
బడిఈడు పిల్లల గుర్తింపు: డీఈఓ
టెక్కలి: కొత్త విద్యా సంవత్సరం తరగతులు ఈ నెల 21 నుంచి ప్రారంభమయ్యే విధంగా ముందస్తుగా ఏర్పాట్లు చేస్తున్నామని, దీనికి సంబంధించి ఇప్పటికే 10వ తేదీ నుంచి 20 వరకు ప్రత్యేక అవగాహన కార్యక్రమాల్లో భాగంగా బడి ఈడు పిల్లల గుర్తింపు చేపడుతున్నామని జిల్లా విద్యాశాఖ అధికారి ఎస్.తిరుమల చైతన్య వెల్లడించారు. ఆయన మంగళవారం టెక్కలి మండల విద్యాశాఖ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. జిల్లాలో గత ఏడాది విద్యా సంవత్సరంలో వివిధ ప్రభుత్వ పాఠశాలల్లో సుమారు 2,44,869 మంది విద్యార్థులు ఉండేవారని, ఇప్పుడు 2,50,000 మంది విద్యార్థులు చేరే వి ధంగా అవగాహన కార్యక్రమాలు చేస్తున్నట్లు ఆయ న వెల్లడించారు. జూన్ 12 పాఠశాలు పునః ప్రారంభం నాటికి ఉపాధ్యాయుల కొరత లేకుండా చర్యలు తీసుకుంటున్నామని, ఈ నెలాఖరులోగా డీఎస్సీ నోటిఫికేషన్ వస్తుందని డీఈఓ తెలిపారు. అలాగే ఈనెల 21 నుంచి ఆన్‌లైన్ ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాలు ప్రారంభం కానున్నట్లు వెల్లడించారు. 60 మంది విద్యార్థులు దాటి మూడు కి లోమీటర్ల పరిధిలో ఎలాంటి ఉన్నత పాఠశాల లేకపోతే ఆయా ప్రాథమికోన్నత పాఠశాలను ఉన్నత పాఠశాలగా గుర్తిస్తామని డీఈఓ తిరుమల చైతన్య పేర్కొన్నారు. తరగతుల విలీనం విషయంలో ఆయా గ్రామాల స్కూల్ మేనేజ్‌మెంట్ కమిటీ, విద్యార్థుల తల్లిదండ్రుల ఆమోదం ఉంటేనే విలీనం చేస్తామని స్పష్టం చేశారు.