రవాణా చార్జీలు వచ్చేశాయ్..
హుజూర్‌నగర్: దూరప్రాంతాల నుంచి వచ్చి ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటున్న నిరుపేద విద్యార్థులకు ప్రభుత్వం తీపికబురు వినిపించింది. ఈ విద్యాసంవత్సరానికి సంబంధించి రవాణా చార్జీలను విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కరోనా ముందు వరకు విద్యార్థులకు రవాణా చార్జీలు అందించిన ప్రభుత్వం నాలుగు ఏళ్ల నుంచి నిలిపివేసింది. దీంతో చాలామంది విద్యార్థులు ఇబ్బందులు పడ్డారు. ఈ నేపథ్యంలో చాలామంది విద్యార్థులు ఆటోలు, బస్సుల్లో, కొందరు నడుచుకుంటూ పాఠశాలలకు వస్తున్నారు. ఆర్థిక స్థోమత లేని పేదబాలికలు బడి మానేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. మరికొందరు కిరాయిలు భారంగా మారి సక్రమంగా పాఠశాలలకు రాలేక పోతున్నారు. ఈ పరిస్థితులను గమనించిన ప్రభుత్వం గతంలో మాదిరిగా రవాణా చార్జీలను నాలుగేళ్ల తర్వాత పునరుద్ధరించింది.
జిల్లాకు రూ.67.56 లక్షలు
జిల్లాలోని వివిధ ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు రవాణా చార్జీల కింద ప్రభుత్వం మొత్తం రూ.67.56 లక్షలు విడుదల చేసింది. వాటిలో ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలకు సంబంధించి 1,042 మంది విద్యార్థులకు రూ.6 వేల చొప్పున రూ 62.52 లక్షలు మంజూరు చేసింది. అంతే కాకుండా పీఎంశ్రీ పేజ్ –1 కింద 22 పాఠశాలల్లో ఎంపికై న 77 మంది విద్యార్థులకు రవాణా చార్జీలు రూ.4.20 లక్షలు మంజూరు చేసింది. పీఎంశ్రీ పేజ్–2 కింద ఎంపికై న 9 పాఠశాలల్లోని 14 మంది విద్యార్థులకు రవాణా చార్జీలు కింద రూ.84 వేలు విడుదల చేసింది.
తప్పనున్న ఆర్థికభారం
ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలకు కిలోమీటరుకు పైగా, ప్రాథమికోన్నత పాఠశాలకు 3 కిలోమీటర్లు, ఉన్నత పాఠశాలకు 5 కిలోమీటర్లకు పైగా దూరం నుంచి వస్తున్న విద్యార్థులకు ఈ పథకం వర్తిస్తుంది. ఏడాదికి ఒక విద్యార్థికి రూ.6 వేల చొప్పున ప్రభుత్వం రవాణా చార్జీలు చెల్లిస్తుంది. ఇందుకు విద్యార్థి హాజరు ప్రతినెలా 80 శాతం ఉండాలి. ప్రస్తుతం రవాణా చార్జీలు విడుదల కావడంతో తమకు ఆర్థికభారం తప్పనుందని తల్లిదండ్రులు అంటున్నారు. ప్రభుత్వనిర్ణయంతో ప్రభుత్వ పాఠశాలల్లో ఇక నుంచి హాజరు శాతం పెరిగే అవకాశం ఉంది.
ప్రభుత్వ స్కూళ్లలో చదివే విద్యార్థులకు తీపికబురు
ఫ ఒక్కో విద్యార్థికి రూ.6 వేల చొప్పున రూ.62.52 లక్షలు విడుదల
ఫ పీఎం శ్రీ ద్వారా అదనంగా మరో రూ.5.04 లక్షలు
ఫ జిల్లాలో 1,133 మందికి ప్రయోజనం
నేరుగా విద్యార్థుల ఖాతాల్లో జమ చేస్తాం
ఈ విద్యా సంవత్సరానికి సంబంధించిన రవాణా చార్జీలు చెల్లింపుల కోసం సీఆర్‌పీల ద్వారా విద్యార్థుల బ్యాంకు ఖాతాలు సేకరిస్తాం. ఆయా విద్యార్థుల ఖాతాల్లో డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్సఫర్ (డీబీటీ) ద్వారా జిల్లా కార్యాలయం నుంచే రవాణా చార్జీలు జమ చేస్తాం.
– కందిబండ శ్రవణ్‌కుమార్, జిల్లా ప్లానింగ్ కోఆర్డినేటర్, సూర్యాపేట
రవాణా చార్జీలు వచ్చేశాయ్..
Comments
Please login to add a commentAdd a comment