
మెనూ అమలు చేయని వారిపై కఠిన చర్యలు
సూర్యాపేట : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నూతన మెనూ అమలు చేయని హాస్టల్ వార్డెన్లపై కఠిన చర్యలు తీసుకోనున్నట్లు జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ అధికారిణి లత హెచ్చరించారు. కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్ ఆదేశాల మేరకు గురువారం రాత్రి సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలికల కళాశాల వసతి గృహం ( ఏ ) లో రాత్రి బస చేశారు. హాస్టల్ లో అమలవుతున్న నూతన మెనూ వివరాలను విద్యార్థిను అడిగి తెలుసుకున్నారు. పౌష్టికాహారం అందాలన్న లక్ష్యంతో ప్రభుత్వం అత్యధికంగా ఖర్చు చేసి విద్యార్థులకు నూతన మెనూ అమలు చేస్తుందన్నారు. హాస్టల్ విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను నేరుగా అధికారులకు చేరే విధంగా ప్రతి హాస్టల్ లో కంప్లైంట్ బాక్స్ ఏర్పాటు చేశామన్నారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. రాబోయే పరీక్షలకు విద్యార్థులంతా సిద్ధం కావాలని కోరారు. ప్రణాళికా బద్ధంగా సిలబస్ పూర్తి చేసి ఉత్తమ ఫలితాలు సాధించాలని సూచించారు. కార్యక్రమంలో హాస్టల్ హెచ్‌డబ్ల్యూఓ మహబూబా పాల్గొన్నారు.
మట్టపల్లి క్షేత్రంలో కల్యాణం
మఠంపల్లి: మట్టపల్లి దేవాలయంలో శ్రీరాజ్యలక్ష్మి చెంచులక్ష్మి సమేత శ్రీలక్ష్మీనరసింహస్వామి నిత్యకల్యాణాన్ని అర్చకులు వేదమంత్రాలతో గురువారం విశేషంగా నిర్వహించారు. ఈసందర్భంగా ఆలయంలో విశేష పూజలు చేశారు. దానిలో భాగంగా సుప్రభాతసేవ, నిత్యహోమం, మూలవిరాట్‌కు పంచామృతాభిషేకం చేపట్టారు. అదేవిధంగా శ్రీస్వామి అమ్మవార్లను నూతన పట్టువస్త్రాలతో వధూవరులుగా అలంకరించి ఎదుర్కోళ్ల మహోత్సవం నిర్వహించారు. కల్యాణతంతులో భాగంగా విష్వక్సేనారాధన, పుణ్యాహ వచనం ,రక్షాబంధనం ,రుత్విగ్వరణం ,మధుఫర్కపూజ, మాంగళ్యధా4రణ, తలంబ్రాలు తదితర కార్యక్రమాలు నిర్వహించారు. అదేవిధంగా శ్రీస్వామివారిని ఆలయ తిరుమాడ వీధుల్లో గరుడవాహనంపై ఊరేగించారు. అనంతరం నీరాజన మంత్ర పుష్పాలతో మహానివేదన చేసి భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్తలు చెన్నూరు విజయ్‌కుమార్, మట్టపల్లిరావు, ఈఓ నవీన్‌కుమార్, అర్చకులు అద్దేపల్లి లక్ష్మణాచార్యులు, పద్మనాబాచార్యులు, బదరీ నారాయణాచార్యులు, ఫణిభూషణ మంగాచార్యులు, లక్ష్మీనరసింహమూర్తి , ఆంజనేయాచార్యులు, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ శేషగిరిరావు పాల్గొన్నారు.
యాదగిరి క్షేత్రంలో
సంప్రదాయ పూజలు
యాదగిరిగుట్ట : యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి దివ్యక్షేత్రంలో గురువారం సంప్రదాయ పూజలు వైభవంగా నిర్వహించారు. వేవకుజామున సుప్రభాత సేవతో స్వామి, అమ్మవారిని మేల్కొలిపిన అర్చకులు.. గర్భగుడిలో కొలువుదీరిన స్వయంభువులు, ప్రతిష్టామూర్తులను అభిషేకించి తులసీ దళాలతో అర్చించారు. అనంతరం ప్రధానాలయ ప్రథమ ప్రాకార మండపంలో శ్రీసుదర్శన నారసింహహోమం చేశారు. ఆతరువాత స్వామి, అమ్మవారిని గజవాహన సేవలో ఊరేగించి నిత్య తిరుకల్యాణోత్సవం, బ్రహ్మోత్సవం, ముఖ మండపంలో అష్టోత్తర పూజలు నిర్వహించారు. సాయంత్రం స్వామి, అమ్మవారి జోడు సేవలను ఆలయ మాడ వీధిలో ఊరేగించారు. ఆయా వేడుకల్లో భక్తులు పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు.
ముగిసిన రాచకొండ పర్యాటక ఉత్సవాలు
సంస్థాన్ నారాయణపురం : రాచప్ప సమితి ఆధ్వర్యంలో రాచకొండలో నిర్వహిస్తున్న పర్యాటక ఉత్సవాలు గురువారం ముగిశాయి. భక్తులు, పర్యాటకులు ఉత్సవాల్లో పాల్గొని ఆలయాల్లో పూజలు నిర్వహించారు. రాచకొండ చరిత్రను తెలియజేసే ఫొటో గ్యాలరీతో పాటు పర్యాటక ప్రదేశాలను వీక్షించారు. రాచప్ప సమితి అధ్యక్షుడు మాట్లాడుతూ రాచకొండను అభివృద్ధి చేసి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని ప్రభుత్వాన్ని కోరారు.

మెనూ అమలు చేయని వారిపై కఠిన చర్యలు
Comments
Please login to add a commentAdd a comment