
క్రీడాకారులతో ఆటలా?
శ్రీకాకుళం న్యూకాలనీ: కూటమి సర్కారు నిర్లక్ష్యం మరోసారి తేటతెల్లమైంది. అటు పాలకులతోపాటు ఇటు అధికారులు సైతం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని చెప్పడానికి తాజాగా విడుదలైన క్రీడా ఎంపికల షెడ్యూల్‌ను పరిశీలిస్తే అర్ధం చేసుకోవచ్చు. శాప్ అధికారుల తీరుపట్ల క్రీడాసంఘాలు ప్రతినిధులు, క్రీడాకారులు తీవ్రంగా మండిపడుతున్నారు. వివరాల్లోకి వెళ్తే..
కేంద్ర క్రీడల మంత్రిత్వశాఖ, స్పోర్ట్స్ ఇండియా ఆధ్వర్యంలో 7వ ఎడిషన్ ఖేలో ఇండియా యూత్ గేమ్స్ త్వరలో ప్రతిష్టాత్మకంగా జరగనున్నాయి. ఇందులో అండర్–18 బాలుర కబడ్డీ, బాలుర ఖోఖో, బాలికల ఫుట్‌బాల్ తదితర క్రీడాంశాల్లో ప్రాతినిధ్యం వహించే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జట్ల ఎంపికలను బుధవారం (ఈ నెల 16న) విజయవాడ వేదికగా నిర్వహించాలని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (శాప్) నిర్ణయించింది. అంత వరకు బాగానే ఉంది. అయితే ఎంపికలు జరుగుతున్న విషయాన్ని రాష్ట్రంలో వివిధ జిల్లాలకు చేరవేయడంలో నిర్లిప్తత ధోరణిని ప్రదర్శించారు. కనీసం నాలుగు రోజుల ముందు జిల్లాకు సమాచారాన్ని చేరవేయాల్సి ఉన్నా ఆ దిశగా చర్యలు తీసుకోలేదు. జిల్లాల్లో జరిగే జిల్లాస్థాయి ఎంపికలకే రెండు మూడు రోజుల ముందు సమాచారాన్ని పత్రికలు, సోషల్ మీడియా గ్రూపుల్లో క్రీడాకారులకు తెలిసేలా చర్యలు తీసుకుంటారు. అలాంటిది రాష్ట్రస్థాయి ఎంపికలకు కనీస సమాచారం ఇవ్వకపోవడంపై క్రీడాకారులు మండిపడుతున్నారు. క్రీడాకారులు ఎక్కువ మంది వస్తే ఖర్చు అవుతుందనో.. లేదా తక్కువ మంది వస్తే తమవారినే ఎంపిక చేసుకోవచ్చనే కుతంత్రమో.. క్రీడలను పాతరేద్ధామనే దుర్భుద్దో తెలియదుగానీ శ్రీకాకుళం జిల్లాకు సైతం మంగళవారం సాయంత్రం ఎంపికల సమాచారాన్ని చేరవేశారు.
క్రీడాకారుల అవస్థలు
ఆలస్యంగా సమాచారం అందుకున్న నిరుపేద క్రీడాకారులు విజయవాడ పయనమయ్యేందుకు ఆపసోపాలు పడ్డారు. రవాణా చార్జీలకు కూడా ఏర్పాటుచేసుకునే సమయం లేకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కబడ్డీ, ఖోఖో, ఫుట్‌బాల్ క్రీడాకారులు రాత్రి దొరికిన ట్రైన్లలో రిజర్వేషన్లు లేకుండానే జనరల్ బోగీల్లో పయనమయ్యారు. ఇంకొందమంది ఎక్కువ వ్యయప్రయాసలైనప్పటికీ.. గత్యంతరం లేక ప్రైవేటు ట్రావెల్స్‌ను ఆశ్రయించారు. మరికొంతమంది ఎంపికలకు వెళ్లలేకపోయారు. శాప్ చైర్మన్‌తోపాటు శాప్ ఉన్నతాధికారులు అనుసరిస్తున్న వైఖరిని ఒలింపిక్ సంఘం, క్రీడాసంఘాల ప్రతినిధులు, క్రీడాకారుల తల్లిదండ్రులు తప్పుబడుతున్నారు. శాప్ నిర్లక్ష్యం వైఖరితో నష్టపోయిన క్రీడాకారులకు ఎవరు న్యాయం చేస్తారని వారంతా ప్రశ్నిస్తున్నారు.
విజయవాడ వేదికగా
నేడు క్రీడా జట్ల ఎంపికలు
బుధవారం జరిగే ఎంపికలకు
మంగళవారం సాయంత్రం మెసేజ్
శాప్ అధికారులపై మండిపడుతున్న క్రీడాకారులు, సంఘ ప్రతినిధులు