సరిపడా రాని యూరియా
భానుపురి (సూర్యాపేట) : అన్నదాతలకు పంటలు వేసిన నాటినుంచి డబ్బులు చేతికి అందేదాకా తిప్పలు తప్పడం లేదు. ప్రస్తుతం జిల్లాలోని పలు మండలాల్లో యూరియా కొరత నెలకొంది. అది కూడా ఆలస్యంగా సాగు చేసిన వరి పొలాలకు వేయడానికి రైతులు కొంత ఇబ్బందులు పడుతున్నారు. ఈ పొలాలు సైతం పొట్టదశలో ఉన్నాయి. ఒకట్రెండు రోజుల్లో వేయాల్సిన యూరియాను వారం, పదిరోజులు ఆలస్యంగా వేయాల్సిన పరిస్థితి నెలకొంది. అడుగంటిన భూగర్భ జలాలు, వట్టిపోయిన బోర్లతో నెట్టుకొస్తున్న రైతులకు ఈ సమస్య మరింత వెనక్కి నెట్టుతోంది. అంతంత మాత్రంగానే పారుతున్న పొలాలు.. యూరియా లేకపోవడంతో ఏపుగా పెరగకుండా దిగుబడి తగ్గుతుందన్న ఆందోళన రైతుల్లో నెలకొంది. యూరియా తిప్పలు అంతటా లేకపోగా.. ఉన్నచోట రైతుకు కేవలం రెండు నుంచి మూడు బస్తాలను మాత్రమే ఇస్తున్నారు.
4.30 లక్షల ఎకరాల్లో వరి సాగు
సూర్యాపేట జిల్లాలో కొన్నేళ్లుగా వరి సాగే అత్యధికంగా ఉంటోంది. జిల్లాలోని నాలుగు నియోజక వర్గాలకు ఓ వైపు సాగర్, మూసీ, ఎస్సారెస్సీ నీళ్లు అందుతుండడంతో ఇతర పంటల సాగును రైతులు వదిలేశారు. ఈ యాసంగి సీజన్‌లో 4.78 లక్షల ఎకరాల్లో వరి సాగవుతుందని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. ఈ లెక్కన జిల్లా రైతాంగానికి 68,280 మెట్రిక్ టన్నుల యూరియా అవసరమవుతుందని భావించగా.. సీజన్ ప్రారంభానికే జిల్లాలో 19,037 మెట్రిక్ టన్నుల యూరియా బఫర్ స్టాక్ ఉంది. ఫిబ్రవరి 15వ తేదీ నాటికి జిల్లాలో 56వేల మెట్రిక్ టన్నుల యూరియాను రైతులు వాడారు. నాటినుంచి మరో 10వేల మెట్రిక్ టన్నుల యూరియా వచ్చినా.. కొన్ని మండలాల్లో కొరత ఉంది.
ఆలస్యంగా సాగు చేయడంతో..
జిల్లాలోని సాగర్, మూసీ ఆయకట్టు ప్రాంతాలకు సరైన సమయానికే నీటిని విడుదల చేశారు. కానీ ఎస్సారెస్సీ ఆయకట్టుకు జనవరి 1వ తేదీన ఇవ్వడంతో చాలామంది రైతులు ఆలస్యంగా నాట్లు వేశారు. ముందుగా బోరుబావులతో పాటు సాగర్, మూసీ ఆయకట్టు కింద పడిన నాట్లకు రైతులు రెండోదఫా కూడా యూరియాను చల్చారు. ఇక తుంగతుర్తి, సూర్యాపేట నియోజకవర్గాల పరిధిలో ఆలస్యంగా సాగైన వరి పొలాలకు రెండోదఫా అందించాల్సిన యూరియా సమయానికి అందడం లేదు. వాతావరణ పరిస్థితులు, చాలీచాలని నీళ్లు తదితర సమస్యలతో అంతంత మాత్రమే ఉన్న పొలాలు పొట్టదశకు వచ్చే సమయానికి రెండోదఫా యూరియా లేకపోవడంతో తుంగతుర్తి, సూర్యాపేట నియోజకవర్గాల పరిధిలో ఉన్న రైతాంగానికి ఇబ్బందులు ఎదరవుతున్నాయి. ఈ ప్రాంతాల్లో వచ్చిన యూరియా వచ్చినట్లుగా అయిపోతుండగా.. ఒక్కో రైతుకు రెండు, మూడు బస్తాల చొప్పున మాత్రమే ఇస్తున్నారు.
ఫ రైతులకు అందని యూరియా బస్తాలు
ఫ పలు మండలాల్లో వచ్చిన
యూరియా వచ్చినట్లే ఖాళీ
ఫ సమయానికి వేయకపోవడంతో
దిగుబడి తగ్గుతుందని ఆందోళన
సరిపడా రాని యూరియా
Comments
Please login to add a commentAdd a comment