అరుణాచలానికి ప్రత్యేక బస్సు
కోదాడ: తమిళనాడులోని అరుణాచలం గిరి ప్రదక్షిణకు వెళ్లే భక్తుల కోసం కోదాడ నుంచి ఆర్టీసీ ప్రత్యేక బస్సు సర్వీసు నడపనున్నట్లు కోదాడ డిపో మేనేజర్ శ్రీహర్ష సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 11న సాయంత్రం ఏడు గంటలకు కోదాడ నుంచి బయలుదేరే ఈ బస్సు 12న కాణిపాకం వినాయకుడు, వేలూరు గోల్డెన్ టెంపుల్ దర్శనం చేసుకున్న అనంతరం రాత్రికి అరుణాచలం చేరుకుంటుందని వివరించారు. 13న పౌర్ణమినాడు గిరిప్రదక్షిణ అనంతరం సాయంత్రం అక్కడి నుంచి బయలు దేరి 14న ఉదయం కోదాడకు బస్సు చేరుకుంటుందని పేర్కొన్నారు. దీని కోసం పెద్దలు రూ. 4,400 , పిల్లలు రూ.2,200 చార్జీ చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు. భోజన, వసతి సదుపాయాలను భక్తులు చూసుకోవాల్సి ఉంటుందని వివరాలకు 77804 33533, 95739 53143 నంబర్లను సంప్రదించాలని ఆయన సూచించారు.
లింగనిర్ధారణ పరీక్షలు చేస్తే చర్యలు తీసుకుంటాం
సూర్యాపేటటౌన్: ఎవరైనా చట్ట విరుద్ధంగా లింగనిర్ధారణ పరీక్షలు చేసినా, అబార్షన్ చేసినా చర్యలు తీసుకుంటామని డీఎంహెచ్‌ఓ కోటాచలం హెచ్చరించారు. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ఆదేశాల మేరకు జిల్లా వైద్యాధికారి ఆధ్వర్యంలో స్పెషల్ డ్రైవ్ టీం సోమవారం జిల్లాలోని 46 స్కానింగ్ సెంటర్లను తనిఖీ చేసింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఆయన వెంట జిల్లా ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ నాజియా, డాక్టర్ మౌనిక, ఏఎస్‌ఐ జ్యోతి, ఎలిశమ్మ, కార్తీక్ పాల్గొన్నారు.
18మందికి షోకాజ్ నోటీసులు
భానుపురి (సూర్యాపేట) : విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించిన 18మందికి కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్ షోకాజ్ నోటీసులు జారీ చేశారు. వీరిలో ప్రిన్సిపాల్‌తో పాటు 15మంది టీచర్లు, ఇద్దరు వంటమనుషులు ఉన్నారు. వివరాలిలా.. తుంగతుర్తిలోని తెలంగాణ గిరిజన సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలను సోమవారం ఉదయం ప్రార్థన వేళ తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ తనిఖీ చేశారు. ఆ సమయంలో ప్రిన్సిపాల్‌తో పాటు 15 మంది టీచర్లు, ఇద్దరు వంట మనుషులు విధుల్లో లేరు. ఎమ్మెల్యే ఈ విషయాన్ని రాష్ట్రస్థాయి అధికారులతో పాటు కలెక్టర్‌కు వివరించారు. కలెక్టర్ వెంటనే స్పంచింది జిల్లా అధికారులను విచారణకు పంపారు. విచారణ అనంతరం అధికారులు ఇచ్చిన నివేదిక ఆధారంగా షోకాజ్ నోటీసులు జారీ చేశారు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠినచర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు.
ఓటరు జాబితాలో అవకతవకలపై ఆరా
మఠంపల్లి: మఠంపల్లి మండలంలోని కిందితండా గ్రామ పంచాయతీ పరిధిలో ఓటరు జాబితాలో అవకతవకలపై డీపీఓ నారాయణరెడ్డి సోమవారం ఆరా తీశారు. ఇంటింటికీ వెళ్లి ఓటర్ల వివరాలను సేకరించారు. కిందితండా గ్రామ పరిధిలో ఓటరు జాబితాలో అవకతవకలపై ఇటీవల మఠంపల్లి ఎంపీడీఓ, ఎంపీఓ ,స్థానిక పంచాయతీ కార్యదర్శులను కలెక్టర్ సస్పెండ్ చేసిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో ఎన్నికల కమిషన్ ఆదేశాలతో ఇంటింటికి వెళ్లి ఓటర్లను కలిసి వివరాలు ఆరా తీశారు. ఆయన వెంట ఎంపీడీఓ జగదీష్‌కుమార్, ఇన్‌చార్జి కార్యదర్శి నాగరాజు , గ్రామ పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.
మిలియన్ మార్చ్ డేను జయప్రదం చేయాలి
భానుపురి : ఈనెల 10న హైదరాబాద్‌లోని ట్యాంక్ బండ్ నుంచి గన్‌పార్క్‌లోని అమరవీరుల స్థూపం వరకు 10వేల మంది తెలంగాణ ఉద్యమకారులతో జరిగే గ్రేట్ తెలంగాణ మిలియన్ మార్చ్ డే ను జయప్రదం చేయాలని తెలంగాణ ఉద్యమకారుల మహిళా వేదిక రాష్ట్ర అధ్యక్షురాలు కోతి మాధవ్‌రెడ్డి, మలిదశ ఉద్యమకారుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పిడమర్తి లింగయ్య కోరారు. మిలియన్ మార్చ్‌డేకు సంబంధించిన పోస్టర్‌ను సోమవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఆవిష్కరించి మాట్లాడారు. 2011 మార్చి 10న సీమాంధ్ర దోపిడీ పాలన పై తెలంగాణ ప్రజలు తిరుగుబాటు జెండా ఎత్తి దండెత్తిన రోజు అని పేర్కొన్నారు. కార్యక్రమంలో కొడి సైదులు యాదవ్, ఎస్.కె.యూసుఫ్ షరీఫ్, మేడబోయిన గంగయ్య, లింగంపల్లి మురళి, అమృనాయక్, అంజయ్య, బారిఖాన్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment