నీడలేదు.. నీళ్లు లేవు!
ఉపాధి హామీ పనిప్రదేశంలో కనీస వసతులు కరువు
నాగారం : ఉపాధి పనుల నిర్వహణకు పెద్ద పీట వేస్తున్నామని ప్రభుత్వం చెబుతున్నా క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. పనిప్రదేశంలో సరైన వసతులు లేక కూలీలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వేసవిలో రోజురోజుకూ ఉష్ణోగ్రతలు పెరుగుతుండడంతో ఎండలోనే సేదదీరాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. తాగునీరు అందుబాటులోలేక ఇంటి నుంచే తెచ్చుకుంటున్నారు. కూలీల వలసలు నిరోధించి ఉన్న ఊరిలోనే పనులు కల్పించాలన్న ఉద్దేశంతో మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టింది. దీనిని విజయవంతంగా చేపట్టేందుకు నూతన సాంకేతికతను సైతం వినియోగిస్తోంది. కూలీల వివరాలు ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు నేషనల్ మొబైల్ మానిటరింగ్ సిస్టం (ఎన్‌ఎంఎంఎస్)ను ప్రవేశపెట్టింది. వచ్చిన వారి ఫొటోను ఉదయం పని ప్రదేశం నుంచే తీసి పోర్టల్‌లో నమోదు చేయడం, పనులు పూర్తయిన తరువాత మళ్లీ ఫొటో తీసి నిక్షిప్తం చేయడం వంటి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు.
చేపడుతున్న పనులు ఇవీ..
జిల్లాలో 23 మండలాల్లో ఉపాధిహామీ పనులు ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం ఇంకుడు గుంతలు, పశువుల షెడ్ల నిర్మాణం, కోళ్ల షెడ్లు, నీటి తొట్లు, నీటి నిల్వ వసతులు, నర్సరీల ఏర్పాటు, చెక్ డ్యామ్‌లు, వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం, పంట పొలాలకు రోడ్ల అనుసంధానం, నీటి కుంటల నిర్మాణం, వనమహోత్సవంలో పండ్ల తోటల పెంపకం, మొక్కల సంరక్షణకు తదితర పనులను చేపడుతున్నారు.
పొంచి ఉన్న వడదెబ్బ ముప్పు
జిల్లాలో పని ప్రదేశాల్లో వడదెబ్బ తగిలి ఏటా ఆరెడు గురు మృత్యువాత పడుతున్నారు. మరికొందరు తీవ్ర అస్వస్థతకు గురవుతున్నారు. ఏప్రిల్ 1 నుంచి కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభం కానుంది. అప్పుడు కూలీల సంఖ్య ఒక్కసారిగా పెరుగుతుంది. ఉపాధి కూలీలు భోజనం చేయడానికి, అలసటగా ఉన్నప్పుడు సేద దీరడానికి ప్రభుత్వం గతంలో షామియానాలు (టెంట్లు) పంపిణీ చేసేది. కానీ కొన్నేళ్లుగా టెంట్లు అందించడం లేదు.
సరఫరా కాని మెడికల్ కిట్లు
పనులు చేసే సమయంలో కూలీలకు గాయాలైన సందర్భంలో ప్రాథమిక చికిత్స కిట్లు సమకూర్చాలి. కిట్‌లో అయోడిన్, బ్యాండేజ్, ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు, కొన్ని రకాల మాత్రలు అందుబాటులో ఉంచాలి. కొన్నేళ్లుగా వీటి సరఫరా నిలిచిపోయింది.
సౌకర్యాలపై దృష్టి సారిస్తున్నాం
పని ప్రదేశాల్లో కూలీలకు ఇబ్బందులు కలగకుండా దృష్టి సారిస్తున్నాం. పని చేసేచోట సౌకర్యాల కోసం తగిన ఏర్పాట్లు చేయాలని సూచించాం. వేసవిలో ఉపాఽధి కూలీలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటాం.
–వి.వి అప్పారావు, డీఆర్‌డీఓ, సూర్యాపేట.
ఇంటి నుంచే తాగునీరు..
పని ప్రదేశాల్లో తాగునీటి సదుపాయం లేదు. కూలీలు ఇళ్లనుంచే నీటిని డబ్బాలు, బాటిళ్లలో తెచ్చుకుంటున్నారు. గతంలో కూలీలకు తాగునీటి సౌకర్యం కల్పించేందుకు ప్రత్యేకంగా ఒక కూలీని నియమించేవారు. ఈ విధానాన్ని తొలగించి గ్రామ పంచాయతీ వారే ఉపాధి కూలీలకు తాగునీటి సౌకర్యం కల్పించాలని నిబంధనలు విధించారు. కానీ ఎక్కడ కూడా నీటి వసతి కల్పించిన దాఖలాలు కన్పించడంలేదు.
గ్రామ పంచాయతీలు 475
మొత్తం జాబ్ కార్డులు 2.62 లక్షలు
నమోదైన కూలీల సంఖ్య 5.71లక్షలు
ఉపాధి పనులకు వెళ్లేవారు 1.47లక్షలు
ప్రస్తుతం పనులకు హాజరవుతున్న కూలీల
సంఖ్య 18,775
100 రోజుల పనిదినాలు పూర్తి చేసిన కుటుంబాలు 596
ఫ అందుబాటులో లేని టెంట్లు, మెడికల్ కిట్లు, తాగునీరు
ఫ ఎండలకు ఇబ్బందులు పడుతున్న కూలీలు
చెట్లను ఆశ్రయిస్తున్న కూలీలు
రోజు రోజుకూ పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతుండటంతో ఉపాధి పనులు చేసేచోట కనీస వసతులు లేక కూలీలు ఎండలకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నీడ కోసం గతంలో సమకూర్చిన టెంట్లు పనికిరాకుండా పోయాయి. మళ్లీ వాటి మంజూరుపై మూడేళ్లుగా ఎలాంటి స్పష్టత లేదు. పనిచేసే చోట నీడ లేక ఎండలకు కాస్త సేదదీరడానికి చెట్లను ఆశ్రయించాల్సి వస్తోంది.
నీడలేదు.. నీళ్లు లేవు!
Comments
Please login to add a commentAdd a comment