ఇద్దరు ఆర్‌ఐలు సస్పెన్షన్‌ | - | Sakshi
Sakshi News home page

ఇద్దరు ఆర్‌ఐలు సస్పెన్షన్‌

Published Thu, Mar 6 2025 2:00 AM | Last Updated on Thu, Mar 6 2025 1:56 AM

ఇద్దర

ఇద్దరు ఆర్‌ఐలు సస్పెన్షన్‌

భానుపురి, మోతె : మోతె తహసీల్దారు కార్యాలయంలో రికార్డులను ట్యాంపరింగ్‌ చేసినందుకు గాను ఇద్దరు ఆర్‌ఐలను సస్పెండ్‌ చేసినట్లు కలెక్టర్‌ తేజస్‌ నంద్‌లాల్‌ పవార్‌ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. మోతె మండల ఆర్‌ఐగా విధులు నిర్వర్తిస్తున్న నిర్మలాదేవి, అదనపు ఆర్‌ఐ షేక్‌ మన్సూర్‌అలీలు పాత పహాణీ రికార్డుల్లో పేర్లు లేకపోయినా పేర్లు ఉన్నట్లు సృష్టించి ధరణిలో మిస్సింగ్‌ సర్వే నంబర్ల కింద 11 దరఖాస్తులు చేయించి భూమి ఉన్నట్లు తప్పుడు ధ్రువీకరణ చేసి పంపించారు. ఈ విషయమై మోతె తహసీల్దారు కార్యాలయంలో మంగళవారం రాత్రి రికార్డులను కలెక్టర్‌ పరిశీలించి ట్యాంపరింగ్‌ జరిగినట్లు నిర్ధారించారు. పలు రికార్డులను ట్యాంపరింగ్‌ చేసి ఉన్నతాధికారులను తప్పుదోవ పట్టించిన మోతె మండల ఆర్‌ఐ నిర్మలాదేవి, అదనపు ఆర్‌ఐ షేక్‌ మన్సూర్‌అలీలను సస్పెండ్‌ చేస్తున్నట్లు తెలిపారు. తర్వాత విచారణలో ప్రమేయం ఉన్న ప్రతి ఒక్కరిపై చర్యలు తీసుకోనట్లు ఆయన పేర్కొన్నారు.

గోదావరి జలాలు పునరుద్ధరణ

అర్వపల్లి: యాసంగి సీజన్‌కుగాను జిల్లాకు వారబందీ విధానంలో ఇవ్వాల్సిన గోదావరి జలాలను ఈసారి మూడు రోజులు ఆలస్యంగా వదిలారు. అయితే మంగళవారం 500 క్యూసెక్కులు వదలగా బుధవారం 1,002 క్యూసెక్కులకు పెంచారు. కాగా 1500క్యూసెక్కులకు పెంచితేనే చివరి భూములకు చేరడంతోపాటు తూములకు సాఫీగా వెళ్తాయని రైతులు చెబుతున్నారు. నీటిని పెంచి, వారబందీ విధానం కాకుండా పంటలు చేతికొచ్చే వరకు వదలాలని అన్నదాతలు నీటి పారుదలశాఖ అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నారు.

చిన్నారుల ఆరోగ్యం

పట్ల జాగ్రత్తలు తీసుకోవాలి

చివ్వెంల(సూర్యాపేట) : చిన్నారుల ఆహారం, ఆరోగ్యం పట్ల తగు జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి పి.శ్రీవాణి సూచించారు. బుధవారం సూర్యాపేట పట్టణంలోని బాల సదన్‌ను సందర్శించారు. విద్యార్థుల సమస్యలపై ఆరా తీశారు. ఆహారం సమయానికి పెడుతున్నారా అని తెలుసుకున్నారు. మధ్యాహ్న భోజనం, బియ్యం పరిశీలించారు. విద్యార్థులు బయటి తిను బండారాలు ఎక్కువగా తినకూడదని, వేసవి కాలం దృష్ట్యా నీరు ఎక్కువగా తాగాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బార్‌ అసోసియేషన్‌ ప్రధాన కార్యదర్శి డపుకు మల్లయ్య, డిఫెన్స్‌ కౌన్సిల్స్‌ బొల్లెద్దు వెంకటరత్నం, బట్టిపల్లి ప్రవీణ్‌ కుమార్‌, పి.వాణి పాల్గొన్నారు.

పొన్నవాహనంపై

నృసింహుడి విహారం

యాదగిరిగుట్ట : యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం స్వామివారు మురళీకృష్ణుడి అలంకారంలో భక్తులకు దర్శనిమిచ్చారు. ఉదయం ప్రధానాలయంలో నిత్యారాధలు నిర్వహించిన అనంతరం నిత్యకల్యాణ మండపంలో స్వామివారిని మురళీకృష్ణుడిగా తీర్చిదిద్ది ప్రత్యేక పల్లకిపై అధిష్టింపజేశారు. అనంతరం అలంకార సేవకు అర్చకులు హారతినిచ్చి ఆలయ తిరు, మాడ వీధుల్లో ఊరేగించారు. ఆ తరువాత మురళీకృష్ణుడికి రాగాలాపన చేశారు. సాయంత్రం ప్రధానాలయంలో సంప్రదాయ పూజలు పూర్తిచేసిన అనంతరం శ్రీస్వామి వారిని పొన్న వాహనసేవపై ఊరేగించారు. ఆచార్యులు, యజ్ఞాచార్యలు, అర్చక బృందం వేద మంత్రాలు, పారాయణాలు పఠిస్తుండగా శ్రీస్వామివారు పొన్నవాహనంపై విహరించారు. ఈ వేడుకల్లో ఈఓ భాస్కర్‌రావు, ఆలయ అనువంశిక ధర్మకర్త నర్సింహమూర్తి, ప్రధానార్చకులు నల్లంథీఘల్‌ లక్ష్మీనరసింహచార్యులు, కాండూరి వెంకటాచార్యులు, డీఈఓ దోర్భల భాస్కర్‌శర్మ పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
ఇద్దరు ఆర్‌ఐలు సస్పెన్షన్‌1
1/2

ఇద్దరు ఆర్‌ఐలు సస్పెన్షన్‌

ఇద్దరు ఆర్‌ఐలు సస్పెన్షన్‌2
2/2

ఇద్దరు ఆర్‌ఐలు సస్పెన్షన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement