యాదగిరిగుట్ట : తెలంగాణలో ప్రసిద్ధిగాంచిన యాదగిరిగుట్ట పంచనారసింహుడి దివ్యక్షేత్రం వార్షిక బ్రహ్మోత్సవాలకు ముస్తాబైంది. మంగళవారం విశ్వక్సేన ఆరాధన, స్వస్తివాచనంతో మొదలై శృంగార డోలోత్సవంతో బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి. 11 రోజుల పాటు జరిగే బ్రహ్మోత్సవాలను పాంచరాత్ర ఆగమ సిద్ధాంతానుసారంగా, సంప్రదాయరీతిలో వైభవంగా నిర్వహించేందుకు దేవస్థానం అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు. ఆలయాన్ని విద్యుత్ దీపాలు, తోరణాలు, పూలతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు.
11 రోజులు జరిగే కార్యక్రమాలు
● 1వ తేదీన ఉదయం 10గంటలకు విశ్వక్సేన ఆరాధన, స్వస్తివాచనం, రక్షాబంధనంతో బ్రహ్మోత్సవాలకు అర్చకులు శ్రీకారం చుట్టనున్నారు. సాయంత్రం 6.30 గంటలకు మృత్సంగ్రహణం, అంకురారోపణ ఉంటుంది.
● 2న ఉదయం 8గంటలకు అగ్నిప్రతిష్ఠ, 11గంటలకు ధ్వజారోహణం, సాయంత్రం 6.30 గంటలకు భేరీపూజ, దేవతాహ్వానం, హవన పూజ.
● 3న ఉదయం 9 గంటలకు మత్స్యవతార అలంకార సేవ, రాత్రి 7గంటలకు శేష వాహన సేవ.
● 4న ఉదయం 9గంటలకు వటపత్రశాయి అలంకారం, రాత్రి 7గంటలకు హంసవాహన సేవ.
● 5న ఉదయం 9గంటలకు మురళీకృష్ణుడి అలంకారం, రాత్రి 7గంటలకు పొన్న వాహన సేవ.
● 6న ఉదయం 9గంటలకు గోవర్థనగిరిధారి అలంకార సేవ, రాత్రి సింహవాహన సేవ.
● 7న ఉదయం 9గంటలకు జగన్మోహిని అలంకారం, రాత్రి అశ్వవాహన సేవ, ఆ తరువాత శ్రీస్వామి, అమ్మవార్ల ఎదుర్కోలు ఉత్సవం.
● 8న ఉదయం శ్రీరామ అలంకారంలో హనుమంత వాహనంపై ఊరేగింపు నిర్వహిస్తారు. రాత్రి గజవాహన సేవ, 8.45 గంటలకు శ్రీస్వామి,అమ్మవార్ల తిరుకల్యాణ మహోత్సవం.
● 9న ఉదయం 9గంటలకు శ్రీమహావిష్ణు అలంకార సేవలో గరుఢ వాహనం సేవపై శ్రీస్వామివారి ఊరేగింపు, రాత్రి 8గంటలకు ఆలయ తిరు, మాఢ వీధుల్లో దివ్యవిమాన రథోత్సవం.
● 10న ఉదయం 10.30గంటలకు చక్రతీర్థస్నానం వేడు, రాత్రి శ్రీపుష్పయాగం, దోపోత్సవం.
● 11న ఉదయం 10గంటలకు అష్టోత్తర శతఘటాభిషేకం, రాత్రి 9గంటలకు శ్రీస్వామి వారి శృంగార డోలోత్సవం, దోపు ఉత్సవంతో బ్రహ్మోత్సవాలు పరిసమాప్తం కానున్నాయి.
ప్రథమ ప్రాకార మండపంలో..
ప్రథమ ప్రాకార మండపంలో స్వామి వారిని అలంకరించి సేవలను తిరుమాడ వీధుల్లో ఊరేగిస్తారు. అలంకారసేవలను భక్తులకు దర్శించుకునేందుకు వీలుగా ఏర్పాట్లు చేస్తున్నారు.
నేటి నుంచి వార్షిక బ్రహ్మోత్సవాలు
ఫ విశ్వక్సేన ఆరాధనతో శ్రీకారం
ఫ 7న ఎదుర్కోలు, 8న తిరుకల్యాణం
రూ.3.15 కోట్లు కేటాయించాం
బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహించేందుకు భారీ ఏర్పాట్లు చేశాం. ఇందుకోసం రూ.3.15 కోట్ల బడ్జెట్ కేటాయించాం. రోజూ 2,500 మంది భక్తులకు అన్న ప్రసాదం అందించేందుకు ఏర్పాట్లు చేశాం. భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా తాగునీరు, బస్సులు, టాయిలెట్లు ఇతర సౌకర్యాలు కల్పిస్తున్నాం. రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, సీఎం రేవంత్‌రెడ్డితో పాటు పలువురు మంత్రులకు ఆహ్వానపత్రికలు అందజేశాం. –భాస్కర్‌రావు,
యాదగిరిగుట్ట దేవస్థానం ఈఓ
ఉత్తర మాడవీధిలో కల్యాణం
శ్రీస్వామి, అమ్మవారి తిరుకల్యాణ మహోత్సవానికి రాష్ట్రంతో పాటు దేశ నలుమూలల నుంచి భక్తులు భారీగా తరలిరానున్నారు. ఇందుకోసం దేవస్థానం అధికారులు విస్తృతంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రధానాలయ ఉత్తర మాడవీధిలో కల్యాణవేడుక నిర్వహించనున్నారు. కల్యాణోత్సవంలో పాల్గొనేందుకు భక్తులు రూ.3,000 టికెట్ తీసుకోవాలని అధికారులు కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment