ఫ కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్
భానుపురి (సూర్యాపేట) : వరంగల్– ఖమ్మం– నల్లగొండ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ నిర్వహణకు సర్వం సిద్ధం చేసినట్లు కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్ పేర్కొన్నారు. బుధవారం సూర్యాపేట జిల్లా సిబ్బందికి ఎన్నికల సామగ్రి పంపిణీకి కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ సెంటర్‌ను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ సందర్శించారు. ఎన్నికల సామగ్రి పంపిణీ తీరు తెన్నులు, సదుపాయాలు పరిశీలించారు. పీఓ, ఏపీఓ, ఓపీఓలతో కూడిన బృందాలన్నీ హాజరయ్యాయా లేదా అని ఆరా తీశారు. బ్యాలెట్ పద్ధతి ద్వారా చేపట్టాల్సిన పోలింగ్ ప్రక్రియను , పోలింగ్ సామగ్రి గురించి ప్రయోగాత్మకంగా వివరిస్తున్న తీరును గమనించారు. పోలింగ్ సిబ్బందితో పాటు ఓటింగ్ కేంద్రాల వద్ద బందోబస్తు నిర్వహించే పోలీసు సిబ్బందిని తరలించేందుకు సిద్ధంగా ఉంచిన ఆర్టీసీ బస్సులను పరిశీలించి, సకాలంలో నిర్దేశిత పోలింగ్ కేంద్రాలకు సిబ్బంది చేరుకునేలా పర్యవేక్షణ చేయాలని అధికారులను ఆదేశించారు. పోలింగ్ సామగ్రి పీఎస్‌లకు తీసుకెళ్తున్న సమయంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తినా వెంటనే తమ దృష్టికి తేవాలని సూచించారు. కాగా జిల్లాలో 23 పోలింగ్ కేంద్రాల్లో 2,664 మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించు కోనున్నారని, గురువారం ఉదయం 8గంటల నుంచి సాయంత్రం 4గంటల వరకు పోలింగ్ ఉంటుందని తెలిపారు. ఎన్నికల కోసం 139మందిపోలింగ్ సిబ్బందిని వినియోగిస్తున్నామన్నారు. ఏడు రూట్లు ఏర్పాటు చేశామని, ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద కట్టుదిట్టమైన పోలీసు బందోబస్తు ఉంటుందని, పరిస్థితిని ఎప్పటికప్పుడు ఫ్లయింగ్ స్క్వాడ్ పర్యవేక్షిస్తాయని తెలిపారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు కలిగి ఉన్న వారు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. కలెక్టర్ వెంట అదనపు కలెక్టర్ పి. రాంబాబు , ఆర్డీఓ వేణుమాధవ్, పోలింగ్ సిబ్బంది, ఇతర అధికారులు తదితరులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment