గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యం | - | Sakshi
Sakshi News home page

గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యం

Published Thu, Mar 6 2025 1:59 AM | Last Updated on Thu, Mar 6 2025 1:59 AM

-

భువనగిరి: మండలంలోని పగిడిపల్లి గ్రామ పరిధిలో బుధవారం గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పగిడిపల్లి పరిధిలోని పాత కలెక్టరేట్‌ భవనం సమీపంలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహాన్ని స్థానికులు గుర్తించి పోలీసులు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని భువనగిరి ఆస్పత్రి మార్చురీకి తరలించారు. గత వారం రోజులుగా మృతుడు భిక్షాటన చేస్తూ సంచరిస్తున్నాడని గ్రామస్తులు తెలిపారు. మృతుడి వయస్సు 40 నుంచి 45 ఏళ్ల మధ్య ఉంటుందని, వివరాలు తెలిసిన వారు 8712662472, 8712662733 నంబర్లను సంప్రదించాలని ఎస్‌ఐ సంతోష్‌కుమార్‌ సూచించారు.

ఉరేసుకుని వ్యక్తి ఆత్మహత్య

మోత్కూరు: మానసికస్థితి సరిగ్గా లేని వ్యక్తి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన మోత్కూరు పట్టణ శివారులో బుధవారం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మోత్కూరు పట్టణ పరిధిలోని అంగడిబజార్‌కు చెందిన బీసు లింగస్వామి(55) మూడేళ్ల క్రితం రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. అప్పటి నుంచి అతడికి మానసికస్థితి సరిగ్గా ఉండటంలేదు. దీంతో మనస్తాపం చెందిన ఆయన బుధవారం మోత్కూరు పట్టణ శివారులో మోదుగుచెట్టుకు కేబుల్‌ వైరుతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి భార్య బీసు సుజాత ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ డి. నాగరాజు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రామన్నపేట ఏరియా ఆస్పత్రికి తరలించినట్లు పేర్కొన్నారు.

భర్తపై రోకలిబండతో

భార్య దాడి

చౌటుప్పల్‌: భర్తపై భార్య రోకలిబండతో దాడి చేసింది. ఈ ఘటన బుధవారం చౌటుప్పల్‌ పట్టణ కేంద్రంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. భూదాన్‌పోచంపల్లి మండలం దేశ్‌ముఖి గ్రామానికి చెందిన దుర్గం శ్రీనివాస్‌–సునీతలు దంపతుల మధ్య ఇటీవల గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో 15రోజుల క్రితం కూడా భర్తతో గొడవ జరగడంతో సునీత చౌటుప్పల్‌ మండలం ధర్మోజిగూడెంలోని తన తల్లిగారింటికి వెళ్లింది. ఈ సమస్యపై మాట్లాడేందుకు గాను చౌటుప్పల్‌ పట్టణ కేంద్రంలో నివాసముంటున్న సునీత సోదరుడు వీరేశం ఇంటి వద్దకు రావాలని శ్రీనివాస్‌కు సూచించారు. ఈ క్రమంలో బుధవారం శ్రీనివాస్‌ చౌటుప్పల్‌కు వచ్చాడు. మాట్లాడుకునే క్రమంలో మాటామాట పెరగడంతో ఇంట్లో ఉన్న రోకలిబండతో సునీత తన భర్త శ్రీనివాస్‌పై దాడి చేసింది. ఈ దాడిలో గాయపడిన శ్రీనివాస్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ మన్మథకుమార్‌ పేర్కొన్నారు.

బైక్‌ అదుపుతప్పి వ్యక్తి మృతి

నాంపల్లి: బైక్‌ అదుపుతప్పి వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన బుధవారం నాంపల్లి మండలం స్వాములవారి లింగోటం శివారులో జరిగింది. నాంపల్లి మండల కేంద్రానికి చెందిన పూల రవి(33) మర్రిగూడ మండలం వట్టిపల్లి లో నిమ్మ తోట కౌలుకు తీసుకున్నాడు. బుధవారం రాత్రి తోటలో పని ముగించుకొని తన భార్యతో కలిసి బైక్‌పై నాంపల్లికి వస్తుండగా.. స్వాములవారి లింగోటం శివారులో మూలమలుపు వద్ద అదుపుతప్పి కిందపడిపోయారు. రవి తలకు తీవ్ర గాయాలై అక్కడిక్కడే మృతిచెందాడు. అతడి భార్యకు తీవ్ర గాయాలయ్యాయి. ఆమెను చికిత్స నిమిత్తం మాల్‌కు తరలించారు. రవి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం దేవరకొండకు తరలించారు. మృతుడికి ఒక కుమారుడు, కుమారై ఉన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement