ఎవరి లెక్కలు వారివే! | - | Sakshi
Sakshi News home page

ఎవరి లెక్కలు వారివే!

Published Sat, Mar 1 2025 7:41 AM | Last Updated on Sat, Mar 1 2025 7:38 AM

ఎవరి లెక్కలు వారివే!

ఎవరి లెక్కలు వారివే!

స్ట్రాంగ్‌ రూమ్‌కు ీసీల్‌

నల్లగొండ : ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్‌ గురువారం ముగిసింది. అనంతరం 12 జిల్లాల నుంచి వచ్చిన బ్యాలెట్‌ బాక్సులను ఆర్జాలబావి సమీపంలోని గోదాం వద్ద ఏర్పాటు చేసిన స్ట్రాంగ్‌ రూమ్‌లో శుక్రవారం భద్రపరిచారు. కలెక్టర్‌ ఇలా త్రిపాఠి, ఎస్పీ శరత్‌ చంద్ర పవార్‌ దగ్గరుండి.. పోటీలో ఉన్న అభ్యర్థులు, ఏజెంట్ల సమక్షంలో స్ట్రాంగ్‌ రూమ్‌కు సీల్‌ వేయించారు.

అంచనాలు వేసుకుంటున్న ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థులు

తామంటే.. తామే గెలుస్తామని ధీమా

ఒక్కో జిల్లాలో ఒక్కో అభ్యర్థికి ఓట్లు పడ్డాయని చెబుతున్న సంఘాలు

ఐదుగురి మధ్యే గట్టి పోటీ ఉంటుందని చెబుతున్న నేతలు

సాక్షి ప్రతినిధి, నల్లగొండ : వరంగల్‌ ఖమ్మం – నల్లగొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్‌ ముగియడంతో ఎవరికి ఎన్ని ఓట్లు పడ్డాయన్న అంచనాల్లో అభ్యర్థులు తనమునకలయ్యారు. జిల్లాలు, మండలాల వారీగా తమ సంఘాల సభ్యులు, తమ మద్దతుదారులు ఓట్లు వేసిన తీరును బట్టి గెలుపు తమదంటే.. తమదేనంటూ ధీమాలో ఉన్నారు.

బరిలో 19 మంది..

ఈ ఎన్నికల్లో 19 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నా ఐదుగురి మధ్యే ప్రధాన పోటీ ఉంటుందని ఉపాధ్యాయ, అధ్యాపక సంఘాలు అంచనా వేస్తున్నా యి. పీఆర్‌టీయూ బలపరిచిన అభ్యర్థి పింగిళి శ్రీపాల్‌రెడ్డి, యూటీఎఫ్‌ బలపరిచిన, ప్రస్తుత ఎమ్మెల్సీ నర్సిరెడ్డి, టీచర్స్‌ జేఏసీ, కాంగ్రెస్‌ మద్దతుతో పోటీలో ఉన్న హర్షవర్ధన్‌రెడ్డి, బీసీ వాదంతో బరిలో ఉన్న పూల రవీందర్‌, టీపీయూఎస్‌ బలపరిచిన, బీజేపీ అభ్యర్థి పులి సరోత్తంరెడ్డి మధ్యే ప్రధాన పోటీ ఉంటుందని అంచనా వేసుతన్నారు.

జిల్లాల వారీగా మారుతున్న బలాలు!

ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియోజకవర్గంలో ఒక్కో జిల్లాలో ఒక్కో అభ్యర్థి తమకు అనుకూలంగా ఉంటుందని అంచనాలు వేసుకుంటున్నారు. వరంగల్‌ జిల్లాలో తమకు మొదటి ప్రాధాన్య ఓట్లు అధికంగా వస్తాయని పీఆర్‌టీయూ, బీజేపీ, టీచర్స్‌ జేఏసీ అభ్యర్థులతోపాటు వారి అనుచరులు చెబుతుండగా, ఖమ్మం జిల్లాలో తమ అభ్యర్థికి అత్యధిక ఓట్లు వస్తాయని యూటీఎఫ్‌ నేతలు లెక్కలు వేసుకుంటున్నారు. గురుకులాలు, కేజీబీవీలు, ఆశ్రమ పాఠశాలలు, వ్యాయామ, భాషా పండితులు, ఆదర్శ పాఠశాలలు, ఇంటర్‌, డిగ్రీ కాలేజీల ఉపాధ్యాయ ఓట్లలో తమకే గణనీయంగా వచ్చాయని టీచర్స్‌ జేఏసీ బలపరిచిన కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి గాల్‌రెడ్డి హర్షవర్దన్‌రెడ్డి అనుచరులు చెబుతున్నారు. వరంగల్‌తోపాటు భద్రాద్రి కొత్తగూడెం, నల్లగొండలో తనకు ఎక్కువ ఓట్లు వస్తాయని టీచర్స్‌ జేఏసీ అభ్యర్థి అంచనా వేసుకుంటున్నారు. అయితే బహుజన, బీసీ వాదంతో పాటు అంసతృప్తి ఓట్లు తమకే వచ్చాయని, మొదటి ప్రాధాన్య ఓట్లతోనే గెలువబోతున్నామని మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్‌ అనుచరులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం ఉన్న సంఘాలపై వ్యతిరేక ఓట్లతోపాటు జాతీయవాద భావజాలమున్న ఉపాధ్యాయులంతా తమకే ఓటేశారని, గెలుపు తమదేనని బీజేపీ అభ్యర్థి సరోత్తంరెడ్డి అనుచరులు పేర్కొంటున్నారు.

గెలుపోటములు నిర్ణయించేది

ద్వితీయ ప్రాధాన్య ఓట్లే?

హోరాహోరీగా సాగిన ఈ ఎన్నికలో మొదటి ప్రాధా న్య ఓట్లతో కోటా ఓటు సాధ్యం కాదని, ద్వితీయ ప్రాధాన్య ఓట్లే గెలుపును నిర్ణయిస్తాయని ఉపాధ్యాయులు పేర్కొంటున్నారు. దాదాపుగా మొదటి ప్రాధాన్య ఓట్లు ఆయా సంఘాలు బలపరిచిన అభ్యర్థులకే పడతాయని చెబుతున్నారు. మొదటి ప్రాధాన్య ఓట్లతో గెలుస్తామని, పీఆర్‌టీయూ, యూటీఎఫ్‌, ఎస్టీయూ నేతలు చెబుతున్నారు. మిగితా అభ్యర్థులను బలపరిచిన టీచర్స్‌ జేఏసీ, టీ పీయూఎస్‌, బీజేపీ మాత్రం రెండో ప్రాధాన్య ఓట్లతోనే తుది ఫలితాలు వస్తాయని పేర్కొంటున్నాయి. మొదటి ప్రాధాన్యత ఓట్లను ప్రధాన అభ్యర్థులు కొద్దిపాటి తేడాలతో పంచుకునే అవకాశమే ఉంటుందని, రెండో ప్రాధాన్య ఓట్లే గెలుపోటములను నిర్ణయిస్తాయన్న చర్చ సాగుతోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement