార్జ్ మహిళా ప్రాంగణం మేనేజర్ పి.విమల సూచన మేరకు ఎచ్చెర్ల పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. మంగళవారం రాత్రి పోలీసులు కేసు నమోదు చేశారు. ఆచూకీ తెలిసిన వారు 6309990816, 63099 90816 నంబర్లను సంప్రదించాలని కోరారు. ఈ ఇద్దరు యువతులదీ విశాఖపట్నం కాగా, ఇద్దరికీ తల్లిదండ్రులు లేరు. ఇందులో ఓ యువతికి దూరపు బంధువులు ఉన్నట్లు తెలిసింది. విశాఖపట్నం సీ్త్రసదన్‌లో బ్యూటీషియన్ కోర్సు లేకపోవటంతో వీరు ఎచ్చెర్ల కేంద్రంలో చేరి ఈ నెల ఒకటో తేదీ నుంచి శిక్షణ పొందుతున్నారు. శిక్షణ కాలం రెండు నెలలు. వీరిద్దరు స్నేహితులు. ఇద్దరి వద్దా ఫోన్లు లేదు. తోటి అభ్యర్థుల వద్ద ఫోన్ తీసుకుని హైదరాబాద్, విశాఖపట్నం ప్రాంతాల్లో ఉంటున్న ఇద్దరు వ్యక్తులతో తరచూ మాట్లాడుతున్నట్లు తెలిసింది. ఆ ఫోన్ నంబర్లు ప్రస్తుతం స్విచ్ ఆఫ్ వస్తున్నట్లు సమాచారం. ఇద్దరూ మేజర్లు కావటంతో ప్రేమ వ్యవహారమా? ఇతర కారణాలు ఉన్నాయా? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వ్యక్తిగత కారణాలు ఉంటే స్థానిక అధికారుల వద్ద అనుమతి తీసుకొని వెళ్లవచ్చు. అలాకాకుండా సిబ్బంది కళ్లుగప్పి వెళ్లిపోవడంతో అధికారులు ఆందోళన చెందుతున్నారు.
11న విదేశాల్లో ఉద్యోగాలకు జాబ్‌మేళా
టెక్కలి: విదేశాల్లో వివిధ రకాల ఉద్యోగాల కోసం ఈ నెల 11న టెక్కలి అదిత్య ఐతం ఇంజినీరింగ్ కళాశాలలో జాబ్‌మేళా నిర్వహించనున్నట్లు కళాశాల డైరెక్టర్ వి.వి.నాగేశ్వరరావు బుధవారం తెలిపారు. తెలంగాణ కార్మిక, ఉపాధి శిక్షణ, కర్మాగారాల శాఖ గుర్తింపు పొందిన తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్ పవర్ కంపెనీ లిమిటెడ్ ఆధ్వర్యంలో ఆస్ట్రేలియా, కెనడా, జర్మనీ, హంగేరి, జపాన్ వంటి దేశాల ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలు భాగస్వామ్యంతో జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. హెల్త్‌కేర్, నాన్ హెల్త్‌కేర్ రంగాల్లో ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న అవసరాలకు అనుగుణంగా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నట్లు వెల్లడించారు. ఏఎన్‌ఎం, జీఎన్‌ఎం, బీఎస్సీ నర్సింగ్ కోర్సుల్లో ఉత్తీర్ణులైన వారు సౌదీ అరేబియా, కతార్, యూకే, కెనడా, జపాన్, జర్మనీ, ఇజ్రాయిల్, అమెరికాలోని ఆరోగ్య రంగంలో పనిచేయడానికి దరఖాస్తు చేసుకోవచ్చునని పేర్కొన్నారు. ఎస్‌ఎస్‌సీ, ఇంటర్మీడియట్, ఐటీఐ, డిప్లమో, బీటెక్, ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులైన అభ్యర్థులు జపాన్, జర్మనీ, ఫిజి, గ్రీస్‌లలో ఆరోగ్యేతర రంగాల్లో ఉద్యోగాలు చేయడానికి అర్హులని తెలిపారు. 40 ఏళ్లలోపు వయసు కలిగి ఆసక్తి గలవారు జాబ్‌మేళాకు హాజరు కావచ్చని పేర్కొన్నారు. పూర్తి వివరాలకు 8466096181, 9876339690 నంబర్లను సంప్రదించాలని కోరారు.
జాతీయ హ్యాండ్‌బాల్
పోటీలకు ఇద్దరు ఎంపిక
శ్రీకాకుళం న్యూకాలనీ: జాతీయ సబ్‌జూనియర్స్ హ్యాండ్‌బాల్ చాంపియన్‌షిప్ పోటీలకు జిల్లా నుంచి ఇద్దరు క్రీడాకారులు ఎంపికయ్యారు. ఎంపికై న వారిలో గొర్లె ఢిల్లేశ్వరరావు, బుగత రమేష్ ఉన్నారు. ఒడిశా వేదికగా జరగనున్న ఈ పోటీల కోసం ఇక్కడి నుంచి పయనమై వెళ్లారు. వీరిద్దరూ అల్లినగరం జెడ్పీహెచ్‌స్కూల్‌లో 10వ తరగతి చదువుతున్నారు. ఢిల్లేశ్వరరావుది లావేరు మండలం సెగిడిపేట గ్రామం. రమేష్ ఎచ్చెర్ల మండలం చిలకపాలెం గ్రామానికి చెందినవాడు. గతంలో వీరిద్దరూ అనేక రాష్ట్రస్థాయి పోటీల్లో ప్రాతినిధ్యం వహించడంతోపాటు రాష్ట్రస్థాయి స్కూల్‌గేమ్స్ అండర్–14, అండర్–17 వయో విభాగాల్లో రజత, కాంస్య పతకాలతో సత్తాచాటారు. తాజాగా జాతీయ పోటీలకు ఎంపికయ్యారు.

నేటి నుంచి కొల్లవానిపేట రైల్వే గేట్ మూత