పంటలు ఎండుతున్నా మంత్రులకు పట్టదా?
సాక్షి, యాదాద్రి : ఉమ్మడి జిల్లాలో కరెంట్ కోతలతో నీళ్లు అందక పంటపొలాలు ఎండిపోతున్నాయని, కాంగ్రెస్ ప్రభుత్వం కనీసం తాగునీరు కూడా ఇవ్వలేకపోతోందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విమర్శించారు. గురువారం జనగామ జిల్లా పర్యటన ముగించుకుని హైదరాబాద్ వెళ్తూ కొద్దిసేపు భువనగిరిలోని వివేరా హోటల్‌లో ఆగారు. అక్కడ విలేకరులతో ఆమె మాట్లాడారు. ఆలేరు, భువనగిరికి కేసిఆర్ హయాంలో కాళేశ్వరం ద్వారా గోదావరి జలాలు, ఇంటింటికి మిషన్ భగీరథ ద్వారా తాగునీరు అందించారని గుర్తుచేశారు. విద్యుత్ సమస్య ఉండొద్దని కేసీఆర్ ప్రభుత్వంలో జిల్లాలో పవర్‌ప్లాంటు ఏర్పాటు చేశారని అన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కమీషన్లపై దృష్టి కేంద్రీకరించారని ఆరోపించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు ఉన్న అధిక సంతానం నిబంధన ఎత్తివేయాలన్నారు. చాలా రాష్ట్రాల్లో ముగ్గురు పిల్లల నిబంధన తొలగించారని గుర్తుచేశారు. బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితో ముందుకు పోవాలన్నారు. విద్య, ఉపాధి రాజకీయ రంగాల్లో వేర్వేరుగా మూడు బిల్లులు ప్రవేశపెట్టి వాటికి చట్టబద్ధత కల్పించాలని ఆమె డిమాండ్ చేశారు. రిజర్వేషన్లపై న్యాయస్థానాలకు వెళ్ళినప్పుడు కూడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా నిర్మాణాత్మకంగా బీసీ రిజర్వేషన్లు అమలు చేయాలన్నారు. లేదంటే కాంగ్రెస్ పార్టీ బీసీల ద్రోహి పార్టీగా మిగిలిపోతుందన్నారు. సోషల్ మీడియాలో చిన్న పోస్ట్ పెట్టినా.. సీఎం రేవంత్ వణికిపోతున్నారన్నారు. కవిత వెంట మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత, నాయకులు క్యామ మల్లేష్, బీరు మల్లయ్య, అనురాధ, శ్రీశైలం తదితరులు ఉన్నారు.
ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విమర్శ
Comments
Please login to add a commentAdd a comment