కోదాడకు నవోదయ స్కూల్ !
కోదాడ: కోదాడలో మరో ప్రతిష్టాత్మక విద్యాసంస్థను ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది. అన్నీ అనుకూలిస్తే వచ్చే విద్యాసంవత్సరమే ఈ విద్యాసంస్థ ఏర్పాటయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఎంతో మందిని ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దిన కేఆర్‌ఆర్ డిగ్రీ కళాశాల ఆవరణలో ఉన్న ఖాళీ స్థలంలో ఇది ఏర్పాటు కానుంది. కేంద్ర ప్రభుత్వం సూర్యాపేట జిల్లాకు నవోదయ స్కూల్‌ను మంజూరు చేసింది. దీన్ని ఏర్పాటు చేయడానికి జిల్లా యంత్రాంగం సరైన స్థలం కోసం అన్వేషణ చేస్తోంది. ఈ క్రమంలో కోదాడలోని కేఆర్‌ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు సంబంధించి దాదాపు 40 ఎకరాల ఖాళీ స్థలం అధికారుల దృష్టికి వెళ్లింది. వారం రోజుల క్రితం కోదాడ ఆర్డీఓ సూర్యనారాయణ ఈ స్థలాన్ని పరిశీలించారు. గురువారం కోదాడకు వచ్చిన జాయింట్ కలెక్టర్ రాంబాబు డిగ్రీ కళాశాల వద్దకు వెళ్లి ఖాళీగా ఉన్న స్ధలాన్ని పరిశీలించారు. కోదాడ ఆర్డీఓ, తహసీల్దార్ సర్వేయర్‌తో కలిసి ఆయన ఈ స్థలాన్ని పరిశీలించి పూర్తి వివరాలను అందించాలని ఆదేశించినట్లు సమాచారం.
స్వాగతిస్తున్న విద్యా వేత్తలు..
కోదాడలో విద్యాసంస్థలను ఏర్పాటు చేయడానికి కొండపల్లి రాఘవమ్మ, రంగారావులు ఇచ్చిన విరాళంతో బాలాజీనగర్ వద్ద దాదాపు 50 ఎకరాల విస్తీర్ణంలో కేఆర్‌ఆర్ డిగ్రీ, జూనియర్ కళాశాలలను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం డిగ్రీ, జూనియర్ కళాశాలలు కలిపి 15 ఎకరాల విస్తీర్ణంలో ఉండగా మరో 35 ఎకరాల స్థలం ఖాళీగా ఉంటుంది. దీని చుట్టూ ప్రహరీ లేకపోవడంతో ఆక్రమణలకు గురవుతోంది. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం కళాశాలకు చెందిన ఖాళీ స్థలంలో నవోదయ విద్యాలయాన్ని ఏర్పాటు చేయడం ఎంతో మేలని పలువురు విద్యావేత్తలు అభిప్రాయ పడుతున్నారు. విద్యాసంస్థల కోసం దాతలు భూమిని ఇచ్చారని దీని ఏర్పాటు వల్ల వారి ఆశయం కూడ నెరవేరుతుందని కళాశాల పూర్వ విద్యార్థులు అభిప్రాయ పడుతున్నారు. అన్ని సౌకర్యాలున్న ఈ ప్రాంతంలో నవోదయ విద్యాలయాన్ని ఏర్పాటు చేస్తే కోదాడ ప్రాంతం విద్యాహబ్‌గా మారుతుందని వారు అంటున్నారు.
ఫ కేఆర్‌ఆర్ డిగ్రీ కళాశాల ఖాళీ స్థలంలో ఏర్పాటు చేసే అవకాశం
ఫ స్ధలాన్ని పరిశీలించిన అదనపు కలెక్టర్
ఫ స్వాగతిస్తున్న విద్యావేత్తలు
స్థలాన్ని పరిశీలించాం
జిల్లాకు మంజూరైన నవోదయ విద్యాలయాన్ని ఏర్పాటు చేయడానికి సరైన స్థలం కోసం చూస్తున్నాం. కేఆర్‌ఆర్ కళాశాల వద్ద ఖాళీ స్థలం ఉందనే సమాచారంతో పరిశీలించాం. అదనపు కలెక్టర్ కూడా ఈ స్థలాన్ని పరిశీలించారు. ఇక్కడ నవోదయ విద్యాలయాన్ని ఏర్పాటు చేయడానికి అన్ని పరిస్థితులు బాగున్నాయి. దీనిపై ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోవాలి.
– సీహెచ్. సూర్యనారాయణ,
ఆర్డీఓ కోదాడ.
Comments
Please login to add a commentAdd a comment