
దేవతలకు ఆహ్వానం
ఫ రెండో రోజూ వైభవంగా
నృసింహుడి బ్రహ్మోత్సవాలు
యాదగిరిగుట్ట : యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు రెండో రోజు ఆదివారం ఆగమశాస్త్రం ప్రకారం వైభవంగా నిర్వహించారు.లోకకల్యాణం, విశ్వశాంతి కోసం ముక్కోటి దేవతలు ఆహుతులుగా సాగే బ్రహ్మోత్సవానికి యాదగిరి క్షేత్రం సిద్ధమైంది. ఆదివారం ఉదయం అగ్నిదేవుడికి ఆరాధన, హవనం, గరుడ ఆళ్వారుడికి ఇష్ట నైవేద్యం, ధ్వజపూజ, రాత్రి దేవతాహ్వాన వేడుకలు నిర్వహించారు.
ధ్వజపటం ఊరేగింపు
ప్రధానాలయంలో ఆదివారం ఉదయం నిత్యారాధనలు పూర్తయిన అనంతరం ఉత్తరమాడ వీధిలో ఏర్పాటు చేసిన యాగశాలలో యాజ్ఞికులు హోమాధి పూజలు నిర్వహించారు. అనంతరం ప్రత్యేక వస్త్రంపై తీర్చిదిద్దిన గరుడ ఆళ్వారుడి పటాన్ని ప్రత్యేక పల్లకిపై ఊరేగింపుగా ఉత్తరద్వారం నుంచి ప్రధానాలయ ముఖమండపంలోని ధ్వజస్తంభం వద్దకు తీసుకువచ్చారు. అనంతరం ఉత్సవమూర్తులకు ధ్వజస్తంభం వద్ద గరుడ ఆళ్వారుడి పటానికి ప్రత్యేక పూజలు చేశారు. రామానుజ కూటము నుంచి భాజాభజంత్రీలు, మేళ తాళాలతో గరుడ ముద్దలు తీసుకుచ్చి మొదటగా స్వయంభూలు, ఉత్సవమూర్తుల వద్ద, ఆ తరువాత గరుడ్మంతుడి వద్ద పూజలు చేశారు. అనంతరం ధ్వజపటానికి హారతినిచ్చి, గరుడ ముద్దలను ధ్వజ స్తంభంపైకి ఎగురవేశారు.
భేరీ మోగించి..
సాయంత్రం భేరీపూజ, దేవతాహ్వానం, హవన పూజ నిర్వహించారు. భేరీ మోగించి ముప్పై మూడు కోట్ల దేవతలను భువికి ఆహ్వానించే వేడుక వైభవంగా చేపట్టారు.
ఆలయంలో నేడు
బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం స్వామివారి అలంకార సేవలు ప్రారంభం కానున్నాయి. ఉదయం 9 గంటలకు అలంకార సేవలకు ఆచార్యులు శ్రీకారం చుట్టనున్నారు. ఉదయం మత్స్య అలంకరా, వేద పారాయణం, రాత్రి 7 గంటలకు శేషవాహన సేవ నిర్వహిస్తారు.
Comments
Please login to add a commentAdd a comment