నయన మనోహరం.. నృసింహుడి కల్యాణం
యాదగిరిగుట్ట : యాదగిరీశుడి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీలక్ష్మీనరసింహుడి తిరుకల్యాణోత్సవం శనివారం రాత్రి వైభవంగా సాగింది. పట్టువస్త్రాలు, వజ్రవైడూర్యాలు, బంగారు ఆభరణాలతో పెళ్లికొడుకుగా ముస్తాబైన శ్రీస్వామివారు గజవాహనంపై, నవ వధువుగా శ్రీలక్ష్మీదేవి దివ్య అలంకార శోభితమై ప్రత్యేక పల్లకిలో రాత్రి 8.30 గంటలకు ఊరేగింపుగా బయలుదేరి 9 గంటలకు ఉత్తర మాడవీఽఽధిలో ఏర్పాటు చేసిన కల్యాణవేదికపైకి చేరుకున్నారు. కల్యాణ వేదికపై శ్రీస్వామి, అమ్మవారిని ఎదురెదురుగా అధిష్టింజేసిన అర్చకులు.. కల్యాణానికి శ్రీకారం చుట్టారు. అర్చకబృందం, వేదపండితులు, పారాయణీకులు వేదమంత్రాలు, పారాయణాలు పఠిస్తుండగా ప్రధానార్చకులు శ్రీస్వామివారికి జంజరాధారణ (యజ్ఞోపవితం) గావించారు. ఆ వెంటనే నృసింహుడు అమ్మవారికి, అమ్మవారు నృసింహుడికి జీలకర్ర బెల్లం పెట్టే తంతు పూర్తి చేశారు. అనంతరం వేదపండితుల మంత్రోచ్ఛరణలు, మంగళవాయిద్యాలు, సన్నాయిమేళాలు మోగుతుండగా, భక్తులు జయజయద్వానాల మధ్య మాంగల్యధారణ గావించి ముత్యాల తలంబ్రాల వేడుక నిర్వహించారు.
పట్టువస్త్రాల సమర్పణ
రాష్ట్ర ప్రభుత్వం తరఫున, టీటీడీ తరఫున, భూదాన్‌పోచంపల్లి తరపున, భక్తుల తరపున తీసుకువచ్చిన పట్టు వస్త్రాలతో అలంకార సేవలో ప్రజాప్రతినిధులు, ఆలయాధికారులు, భక్తులు నడిచారు.
ఉదయం శ్రీరాముడిగా దర్శనం
శనివారం ఉదయం ప్రధానాలయంలో నిత్యారాధనలు పూర్తయిన అనంతరం స్వామివారిని శ్రీరాముడిగా అలంకరించి హనుమంత వాహనంపై మాడ వీధుల్లో ఊరేగించారు. ఈ వేడుకల్లో దేవస్థానం ఈఓ భాస్కర్‌రావు, అనువంశిక ధర్మకర్త నర్సింహమూర్తి, ప్రధానార్చకులు నల్లంథీఘల్ లక్ష్మీనరసింహాచార్యులు, కాండూరి వెంకటచార్యులు తదితరులు పాల్గొన్నారు.
ఫ యాదగిరిగుట్టలో వైభవంగా శ్రీలక్ష్మీనరసింహుల కల్యాణమహోత్సవం
బ్రహ్మోత్సవాల్లో నేడు
ఆదివారం ఉదయం శ్రీస్వామి వారు శ్రీమహావిష్ణు అలంకారంతో గరుడవాహన సేవలో భక్తులకు దర్శనమివ్వనున్నారు. రాత్రి దివ్య విమాన రథోత్సవం నిర్వహిస్తారు.
Comments
Please login to add a commentAdd a comment