గోదావరి జలాలు నిలిపివేత
అర్వపల్లి: ప్రస్తుత యాసంగి సీజన్‌కుగాను జిల్లాకు వారబందీ విధానంలో విడుదల చేస్తున్న గోదావరి జలాలను మంగళవారం నిలిపివేశారు. అయితే వారబందీ విధానంలో ఈనెల 1న విడుదల చేయాల్సి ఉండగా రెండు రోజులు ఆలస్యంగా వదిలారు. అయితే వారం రోజులు కావడంతో నీటిని నిలిపివేశారు. కాగా వారబందీ విధానంలో నీటిపారుదలశాఖ ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఈ వారం గడిచాక వచ్చేవారం నీటిని జిల్లాకు పునరుద్ధరించనున్నారు. రైతులు మాత్రం పంటలు చేతికొచ్చే వరకు నీటిని నిరంతరాయంగా ఇవ్వాలని అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నారు.
ఏప్రిల్ 11 నుంచి ఎంజీయూ డిగ్రీ పరీక్షలు
నల్లగొండ టూటౌన్ : మహాత్మాగాంధీ యూనివర్సిటీ పరిధిలో డిగ్రీ పరీక్షలు ఏప్రిల్ 11 నుంచి నిర్వహించనున్నట్లు ఎంజీయూ సీఓఈ డాక్టర్ జి.ఉపేందర్‌రెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. 11న నుంచి డిగ్రీ ఒకటవ సెమిస్టర్, మూడవ సెమిస్టర్ పరీక్షలు ఉంటాయని, 16 నుంచి ఐదవ సెమిస్టర్, 15 నుంచి రెండు, నాలుగు, ఆరు సెమిస్టర్ల రెగ్యులర్, బ్యాక్‌లాగ్ విద్యార్థులకు పరీక్షలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఎంజీయూ పరిధిలోని సీబీఎస్సీ విధానంలో డిగ్రీ అభ్యసించి ఉత్తీర్ణత సాధించని వారికి చివరి అవకాశం కల్పిస్తూ.. ఒకటి, రెండు, మూడు, నాలుగు, ఐదు, ఆరు సెమిస్టర్ల బ్యాక్‌లాగ్ పరీక్షలు ఏప్రిల్ 4 నుంచి నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పరీక్షలకు సంబంధించిన పూర్తి టైం టేబుల్, వివరాలను యూనివర్సిటీ వెబ్‌సైట్‌లో పొందుపరిచినట్లు పేర్కొన్నారు.
వందశాతం ఉత్తీర్ణత సాధించాలి
చివ్వెంల : పదోతరగతిలో విద్యార్థులు వందశాతం ఉత్తీర్ణత సాధించాలని మహిళా సాధికారత కేంద్ర జిల్లా కో ఆర్టినేటర్ చైతన్య సూచించారు. మంగళవారం చివ్వెంల మండల పరిధిలోని వట్టిఖమ్మంపహాడ్ గ్రామంలో బేటి పడావో–బేటి బచావో కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు పలు సామాజిక అంశాలపై అవగాహన కల్పించారు. బ్యాడ్ టచ్– గుడ్ టచ్ పై విద్యార్థినులకు వివరించారు. బాల్య వివాహాలు, 18సంవత్సరాల లోపు పిల్లలను పనిలో పెట్టుకోవడం, అక్రమ రవాణా వంటి సమస్యలపై 1098 నంబర్‌కు సమాచారం అందించాలని కోరారు. అదే విధంగా మహిళలకు ఇబ్బందులు ఎదురైతే 181 టోల్ ఫ్రీ నంబర్ కు ఫోన్ చేయవచ్చని, సఖీ సెంటర్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చని సూచించారు. వయోవృద్ధులకు ఇబ్బందులు ఎదురైతే 104567నంబర్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చనన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మహిళల కోసం అందిస్తున్న పథకాలను, అదే విధంగా పని ప్రదేశాల్లో, ఉద్యోగాలు చేసే ప్రదేశాల్లో మహిళల పట్ల లైంగిక వేధింపులపై వివరించారు. ఈ సందర్భంగా 9,10 విద్యార్థులకు పరీక్ష ప్యాడ్లు అందించారు. కార్యక్రమంలో రేవతి, వినోద్, ఎం.క్రాంతికుమార్, హెచ్‌ఎం శ్రీనివాస్, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.
ఆరుగురు సీఐల బదిలీ
నల్లగొండ : ఉమ్మడి జిల్లాలో ఆరుగురు సీఐలను బదిలీ చేస్తూ ఐజీ ఉత్తర్వులు మంగళవారం జారీ చేశారు. మహబూబ్‌నగర్ జిల్లా మల్టీ జోన్–2లో పోస్టింగ్ కోసం ఎదురు చూస్తున్న కె.ఆదిరెడ్డిని నాంపల్లి సీఐగా, నల్లగొండ ట్రాఫిక్ పీఎస్‌లో పనిచేసే రాజును చండూరు సీఐగా, పీసీఆర్ నల్లగొండలో పనిచేసే కె.శివశంకర్‌ను సూర్యాపేట జిల్లా కోదాడ సీఐగా, నాంపల్లి సీఐగా పనిచేస్తున్న అనంతుల నవీన్‌కుమార్‌ను హైదరాబాద్ సిటీ కమిషరేట్‌కు, చండూరు సీఐగా పని చేస్తున్న ఎ.వెంకటయ్యను, కోదాడ టౌన్ సీఐగా పని చేస్తున్న రాములును హైదరాబాద్ కమిషనరేట్‌కు బదిలీ చేశారు.
నేటి నుంచి ఆర్జిత సేవలు పునఃప్రారంభం
యాదగిరిగుట్ట: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈ నెల 1వ తేదీ నుంచి మంగళవారం వరకు నిత్య కల్యాణం, సుదర్శన నారసింహ హోమం, గజవాహన సేవ, బ్రహ్మోత్సవం వంటి పూజలు ఆలయాధికారులు రద్దు చేశారు. బ్రహ్మోత్సవాలు ముగిసిన నేపథ్యంలో బుధవారం నుంచి ఆర్జిత సేవలు పునఃప్రారంభించనున్నారు. శ్రీసుదర్శన నారసింహ హోమం, గజవాహన సేవ, నిత్య కల్యాణం, జోడు సేవలు, బ్రహ్మోత్సవం వంటి పూజలు ఆగమశాస్త్రానుసారం ప్రారంభిస్తామని అర్చకులు వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment