
అసభ్యకర ప్రవర్తన.. హెచ్‌ఎంకు దేహశుద్ధి
గార: విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఉపాధ్యాయుడే తప్పుడు పనులు చేశాడు. చాలాకాలం ఓపిక పట్టి న విద్యార్థినులు తాళలేక తల్లిదండ్రులకు సమాచా రం అందజేశారు. వారు వచ్చి హెచ్‌ఎంకు దేహశుద్ధి చేశారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన వివరాల్లోకి వెళితే.. మండలంలోని వత్సవలస పంచాయతీ మొగదాలపాడు యూపీ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు కొన్ని రోజులుగా 6,7,8 తరగతులకు చెందిన పలువురు విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు. ముద్దులు పెట్టడం, తాకకూడని చోట చేతులు వేయడం చేస్తున్నా డు. కొన్నాళ్లు భరించిన విద్యార్థినులు తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వడంతో సోమవారం పాఠశా లకు వెళ్లి హెచ్‌ఎం చింతాడ వెంకటేశ్వర్లును నిలదీశారు. ఆయన తల్లిదండ్రులతో వాదనకు దిగడంతో వారు హెచ్‌ఎంకు దేహశుద్ధి చేశారు. అనంతరం 1098కు ఫిర్యాదు చేశారు. కలెక్టర్ ఆదేశాలతో బుధవారం డిప్యూటీ డీఈఓ విజయకుమారి, చైల్డ్‌లైన్ సిబ్బంది పద్నాలుగు మంది విద్యార్థినులు, వారి తల్లిదండ్రులతో పాటు గ్రామస్తులను విచారించారు. జరిగిన సంఘటనపై రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. పాఠశాలలోని మిగిలిన ఉపాధ్యాయులను కూడా విచారణ చేయగా, జరిగిన సంఘటన వాస్తవమేనని అధికారులకు తెలిపినట్టు సమాచారం. విచారణ చేశామని, ఉన్నతాధికారులకు నివేదిక అందజేస్తామని, తదుపరి చర్యలుంటాయని ఎంఈఓ నక్క రామకృష్ణ తెలిపారు.
అయితే గురువారం హెచ్‌ఎంతో పాటు మరికొందరు గ్రామానికి విచ్చేసి గ్రామస్తులను కలసి క్షమించమని వేడుకున్నారు. అయితే బాలికలంతా ఎట్టి పరిస్థితుల్లోనూ చర్యలు తీసుకోవాలన్న ఉద్దేశ్యంతో పెద్దలు పిలిచినా వెళ్లకుండా ఇంటి వద్దనే ఉండిపోయారు.
పక్క నియోజకవర్గం ఎమ్మెల్యే రాజీ ప్రయత్నాలు
హెచ్‌ఎం వెంకటేశ్వర్లు పక్క నియోజకవర్గం ఎమ్మెల్యే అనుయాయుడు కావడంతో ఆయన రంగంలోకి దిగినట్టు తెలుస్తోంది. జరిగింది ఏదో జరిగిందని రాజీ చేసుకోవాలని సూచిస్తుండటం గ్రామంలో విస్తృతంగా చర్చ జరగుతోంది.