
దుకాణాలు సర్దేయండి!
● ఆమదాలవలస రైల్వేస్టేషన్ పరిధిలోని షాపుల నిర్వాహకులకు నోటీసులు ● 15 రోజుల్లో ఖాళీ చేయాలని రైల్వే అధికారుల ఆదేశం ● రోడ్డున పడతామంటున్న వ్యాపారులు
ఆమదాలవలస రూరల్ :
రైల్వే స్టేషన్ పరిధిలో పలు దుకాణాలు నిర్వహిస్తున్న వారికి రైల్వే అధికారులు షాకిచ్చారు. తక్షణమే ఖాళీ చేయాలంటూ దుకాణ యజమానులకు నోటీసులు జారీ చేశారు. దీంతో వారంతా ఆందోళన చెందుతున్నారు. వ్యాపారాలు కోల్పోయి రోడ్డున పడతామంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడి రైల్వే స్థలంలో సుమారు 40 సంవత్సరాలుగా రైల్వే అధికారులు గుర్తించిన స్థలంలోనే సుమారు 46 దుకాణాలను వ్యాపారులు ఏర్పాటు చేసుకున్నారు. 1980 నుంచి ఈ వ్యాపారాలు కొనసాగిస్తున్నారు. అంతే కాకుండా 10 అడుగులు వెడల్పు, 10 అడుగు పొడవున విస్తీర్ణం గల స్థలంలో శాశ్వత నిర్మాణాలు చేపట్టి తొలుత రూ.200 చొప్పున ఆక్రమణ పన్ను రైల్వేశాఖకు చెల్లిస్తూ వచ్చేవారు. అయితే ప్రతి మూడు, నాలుగేళ్లకోసారి రైల్వేశాఖ ఆక్రమణ పన్ను పెంచుతూ వస్తోంది. ప్రస్తుతం ఈ ఆక్రమణ పన్ను ఒక్కో దుకాణానికి రూ.12,000 చొప్పున చెల్లిస్తున్నారు. అయితే ఏం జరిగిందో గానీ నోటీసు అందిన 15 రోజుల్లో దుకాణాలు ఖాళీ చేయాలని రైల్వే అధికారులు ఆదేశించడంతో వ్యాపారులు దిక్కుతోచక తలలు పట్టుకుంటున్నారు.
ప్రత్యామ్నాయమేదీ..?
నాలుగు దశాబ్దాలుగా ఇవే దుకాణాల్లో వివిధ వ్యాపారాలు చేసుకొని కుటుంబాలతో జీవనం సాగిస్తున్నామని వ్యాపారులు చెబుతున్నారు. ఉన్నఫలంగా దుకాణాలు ఖాళీ చేయాలని నోటీసులు జారీ చేసి తమ పొట్ట కొట్టవద్దని వాపోతున్నారు. అర్ధంతరంగా ఖాళీచేయమంటే తాము ఎక్కడికి వెళ్లాలని ఆవేదన చెందుతున్నారు. గతంలో రైల్వే బుకింగ్ కార్యాలయం, ఇతర అభివృద్ధి పనుల కోసం కొన్ని షాపులు తొలగించినప్పటి వారికి ప్రత్యామ్నాయంగా మరో చోట అవకాశం కల్పించారు. తమకు మాత్రం ప్రత్యామ్నాయం చూపకుండా ఖాళీచేసి వెళ్లిపోవాలని ఆదేశించడంపై పలువురు మండిపడుతున్నారు.
అభివృద్ధిపై ప్రభావం..
రైల్వేస్టేషన్ పరిధిలో ఉండే దుకాణాలు ఖాళీచేస్తే వ్యాపారాలు లేక ఆమదాలవలస అభివృద్ధిపై ప్రభావం చూపుతుందని స్థానికులు అంటున్నారు. ఇప్పటికే ఆమదాలవలస సహకార చక్కెర కర్మాగారం మూతపడటంతో అభివృద్ధి పూర్తిగా నిలిచిపోవటమే కాకుండా మున్సిపాలిటీ రావాల్సిన ఆదాయ వనరులు తగ్గిపోయాయని, ఇప్పుడు షాపులు కూడా తొలగిస్తే అనేక మంది జీవనోపాధి కోల్పోతారని చెబుతున్నారు. మరోవైపు, జిల్లా కేంద్ర రైల్వేస్టేషన్‌గా గుర్తింపు పొందిన ఈ స్టేషన్‌కు నిత్యం పెద్ద ఎత్తున ప్రయాణికులు రాకపోకలు సాగిస్తుంటారు. ఇటువంటి తరుణంలో దుకాణాలు తొలగించటం వల్ల ప్రయాణికులు అందక ఇబ్బందులు పడే అవకాశముందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
కోర్టును ఆశ్రయించనున్న వ్యాపారులు..
అర్ధంతరంగా దుకాణాలు తొలగించటం వల్ల వ్యాపారులతో పాటు ప్రయాణికులు కూడా ఇబ్బంది పడే ప్రమాదం ఉన్నందున కొందరు వ్యాపారు లు కోర్టును ఆశ్రయించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలిసింది. అయితే రైల్వే అధికారులు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ తొలగించక తప్పదని అంటున్నారు.

దుకాణాలు సర్దేయండి!

దుకాణాలు సర్దేయండి!