జిల్లావ్యాప్తంగా ఎండుతున్న నిమ్మతోటలు
ఫ భూగర్భ జలాలు అడుగంటడమే కారణం
ఫ ఆందోళనలో రైతులు
ఫ సాగర్ ఎడమ కాలువ ద్వారా నీరందించాలని వేడుకోలు
ఫ జిల్లాలో 3,500 ఎకరాలకుపైగా నిమ్మసాగు
నడిగూడెం: గతంలో ఎన్నడూలేని విధంగా ఫిబ్రవరి నెలఖారు నుంచే ఎండల తీవ్ర పెరుగుతుండడంతో భూగర్భ జలాలు అడుగంటుతున్నాయి. ఫలితంగా జిల్లా వ్యాప్తంగా నిమ్మతోటలకు సరిపడా నీరందక చెట్లు ఎండిపోతున్నాయి. అయితే జిల్లా వ్యాప్తంగా 3,500 ఎకరాలకుపైగా నిమ్మతోటలు సాగులో ఉన్నాయి. ప్రధానంగా నడిగూడెం మండల కేంద్రంతోపాటు మండలంలోని బృందావనపురం, వేణుగోపాలపురం, చెన్నకేశ్వాపురం, వెంకట్రాంపురం, కరివిరాల, నారాయణపురం, కాగితరామచంద్రాపురం, రామాపురం, ఎకలాస్‌ఖాన్‌పేట, ఎకలాస్‌ఖాన్‌పేట తండా, తెల్లబల్లి గ్రామాల పరిధిలో అత్యధికంగా 2వేల పైచిలుకు ఎకరాల్లో నిమ్మతోటలు సాగులో ఉన్నాయి. జిల్లాలో రోజురోజుకూ భూగర్భ జలాలు లోలోతుకు పడిపోతున్నాయి. ఫలితంగా వ్యవసాయ బావులు పూర్తిగా అడుగంటాయి. కొన్ని గ్రామాల్లో బోర్లు పిక్కిపోయాయి. మరికొన్ని గ్రామాల్లో కొద్దిపాటి నీరందిస్తున్నప్పటికీ తోటలకు సరిపోవడం లేదు. దీంతో వివిధ గ్రామాల్లో సాగులో ఉన్న నిమ్మ తోటలు ఎండుతున్నాయి. ఇప్పటికే నిమ్మ తోటల సాగుకు వేలాది రూపాయల పెట్టుబడులు పెట్టామని, నిమ్మకు మంచి డిమాండ్ లభించే వేసవిలో సాగు నీరు లేకపోవడంతో తాము తీవ్రంగా నష్టపోతున్నామని నిమ్మ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
సాగర్ నీటితో చెరువులు నింపితే మేలు
జిల్లాలో నిమ్మతోటలు సాగులో ఉన్న గ్రామాల్లోని చెరువులను సాగర్ ఎడమ కాలువ నీటితో నింపితే తోటలు ఎండిపోకుండా ఉంటాయని నిమ్మ రైతులు అంటున్నారు. ముఖ్యంగా నిమ్మతోటలు అత్యధికంగా సాగులో ఉన్న నడిగూడెం మండలంలోని గ్రామాల పరిధిలో గల చెరువులను నింపడం వల్ల భూగర్భ జలాలు కొంతైనా పెరిగే అవకాశం ఉందని అక్కడి రైతులు అంటున్నారు. సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి ప్రస్తుత వేసవిలో సాగర్ నీటితో చెరువులను నింపాలని నడిగూడెంతోపాటు ఇతర మండలాల రైతులు కోరుతున్నారు.
నిమ్మకు నీరందట్లే..