
పెండింగ్ సమస్యలపై ప్రత్యేక దృష్టి
శ్రీకాకుళం పాతబస్టాండ్: జిల్లాలో పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి, పరిపాలనాపరమైన సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని అధికారులను ఆదేశిస్తూ కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ మంగళవారం సమగ్ర సమీక్ష నిర్వహించారు. జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్‌తో కలిసి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో భూ పరిపాలన, తాగునీటి సరఫరా, ఐసీడీఎస్, గ్రామ సచివాలయాల పనితీరు వంటి కీలక అంశాలపై కలెక్టర్ ప్రత్యేకంగా దృష్టి సారించారు. నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని ఆయన అధికారులను హెచ్చరించారు. మండల స్థాయి అధికారులు తమ మండల కేంద్రాల్లో, జిల్లా స్థాయి అధికారులు కలెక్టర్ కార్యాలయంలో పాల్గొన్నారు. ఆక్రమణల క్రమబద్ధీకరణ, గృహ స్థలాల పునఃపరిశీలన, ప్రాథమిక గ్రామాల పునఃసర్వే, ప్రభుత్వ భూముల వివరాలు, నీటి పన్ను వసూళ్లపై సమీక్ష కొనసాగింది. వేసవిలో తాగునీటి సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ స్పష్టం చేశారు. మున్సిపల్ కమిషనర్లు, జిల్లా ప్రణాళికాధికారి, గ్రామీణ నీటిపారుదల అధికారుల మధ్య సమన్వయం తప్పనిసరిగా ఉండాలన్నారు. పల్లె పండుగ నేపథ్యంలో జరిగే అభివృద్ధి కార్యక్రమాల్లో మెటీరియల్ కాంపోనెంట్ వినియోగాన్ని గ్రామ స్థాయి ఇంజినీర్లు, సహాయ ఇంజినీర్ల వద్దే పర్యవేక్షించాలన్నారు. ప్రధానమంత్రి సూర్య గృహ పథకంలో బ్యాంకులు, కాంట్రాక్టర్ల వద్ద పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. గ్రామ సచివాలయ వ్యవస్థలో కొత్త విధానాలను అమలు చేయడంలో ఉద్యోగుల హాజరు, సర్వేలు ముఖ్యమని తెలియజేశారు.