
సమస్యలు తక్షణమే పరిష్కరించాలి
● ఆర్టీసీ ఎన్‌ఎంయూ నాయకుల డిమాండ్
శ్రీకాకుళం అర్బన్: ఏపీఎస్ ఆర్టీసీలో పనిచేస్తున్న ఉద్యోగుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ఆర్టీసీ నేషనల్ మజ్దూర్ యూనియన్ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు రెండు రోజుల ధర్నా కార్యక్రమంలో భాగంగా మొదటిరోజు గురువారం శ్రీకాకుళంలోని ఆర్టీసీ కాంప్లెక్స్ ఆవరణలో నిరసన తెలిపారు. ఎన్‌ఎంయూ నాయకులు ఎన్‌వీఆర్ మూర్తి, ఎంఎన్ రాజు, వి.శాంతరాజులు మాట్లాడుతూ.. ఉద్యోగుల ఉద్యోగ భద్రతా సర్క్యూలర్ 1/2019ను వెంటనే అమలు చేయాలని, అక్రమ సస్పెన్షన్లు, అక్రమ రిమూవల్స్‌ను ఆపాలని డిమాండ్ చేశారు. గత నాలుగేళ్లుగా ఆగిపోయిన ప్రమోషన్స్ వెంటనే ఇవ్వాలని, గ్యారేజీ ఉద్యోగుల అపరిష్కృత సమస్యలను వెంటనే పరిష్కరించాలని విన్నవించారు. మహిళా ఉద్యోగులకు ప్రభుత్వ జీవో ప్రకారం పిల్లల సంరక్షణ సెలవులు వెంటనే మంజూరు చేయాలన్నారు. నాన్ ఆపరేషన్ ఉద్యోగుల పెండింగ్ సమస్యలను పరిష్కరించాలని, ఉద్యోగుల అనారోగ్య సెలవులకు పూర్తి జీతం చెల్లించాలని, ఈహెచ్‌ఎస్ స్థానంలో పాత వైద్య విధానాన్ని పునరుద్ధరించాలని పేర్కొన్నారు. ఎలక్ట్రిక్ బస్సులను ప్రభుత్వం ద్వారా లేదా సంస్థ ద్వారా మాత్రమే కొనాలన్నారు. పారదర్శకమైన ట్రాన్స్‌ఫర్ పాలసీని అమలు చేయాలన్నారు. కార్యక్రమంలో ఆర్టీసీ ఎన్‌ఎంయూ నాయకులు నవీన్‌బాబు, వీరబాబు, వీడీ రావు, ఎంఎస్‌సీ రావు, పార్వతి, అప్పలనరసమ్మ, కృష్ణవేణి పాల్గొన్నారు.