సాక్షి ప్రతినిధి, నల్లగొండ: ఉమ్మడి జిల్లాలోని తొమ్మిది నియోజకవర్గాల్లో అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ మిగతా మూడు నియోజకవర్గాలపై ఇంకా తేల్చడం లేదు. దీంతో ఆశావహుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. తుంగతుర్తి, సూర్యాపేట, మిర్యాలగూడ నియోజకవర్గాల్లో అభ్యర్థులను ప్రకటించకపోవడంతో పార్టీ శ్రేణుల్లో గందరగోళం నెలకొంది. బీఆర్‌ఎస్ పార్టీ రెండు నెలల కిందటే అన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థులను ప్రకటించి, ప్రచారంలో దూసుకుపోతోంది. ఇప్పటికే సీఎం కేసీఆర్ 8 బహిరంగ సభల్లో పాల్గొన్నారు. కాంగ్రెస్ మాత్రం అన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థులనే ప్రకటించకపోవడంతో ఆశావహులు అయోమయంలో పడ్డారు. త్వరగా తేల్చాలంటూ ఢిల్లీ బాట పట్టారు.
పొత్తు పేరుతో నాన్చుడు ధోరణి!
కాంగ్రెస్ పార్టీ రెండు విడతలుగా అభ్యర్థుల జాబితాను ప్రకటించింది. రెండు విడతల్లో 9 నియోజక వర్గాల అభ్యర్థులను ఖరారు చేసింది. దీంతో ఆయా నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు ప్రచారంలో ముందుకు సాగుతున్నారు. ఇక మునుగోడు నియోజకవర్గంలో పొత్తులో భాగంగా సీసీఐకి ఇస్తామని ఒప్పందం కుదుర్చుకునే సమయంలోనే బీజేపీ నుంచి మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి చేరడంతో, రెండో జాబితాలో మునుగోడు స్థానాన్ని రాజగోపాల్‌రెడ్డికి కేటాయించింది. దీంతో సీపీఐ ఒంటరిపోరుకు సిద్దమైంది. పొత్తులో భాగంగా మిర్యాలగూడ సీటు సీపీఎం కోరుకుంది.
అక్కడ కాంగ్రెస్ నాయకుడు బత్తుల లక్ష్మారెడ్డి టికెట్ కోసం పట్టుబడుతున్నారు. దీంతో కాంగ్రెస్ అభ్యర్థిని ప్రకటించే విషయంలో నాన్చుడు ధోరణి అవలంబించడంతో సీపీఎం.. కాంగ్రెస్‌కు గడువు పెట్టింది. ఆ గడువులోగా అభ్యర్థిని ప్రకటించకపోవడంతో ఒంటరిగా పోటీలో ఉంటామని సీపీఎం ప్రకటించింది. అయినా ఇప్పటికీ కాంగ్రెస్‌తో చర్చలు జరుపుతూనే ఉంది. దీంతో కాంగ్రెస్ పార్టీ మిర్యాలగూడ స్థానాన్ని సీపీఎంకు ఇస్తుందా..? తన అభ్యర్థినే పోటీలో నిలుపుతుందా? తేల్చడం లేదు. దీంతో అక్కడ కాంగ్రెస్ ఆశావహులతోపాటు సీపీఎం నేతలు అయోమయంలోనే ఉన్నారు.
సొంత అభ్యర్థులనూ తేల్చని కాంగ్రెస్..
మిర్యాలగూడ వ్యవహారం పొత్తు నేపథ్యంలో గందరగోళంలో పడగా.. సూర్యాపేట, తుంగతుర్తి నియోజకవర్గాల్లో సొంత అభ్యర్థులను ప్రకటించే విషయంలోనూ కాంగ్రెస్ నాన్చుడు ధోరణినే ప్రదర్శిస్తోంది. దీంతో అక్కడ ఎవరికి టికెట్ ఇస్తారన్న అయోమయం నెలకొంది. రెండుచోట్ల కాంగ్రెస్ నుంచి ఇద్దరు చొప్పున అభ్యర్థులు టికెట్ కోసం పోటీపడుతున్నారు. సూర్యాపేటలో మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్‌రెడ్డి, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి పటేల్ రమేష్‌రెడ్డి పట్టుబడుతున్నారు.
అక్కడ అధికార పార్టీ అభ్యర్థి, మంత్రి జగదీశ్‌రెడ్డి ప్రచారంలో దూసుకుపోతున్నారు. మరోవైపు బీజేపీ కూడా ఇటీవల సంకినేని వెంకటేశ్వర్‌రావు పేరును ప్రకటించింది. ఇక తుంగతుర్తి నియోజకవర్గానికి వస్తే.. తెలంగాణ ఉద్యమ నాయకుడు అద్దంకి దయాకర్ గతంలో కొద్ది ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఈసారి కూడా అధిష్టానం తనకే టికెట్ ఇస్తుందన్న ఆశతో ఆయన ఉన్నారు. అయితే, మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరారు.
ఆయన కూడా తుంగతుర్తి టికెట్ కోసం పట్టుబడుతున్నారు. ఈ పరిస్థితుల్లో ఇరువురిలో టికెట్ ఎవరికనేది కాంగ్రెస్ పార్టీ తేల్చడం లేదు. ఎన్నికల నోటిఫికేషన్ విడుదలై.. నామిషన్ల ప్రక్రియ కూడా ప్రారంభమైనా కాంగ్రెస్ పార్టీ ఇంకా అభ్యర్థులను తేల్చకపోవడంతో ఆశావహులు ఎదురుచూపులతో కాలం గడుపుతున్నారు. అభ్యర్థుల ప్రకటన విషయంలో పార్టీ ఆలస్యం చేసిన కొద్దీ ప్రచారంలో వెనుకబడిపోతామనే ఆందోళన వారిని వెంటాడుతోంది.
ఇవి చదవండి: ఎన్నికల ప్రచారంలో వేగం.. పోటాపోటీగా సాగుతున్న ప్రచారం!
Comments
Please login to add a commentAdd a comment