
అటు ఆళ్వారు.. ఇటు ఆదిత్యుడు
అరసవల్లి: అరసవల్లి సూర్యనారాయణ స్వామి వార్షిక కల్యాణ మహోత్సవాల్లో భాగంగా శుక్రవారం సాయంత్రం ‘దొంగదోపు ఉత్సవం’ ఆకట్టుకుంది. ఆలయ ప్రధానార్చకులు ఇప్పిలి శంకరశర్మ ఆధ్వర్యంలో ఉద్యానవన తోటల్లో జరిపించిన ఈ వేడుకల్లో భాగంగా ఆలయం నుంచి శ్రీ ఉషా పద్మి ని ఛాయాదేవేరులతో శ్రీసూర్యనారాయణ స్వామి వారి కల్యాణమూర్తులను వెండి సింహవాహనంలో తిరువీధిగా మాడవీధుల నుంచి ఉద్యానవన తోట (చిన్నతోట)లో వేంచేసింపజేశారు. అలాగే మరో ఉద్యానవన తోట (పెద్దతోట)లో శ్రీ తిరుమంగయాళ్వారు చరిత్రలో భాగంగా ఆళ్వారును ఆశీనులు చేశారు. అనంతరం ఆళ్వారుకు, ఆదిత్యునికి మధ్య జరిగిన సంవాదం భక్తులను ఎంతగానో ఆకట్టుకుంది. ఆదిత్యుని తరఫున భాస్కరభట్ల నర్సయ్య శర్మ, బంకుపల్లి రమేష్‌శర్మ, ఆళ్వారు తరఫున భాస్కరభట్ల శ్రీరామమూర్తి శర్మ, డాక్టర్ పులఖండం శ్రీనివాసరావులు సంవాదం చేసుకున్నారు. శనివారం ఉదయం చైత్ర శుద్ధ పౌర్ణమి సందర్భంగా ఇంద్రపుష్కరిణిలో స్వామి వారి కల్యాణమూర్తుల చక్రతీర్థ స్నానాల కార్యక్రమం జరుగనుందని, అలాగే రాత్రి పుష్పయాగంతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయని ఆలయ ప్రధానార్చకులు ఇప్పిలి శంకరశర్మ, ఈఓ వై.భద్రాజీ తెలియజేశారు.