
బకాయి ఇక రానట్టే..!
నేడు ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన
ఎచ్చెర్ల మండలం బుడగట్లపాలెంలో ముఖ్యమంత్రి చంద్రబాబు శనివారం పర్యటించనున్నారు. ఈ ఏడాదికి వేటనిషేధ కాలం భృతిని అందించే ‘మత్స్యకార చేయూత’ పథకంలో భాగంగా అర్హుల జాబితా ప్రాప్తికి 15548 మందికి ఒక్కొక్కరికి రూ.20 వేల చొప్పున భృతిని నేరుగా వారి ఖాతాల్లో జమ చేసేలా కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. ఇందుకు జిల్లా అధికార యంత్రాంగం సన్నాహాలు చేస్తోంది. ఎచ్చెర్ల మండలంలో భారీ హంగామాతో మత్స్యకారుల సమక్షంలోనే కార్యక్రమాన్ని నిర్వహించేలా మత్స్యకార గ్రామమైన బుడగట్లపాలెంలోనే కార్యక్రమాన్ని ఏర్పా టు చేశారు. అయితే జిల్లా మత్స్యకార సహకార సంక్షేమ సంఘాల అధ్యక్ష, కమిటీలకు ఎలాంటి ఆహ్వానాలు లేకుండానే ఈ కార్యక్రమాన్ని నిర్వహించనుండడంపై మత్య్సకార సంఘాలు తప్పుపడుతున్నాయి.
అరసవల్లి:
అనుకున్నదంతా అయ్యింది. గత ఏడాది మత్స్యకార భృతిపై మత్స్యకారులు పెట్టుకున్న ఆశలు గంగ పాలయ్యాయి. 2024–25కు సంబంధించిన మత్స్యకార భృతిపై ఎలాంటి ఉత్తర్వులు వెలువడకపోవడంతో.. ఆ భృతికి ఇక చేతికి అందదని స్పష్టమైపోయింది. ఈ ఏడాదికి సంబంధించి మాత్రమే భృతి అందజేస్తుండడంతో బకాయి ఇచ్చేది లేదని ప్రభుత్వం పరోక్షంగా తేల్చి చెప్పినట్టైంది. దీనికి తోడు ఈ ఏడాది కూడా వేటనిషేధ భృతి తీసుకున్న వారిని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయనున్న ఇతర సంక్షేమ పథకాలకు అనర్హులుగా గుర్తించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం వివాదాస్పదమైంది.
గత ఏడాది భృతి రానట్టే..
ఏటా ఏప్రిల్ 15 నుంచి జూన్ 14 అర్ధరాత్రి వరకు రెండు నెలల పాటు ఏపీ మైరెన్ ఫిషింగ్ యాక్ట్ 1994 ప్రకారం వేట నిషేధ కాలంగా రాష్ట్ర ప్రభు త్వాలు అమలు చేస్తూ వస్తున్నాయి. అయితే గతంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు 2014–19 మధ్యకాలంలో కూడా వేటనిషేధ సమయంలో కేవలం రూ.4 వేలు చొప్పున ఉపాధి భృతిగా ఇచ్చేవారు. అయితే 2019లో అధికారంలోకి వచ్చిన వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ఈ మొత్తాన్ని రూ.10 వేలకు పెంచుతూ, డీజిల్ సబ్సిడీని కూడా అందించింది. దీంతో మత్స్యకారుల జీవన ప్రమాణాలు పెరిగేలా జగన్ సర్కార్ అడుగులు వేసింది. కొత్తగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 2024–25లో వేట నిషేధ కాలానికి భృతి ఇవ్వకుండా ఏడాది పాటు కాలయాపన చేసింది. ఇప్పుడు మరోసారి నిషేధ కాలం రావడంతో గత ఏడాది భృతికి మంగళం పాడేసింది. ఇంతవరకు దీనిపై ఎలాంటి స్పష్టత ఇవ్వకపోవడంతో మత్స్యకారుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.
ఇచ్చిన మాట ప్రకారం ఐదేళ్లూ...
గతంలో వైఎస్ జగన్ సర్కార్ అన్ని వర్గాల ప్రజల కు ఎన్నికల మేనిఫెస్టో ప్రకారం ఇచ్చిన మాట ప్రకారం అన్ని హామీలను నెరవేర్చిన సంగతి విదితమే. అయితే ముఖ్యంగా మత్స్యకారులకు వరుసగా ఐదేళ్ల పాటు వైఎస్సార్ మత్స్యకార భరోసా పేరిట 70,611 మందికి ఐదు విడతల్లో రూ.70.61 కోట్లు వారి ఖాతాల్లో నేరుగా జమచేసింది. అలాగే ఈ ప్రకారం లబ్ధి పొందిన వారికి ప్రభుత్వం అందజేసిన ఇతర సంక్షేమ పథకాలను కూడా వర్తించేలా చర్యలు చేపట్టింది. కేవలం మత్స్యకారుల బాగు కోసం మూలపేటలో రూ.4,362 కోట్లతో పోర్టు, అలాగే ఎచ్చెర్ల మండలం బుడగట్లపాలెంలో రూ.365.81 కోట్లతో ఫిషింగ్ హార్బర్, వజ్రపుకొత్తూరు మండలం మంచినీళ్లపేటలో రూ.15 కోట్లతో షిఫ్ ల్యాండింగ్ సెంటర్‌ల నిర్మాణాలను చేపట్టారు.
భృతి తీసుకుంటే..సంక్షేమం కట్
వేట నిషేధ సమయంలో ఉపాధి కోల్పోయిన మత్స్యకారులకు భరోసాగా కూటమి సర్కార్ ‘మత్స్యకార చేయూత’ పథకాన్ని అమలు చేయనుంది. ఈ భృతి పొందిన లబ్ధిదారులకు ప్రభుత్వం అమలు చేస్తున్న ఇతర సంక్షేమ పథకాలకు అనర్హులుగా ప్రకటించింది. 60 ఏళ్ల వయసు దాటిన వా రు, అలాగే గృహ వినియోగ విద్యుత్ నెలకు 300 యూనిట్లు వినియోగించిన వారు అనర్హులని నిబంధనలు విధించారు. అలాగే సూపర్ సిక్స్ పథకాల్లో ఆడబిడ్డ నిధి, అన్నదాత సుఖీభవ, నిరుద్యోగభృతి, చంద్రన్న పెళ్లి కానుక, ఎన్టీఆర్ విద్యోన్నతితో పాటు పెన్షన్ కూడా పొందేందుకు అనర్హులవుతారు.
2024–25 నాటి భృతి చెల్లింపుపై వెలువడని ఉత్తర్వులు
ఈ ఏడాది 15548 మందికి రూ.20 వేలు చొప్పున భృతి అందజేయనున్న సీఎం చంద్రబాబు
భృతి పొందితే.. ఇతర సంక్షేమ పథకాలకు అనర్హులే
పాత బకాయిలు ఇవ్వాల్సిందే..
జిల్లాలో మత్స్యకారులకు 2024–25 వేట నిషేధ సమయంలో ఇవ్వాల్సిన భృతిని కలుపుకుని రూ.40 వేల చొప్పున జమ చేయాలి. జిల్లా మత్స్యకార సంఘాల ప్రతినిధులకు ఎలాంటి ఆహ్వానాలు లేకుండా సమావేశాలు కార్యక్రమాలను నిర్వహించడం ప్రోటోకాల్ ఉల్లంఘన కిందకే వస్తుంది. గత ప్రభుత్వం మత్స్యకారుల ఉపాధి కోసం, జిల్లా ప్రగతి కోసం చేపట్టిన పోర్టులు, జెట్టీలు, హార్బర్ల నిర్మాణాలు యథావిధిగా కొనసాగించాలి.
– కోనాడ నరిసింగరావు, జిల్లా మత్స్యకార
సహకార సంక్షేమ సంఘ అధ్యక్షుడు
511 మంది అనర్హులుగా గుర్తించాం
జిల్లాలో మత్స్యకార చేయూత కార్యక్రమంలో భాగంగా మొత్తం 11 మండలాల్లో 15548 మందిని అర్హులు గా గుర్తించాం. 511 మందిని మాత్రమే అనర్హులుగా గుర్తించాం. అలాగే మోటరైజ్డ్ బోట్లు 1565, నాన్ మోటరైజ్డ్ 2557 బోట్లు ఉన్నట్టుగా సర్వేలో గుర్తించాం. నిబంధనల ప్రకారం అర్హులకే రూ.20 వేల చొప్పున జమ చేయనున్నాం.
– వై.సత్యనారాయణ, డిప్యూటీ డైరెక్టర్, మత్స్యశాఖ

బకాయి ఇక రానట్టే..!

బకాయి ఇక రానట్టే..!

బకాయి ఇక రానట్టే..!