
ఆర్థిక ఇబ్బందులు తాళలేక..
పుట్లూరు: ఆర్థిక ఇబ్బందులు తాళలేక ఓ వివాహిత ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు తెలిపిన మేరకు... శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురానికి చెందిన భాగమతి (32)కి మూడేళ్ల క్రితం చైన్నెలోని పుట్లూరు మండలం గాండ్లపాడుకు చెందిన రామేశ్వరరెడ్డితో వివాహమైంది. వీరికి రెండేళ్ల వయసున్న కుమారుడు ఉన్నారు. రెండేళ్ల కిందట రామేశ్వరరెడ్డి రెండు ఎకరాల భూమిని విక్రయించగా వచ్చిన రూ.30 లక్షలను ఇతరులకు అప్పుగా ఇచ్చాడు. అప్పు తీసుకున్న వ్యక్తి వడ్డీలు సక్రమంగా చెల్లించకపోగా, అసలు చెల్లింపులోనూ తాత్సారం చేస్తూ వచ్చాడు. ఈ క్రమంలో కుటుంబంలో ఆర్థిక ఇబ్బందులు తలెత్తాయి. దీంతో మనస్తాపానికి గురైన భాగమతి బుధవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి సోదరి భారతి ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ వెంకటనరసింహ కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.