
ఖాళీలతో అవస్థలు..!
ఈ ఫొటోలో చిన్నారులు, గర్భిణులకు పౌష్టికాహారం ఇస్తున్నది ఆత్మకూర్ (ఎస్) మండలం మక్తాకొత్తగూడెంలోని అంగన్‌వాడీ సెంటర్‌లోనిది. ఈ సెంటర్ అంగన్‌వాడీ టీచర్ నాలుగేళ్ల క్రితం సూపర్‌వైజర్‌గా పదోన్నతి పొందారు. ఇక ఆయాకు 65 ఏళ్లు నిండడంతో పది నెలల క్రితం రిటైర్డ్ అయ్యారు. దీంతో సెంటర్‌లో 15 మందికి పైగా పిల్లలు, గర్భిణులు, బాలింతలు ఇలా మొత్తం 40 మంది వరకు పౌష్టికాహారం ఇచ్చేందుకు బొప్పారం, శెట్టిగూడెం తండాకు చెందిన అంగన్‌వాడీ టీచర్లకు బాధ్యతలు అప్పగించాల్సిందిగా అధికారులు ఆదేశాలు ఇచ్చారు. ఈ నేపథ్యంలో ప్రతినెలా ఒకరోజున లబ్ధిదారులకు పౌష్టికాహారం ఇస్తున్నారు. ఇదీ జిల్లాలో చాలా సెంటర్లలో అదనపు బాధ్యతలతో టీచర్లు, ఆయాలు, సమయానికి పౌష్టికాహారం అందక పిల్లలు ఇబ్బంది పడుతున్నారు.
భానుపురి (సూర్యాపేట) : జిల్లాలో అంగన్‌వాడీ కేంద్రాల్లో ఏళ్లు తరబడి టీచర్, ఆయా పోస్టులు భర్తీకి నోచుకోవడంలేదు. దీంతో ఆయా ప్రాంతాల్లో పనిచేస్తున్న వారిపై తీవ్ర పనిభారం పడుతోంది. ఇద్దరి పనిని ఒక్కరే చేయడం, సెలవు దొరకకపోవడంతో చాలా ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాలో అంగన్‌వాడీ టీచర్లు, ఆయా పోస్టుల భర్తీకి పలుమార్లు ప్రయత్నాలు జరిగినా ముందుకు సాగలేదు. దీంతో కొన్నేళ్లుగా పోస్టులు ఖాళీగానే ఉన్నాయి.
వివిధ కారణాలతో ఖాళీ..
సూర్యాపేట జిల్లాలో ఐదు ప్రాజెక్టుల కింద 1,209 అంగన్‌వాడీ సెంటర్లు ఉన్నాయి. ఈ సెంటర్లలో 30వేల మంది దాకా చిన్నారులు, మరో 20వేల మంది దాకా గర్భిణులు, బాలింతలు పౌష్టికాహారం పొందుతున్నారు. అయితే అంగన్‌వాడీ టీచర్లు పనిచేస్తున్న కొందరు వివిధ ఉద్యోగాలు పొందడం, అంగన్‌వాడీల్లోనే సూపర్‌వైజర్లుగా పదోన్నతి పొందడంతో టీచర్ పోస్టులు ఖాళీ అయ్యాయి. ఇటీవల కేంద్ర ప్రభుత్వం 65 ఏళ్లు నిండిన ఆయాలకు పదవీ విరమణ కల్పించడంతో ఆ పోస్టులు సైతం భారీగా ఖాళీ అయ్యాయి. మొత్తంగా జిల్లావ్యాప్తంగా 61 అంగన్‌వాటీ టీచర్, 200 ఆయా పోస్టులు ఖాళీగా ఉన్నట్లు సంబంధిత శాఖ అధికారులు గతంలోనే గుర్తించారు.
భర్తీకి నోచుకోకపోవడంతో..
ఎన్నో సంవత్సరాలుగా అంగన్‌వాడీల పోస్టులు భర్తీకి నోచుకోకపోవడంతో లబ్ధిదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆయాలు ఉన్నచోట టీచర్ లేకపోవడంతో చిన్నారులకు పూర్వ ప్రాథమిక విద్య అందడం లేదు. ఇక టీచర్ ఉండి ఆయా లేనిచోట పిల్లలను తీసుకురావడం, తీసుకెళ్లడం, ఆలనాపాలనా చూడడం, గర్భిణులు, బాలింతలకు ఆరోగ్యలక్ష్మీ పథకం భోజనం వండిపెట్టడం వంటివి అందడం లేదు. ఇందులోనే ఇటీవల ఆయాలకు రిటైర్మెంట్ ఇవ్వడంతో కొన్నిచోట్ల టీచర్‌తో పాటు ఆయా పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ నేపధ్యంలో ప్రస్తుతం పనిచేస్తున్న ఆయాలు, టీచర్లపైనా పనిభారం అధికమైంది. వెంటనే ప్రభుత్వం స్పందించి ఆయా, టీచర్ పోస్టులను భర్తీ చేయాలని లబ్ధిదారులు కోరుకుంటున్నారు.
ఏళ్లుగా భర్తీకాని అంగన్‌వాడీ పోస్టులు
ఆయా ఉంటే టీచర్ లేక.. టీచర్
ఉంటే ఆయా లేక ఇబ్బందులు
ఉన్న టీచర్లు, ఆయాలపైనా పనిభారం
లబ్ధిదారులకు సక్రమంగా
అందని పౌష్టికాహారం
త్వరలోనే భర్తీ కానున్నాయి
జిల్లాలో అంగన్‌వాడీ టీచర్, ఆయా పోస్టులు ఖాళీగా ఉన్నాయి. గతంలోనే ఈ ఖాళీలను గుర్తించి ప్రభుత్వానికి నివేదించాం. ప్రభుత్వం త్వరలోనే ఈ పోస్టులను భర్తీ చేయనుంది. అప్పటి వరకు సెంటర్లలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తున్నాం.
– నరసింహారావు, సంక్షేమాధికారి
Comments
Please login to add a commentAdd a comment