సూర్యపేట్: ఉమ్మడి జిల్లాలో పోటీలో ఉండే అభ్యర్థుల విషయంలో బీజేపీ రాష్ట్ర నాయకత్వం ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చింది. కొన్ని నియోజకవర్గాల్లో ఒకరి పేరునే మొదటి ప్రాధాన్యంగా తీసుకొని అధిష్టానానికి పంపించగా.. మరికొన్ని నియోజకవర్గాలో రెండవ పేరుతో కూడిన జాబితాను పంపించినట్లు తెలిసింది. ఆశావహుల నుంచి దరఖాస్తులను స్వీకరించిన పార్టీ స్క్రీనింగ్ కమిటీ వాటి వడబోత కార్యక్రమాన్ని పూర్తి చేసింది.
నియోజవకర్గాల్లో పోటీలో ఉండబోయే అభ్యర్థుల పేర్లను ఈ నెల 15వ తేదీ తరువాత ప్రకటించనుంది. అయితే, అభ్యర్థుల విషయంలో ఇప్పటికే స్పష్టతకు వచ్చిన పార్టీ.. మిగతా వారిని బుజ్జగించే పనిలో ఉంది.
నాలుగు రకాలుగా వడబోత
అభ్యర్థుల ఎంపికలో నాలుగు రకాల జాబితాలను సేకరించినట్లు తెలిసింది. ఇందులో ముఖ్యమైన నేతల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుంది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి, జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, పార్టీ ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్ నుంచి ప్రతి నియోజకవర్గానికి చెందిన ఆశావహులపై అభిప్రాయాలను తీసుకున్నట్లు పార్లీ వర్గాలు పేర్కొన్నాయి.
మరోవైపు బీజేపీకి వెన్నెముకగా వ్యవహరించే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ నుంచి కూడా నియోజకవర్గాల వారీగా పేర్లను తీసుకున్నట్లు తెలిసింది. ఉమ్మడి నల్లగొండ జిల్లాకు సంబంధించి కూడా ఇలా అభిప్రాయ సేకరణ చేసిన తరువాత వాటన్నింటని క్రోడీకరించి కొన్ని నియోజకవర్గాల్లో ఒక్కరి పేరును, మరికొన్ని నియోజకవర్గాల్లో ఇద్దరి పేర్లను, ఇంకొన్ని నియోజకవర్గాల్లో ముగ్గురి పేర్లతో కూడా జాబితాను పార్టీ అధిష్టానానికి పంపించింది.
నాలుగు చోట్ల ఒక్కరి పేరే..
నాలుగు నియోజకవర్గాల్లో పోటీ చేయబోయే అభ్యర్థుల విషయంలో నాలుగు రకాల జాబితాల్లో ఒక్కరి పేరును మొదటిదిగా పేర్కొన్నట్లు తెలిసింది. అందులోని ఆ ఒక్కరి విషయంలో ఏకాభిప్రాయం రావడంతో వారికే టికెట్‌ను పార్టీ ప్రకటించే అవకాశం ఉంది.
మునుగోడు నియోజకవర్గం నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, సూర్యాపేట నియోజకవర్గం నుంచి సంకినేని వెంకటేశ్వర్‌రావు, భువనగిరి నుంచి గూడురు నారాయణరెడ్డి, తుంగతుర్తి నుంచి కడియం రామచంద్రయ్య పేర్లను ఖరారు చేసినట్లు తెలిసింది. అనుకోని పరిణామాలు ఎదురైతే తప్ప వారి విషయంలో మార్పు ఉండే అవకాశం లేదు.
రంగంలోకి జిల్లా ఎన్నికల ఇన్‌చార్జీలు..
పార్టీ అధిష్టానం జిల్లా ఎన్నికల ఇన్‌చార్జీలను రంగంలోకి దింపుతోంది. టికెట్ ఎవరికి ఇచ్చినా పనిచేసేలా బుజ్జగింపులకు తెర తీసింది. అసంతృప్తులకు నచ్చజెప్పే ప్రయత్నం చేస్తోంది. ఇందులో భాగంగా నల్లగొండ జిల్లా ఎన్నికల ఇన్‌చార్జి, కేంద్ర మంత్రి శోభ కరాండ్లజే జిల్లాకు చేరుకున్నారు. వివిధ నియోజకవర్గాల నేతలతో భేటీ అవుతున్నారు. యాదాద్రి, సూర్యాపేట జిల్లాల్లోనూ మూడు నాలుగు రోజుల్లో జిల్లా ఎన్నికల ఇన్‌చార్జీల సమావేశాలు నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తున్నారు.
ఇద్దరి పేర్లను ప్రతిపాదించిన నియోజకవర్గాలు..
ఉమ్మడి జిల్లాలోని మిగతా నియోజకవర్గాల్లో ఒక్కో సెగ్మెంట్ నుంచి ఇద్దరి పేర్లను అధిష్టానానికి పంపించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. ప్రధానంగా పోటీపడుతున్న వారిలో నల్లగొండ నుంచి మాదగోని శ్రీనివాస్‌గౌడ్, కన్మంతరెడ్డి శ్రీదేవిరెడ్డి, నాగం వర్షిత్‌రెడ్డి టికెట్ ఆశిస్తుండగా.. వారిలో ఇద్దరి పేర్లను పంపించినట్లు సమాచారం.
నకిరేకల్ నుంచి చేపూరి రవీందర్, నకిరేకంటి మొగిలయ్య, దేవరకొండ నుంచి కేతావత్ లాలూనాయక్, జర్పుల కల్యాణ్‌నాయక్, నాగార్జునసాగర్ నుంచి కంకణాల నివేదితారెడ్డి, బుసిరెడ్డి పాండురంగారెడ్డి, మన్నెం రంజిత్‌యాదవ్, మిర్యాలగూడ నుంచి సాదినేని శ్రీనివాసరావు, రేపాల పురుషోత్తంరెడ్డి, పల్నాటి వెంకట్‌రెడ్డి, ఆలేరు నుంచి పడాల శ్రీనివాస్, కాసం వెంకటేశ్వర్లు, సూదగాని హరిశంకర్‌గౌడ్, కోదాడలో నూకల పద్మావతిరెడ్డి, ఓర్సు వేలంగిరాజు, హుజూర్‌నగర్‌లో బొబ్బా భాగ్యరెడ్డి, గట్టు శ్రీకాంత్‌రెడ్డి, చల్లా శ్రీలతారెడ్డి టికెట్ కోసం పోటీపడుతున్నారు. వారిలో ఇద్దరి పేర్లతో కూడిన జాబితాను పంపించింది.
Comments
Please login to add a commentAdd a comment