మేళ్లచెరువులో శివపార్వతుల కల్యాణం
మేళ్లచెరువు : మేళ్లచెరువు మండలకేంద్రంలోని శ్రీ ఇష్టకామేశ్వరీ సమేత శ్రీ స్వయంభు శంభులింగేశ్వర స్వామి వారి కల్యాణం గురువారం తెల్లవారు జామున మంత్రోచ్ఛరణల నడుమ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా దేవాలయం నుంచి కల్యాణ మంటపం వరకు స్వామి వారి ఉత్సవ మూర్తులను ఊరేగించారు. స్వామి, అమ్మవార్లను పట్టువస్త్రాలతో అలంకరించారు. అనంతరం గణపతిపూజ, పుణ్యాహవచనం, విష్వక్సేన పూజ చేసి వేదమంత్రాల సాక్షిగా స్వామి వారు అమ్మవారి మెడలో మాంగళ్యధారణ చేసే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అర్చకులు కొంకపాక కృష్ణమూర్తి శర్మ, విష్ణువర్ధన్ శర్మ, ధనుంజయశర్మ , పోశం నర్సిరెడ్డి, ఆలయ మేనేజర్ కొండారెడ్డి పాల్గొన్నారు.
గంగమ్మకు ప్రత్యేక పూజలు
స్వామి వారి సన్నిధిలో ఉన్న గంగమ్మ అమ్మవారికి యాదవులు ప్రత్యేక పూజలు చేశారు. బోనాలతో వచ్చి అమ్మవారికి మేకపోతులు బలిఇచ్చి మొక్కులు చెల్లించుకున్నారు. రెండో రోజు అధిక సంఖ్యలో భక్తులు స్వామిని దర్శించుకున్నారు.
రెండో రోజూ సాగిన మహా శివరాత్రి జాతర
మేళ్లచెరువు మండలకేంద్రంలోని శ్రీ ఇష్టకామేశ్వరీ సమేత శ్రీ స్వయంభు శంభులింగేశ్వర స్వామి వారి కల్యాణ బ్రహ్మోత్సవాల సందర్భంగా రెండవ రోజైన గురువారం కూడా జాతర కొనసాగింది. ఈ సందర్భంగా ఆలయంలో స్వామి వారికి రుద్రాభిషేకాలు, బలిహరణ, పుష్పాలంకరణ, మహానివేదన, తీర్థప్రసాద వినియోగం తదితర కార్యక్రమాలు నిర్వహించారు. దేవాలయంలో కోలాటమాడారు. భజనలు చేశారు. గిరిజన మహిళలు నృత్యాలు చేసి తమ భక్తిని చాటుకున్నారు.
మేళ్లచెరువులో శివపార్వతుల కల్యాణం
Comments
Please login to add a commentAdd a comment