
హెచ్‌ఎం పోస్టులు మంజూరు చేయాలి
శ్రీకాకుళం: ప్రభుత్వం ఏర్పాటు చేయదలచిన 7,500 మోడల్ ప్రాథమిక పాఠశాలల్లో ప్రైమరీ స్కూల్ ప్రధానోపాధ్యాయులు (హెచ్‌ఎం) పోస్టులను మంజూరు చేసి ఎస్జీటీలకు పదోన్నతులు కల్పించాలని ఎస్టీయూ ఉపాధ్యాయ శాఖ జిల్లా ప్రధాన కార్యదర్శి గురుగుబెల్లి రమణ ప్రభుత్వాన్ని కోరారు. శ్రీకాకుళం పట్టణంలోని ఎన్‌ఆర్ దాసరి క్రాంతి భవన్‌లో గురువారం ఎస్టీయూ నాయకులతో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఐదుగురు ఉపాధ్యాయలు ఉన్న ఆదర్శ పాఠశాలలో ఒక సీనియర్ ప్రధానోపాధ్యాయుడు ఉండటం వల్ల పిల్లలకు నాణ్యమైన బోధన అందుతుందని తెలిపారు. రాష్ట్రంలో 117 జీఓ రద్దుతో కూడిన సవరణలు అమలు చేస్తున్న సందర్భంలో కూడా అన్ని చోట్ల 3, 4 తరగతులు ఉన్నత పాఠశాల నుంచి ప్రైమరీ పాఠశాలలకు తీసుకురాకుండా స్కూల్ అసిస్టెంట్లతో కొన్నాళ్ల పాటు బోధన చేయించాలనే ఆలోచన చేస్తున్నారని అన్నారు. ఇలాంటి పాఠశాలలు 900 వరకు ఉన్నాయని వీటిలో 1, 2 తరగతులకు కూడా ప్రవేశం కల్పిస్తామని ఇటీవలి ఉన్నత అధికారులు వెల్లడించారని గుర్తు చేశారు. దీనిపై సరైన నిర్ణయాలు, నిబంధనలు ప్రకటించాలని కోరారు. సమావేశంలో జిల్లా కార్యవర్గ సభ్యులు పి.రామకృష్ణ, చింతల రామారావు, కూన శ్రీనివాసరావు, జి.శ్రీనివాసరావు, ఎన్.లక్ష్మణరావు, ఎం.మురళీధర్, చౌదరి జగన్, ఎం.తేజ, జి.తిరుమలరావు, డీవీఎన్ పట్నాయక్ పలు మండలాల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పాల్గొన్నారు.