ఎస్‌ఎల్‌బీసీ ఘటనపై న్యాయవిచారణ చేయాలి
భానుపురి (సూర్యాపేట) : ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ ఘటనపై నిపుణులతో న్యాయవిచారణ చేయాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ డిమాండ్ చేశారు. సోమవారం సూర్యాపేట పట్టణంలో నిర్వహించిన సీపీఎం జిల్లావిస్తృతస్థాయి సమావేశానికి ఆయన హాజరై మాట్లాడారు. ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో ప్రమాదానికి గత ప్రభుత్వం అనుసరించిన విధానాలే కారణమని ఆరోపించారు. ప్రస్తుత ప్రభుత్వం కూడా సరైన జాగ్రత్తలు పాటించి ఉంటే ఈ ప్రమాదం జరిగి ఉండేది కాదని అన్నారు. ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ పనులు చేస్తున్న కార్మికుల పరిస్థితి దారుణంగా ఉందని, వారి కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనలో ఉన్నారని అన్నారు. ఇతర రాష్ట్రాల నుండి బతుకుతెరువు కోసం వచ్చి వారు ఇలా ప్రమాదాలకు గురి కావడం బాధాకరమన్నారు. కేంద్రప్రభుత్వం బడ్జెట్‌లో తెలంగాణకు తీవ్ర అన్యాయం చేసిందని విమర్శించారు. రైతు, కార్మిక, వ్యవసాయ కార్మిక వర్గాలకు నిధుల కేటాయింపులో మొండి చేయి చూపిందన్నారు. ప్రధానంగా దళితులు, బలహీన వర్గాలు, విద్య, వైద్య రంగాలకు ప్రాధాన్యతా క్రమంలో నిధులు కేటాయించలేదన్నారు. రైల్వే కోచ్ లకు, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీకి కేటాయింపులు లేవన్నారు. రైతులకు రూ.10వేల కోట్లు, ఎరువులకు రూ.11 వేల కోట్లు సబ్సిడీ తగ్గించారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రానికి నిధులు కేటాయింపు కోసం బీజేపీ ఎంపీలు, కేంద్ర మంత్రులు కేంద్రంపై ఒత్తిడి తేవాలని లేకుంటే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అంతకుముందు సీపీఎం జిల్లా విస్తృతస్థాయి సమావేశం సందర్భంగా పార్టీ పతాకాన్ని సీపీఎం సీనియర్ నాయకుడు బాబు సాబ్ ఆవిష్కరించారు. సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు నెమ్మాది వెంకటేశ్వర్లు అధ్యక్షతన నిర్వహించిన విస్తృతస్థాయి సమావేశంలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి, మల్లు లక్ష్మి, పార్టీ జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున్‌రెడ్డి, డీవైఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షుడు కోట రమేష్, కొలిశెట్టి యాదగిరిరావు, నాగారపు పాండు, రాములు, మట్టిపల్లి సైదులు, కోట గోపి, చెరుకు ఏకలక్ష్మి పాల్గొన్నారు.
ఫ ప్రమాదానికి గత ప్రభుత్వ విధానాలే కారణం
ఫ సీపీఎం జిల్లా విస్తృతస్థాయి సమావేశంలో రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ
ఎస్‌ఎల్‌బీసీ ఘటనపై న్యాయవిచారణ చేయాలి
Comments
Please login to add a commentAdd a comment